Hidma Encounter | ఎన్‌కౌంటరేనా?.. హిడ్మా మరణంపై పలు అనుమానాలు!

అనేక దాడులు... ఎన్ కౌంటర్లలో చనిపోయారంటూ పదేపదే ప్రకటించబడి, పలు మార్లు చనిపోయినట్లు చెప్పినా మృత్యుంజయుడిగా నిలుస్తూ నిరంతరం చర్చల్లో నిలిచిన మావోయిస్టు నేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిడ్నాల్, అలియాస్ విశాల్ ఈసారి జరిగిన ఎన్ కౌంటర్ లో ఎట్టకేలకు చనిపోయారు.

  • By: chinna |    national |    Published on : Nov 18, 2025 8:34 PM IST
Hidma Encounter | ఎన్‌కౌంటరేనా?.. హిడ్మా మరణంపై పలు అనుమానాలు!
  • ఈ‘సారీ’ ఎట్టకేలకు ఎన్కౌంటర్ చేశారూ!
  • ఎక్కడేం జరిగినా తెరపైకి హిడ్నా పేరు
  • ముగిసిన మావోయిస్టు నేత హిడ్మా ప్రస్థానం
  • అడవిని విడిచారూ..అసువులు బాశారూ?

విధాత, ప్రత్యేక ప్రతినిధి:

అనేక దాడులు… ఎన్ కౌంటర్లలో చనిపోయారంటూ పదేపదే ప్రకటించబడి, పలు మార్లు చనిపోయినట్లు చెప్పినా మృత్యుంజయుడిగా నిలుస్తూ నిరంతరం చర్చల్లో నిలిచిన మావోయిస్టు నేత మడావి హిడ్మా అలియాస్ సంతోష్ అలియాస్ హిడ్నాల్, అలియాస్ విశాల్ ఈసారి జరిగిన ఎన్ కౌంటర్ లో ఎట్టకేలకు చనిపోయారు. మావోయిస్టు పార్టీ దండకారణ్య చరిత్రలో ఉన్నత స్థానానికి ఎదిగిన ఆదివాసీ బిడ్డ హిడ్మా ఆఖరి శ్వాస మంగళవారం మారేడుమిల్లి అడవిలో ఆగిపోయింది. హిడ్మా ఓ సాదాసీదా ఆదివాసీ యువకుని నుంచి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా, పీపుల్స్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) మొదటి బెటాలియన్ కమాండర్ గా ఎదిగివచ్చిన నేత.

హిడ్మా ఈ పేరు దండకారణ్యం విస్తరించిన ఆరు రాష్ట్రాలలో మారుమోగుతోంది. పోలీసు పరిభాషలో చెప్పాలంటే మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు. అధికారంలో ఉన్న అత్యున్నత స్థాయి నాయకులకు కంటిలో నలుసయ్యాడు. భద్రతాబలగాలకు కంటిమీద కునుకులేకుండా చేశాడు. హిడ్మా పై కోటి రూపాయల రివార్డు ఉందంటనే ప్రభుత్వాలు, భద్రతాబలగాలకు సింహస్వప్నమయ్యారనడానికి నిదర్శనం. ఆదివాసీ గిరిజన తెగలో సాధారణ స్థాయి నుంచి మావోయిస్టు పార్టీ అత్యున్నత కమిటీ కేంద్ర కమిటీ వరకు ఎదిగివచ్చిన నేత. మిలటరీ వ్యూహ, ప్రతివ్యూహాలే కాకుండా గెరిల్లా దాడుల్లో ఆరితేరిన అందెవేసిన చేయి. హిడ్మా ఉన్నాడంటే ఎదుటిపక్షానికి సైతం వెన్నులో వణుకు పుడుతోందని చెబుతారు. దాడులు చేసేందుకు మాటు వేస్తే తిరుగుండదంటారు.

దండకారణ్య దండుకు పర్యాయపేరు

హిడ్మా….దండకారణ్య దండుకు పర్యాయపదంగా నిలిచి గెలిచిన నేతగా పేరొందారు. గత మూడు దశాబ్దాల మావోయిస్టు పార్టీ చరిత్రలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా హిడ్మా పేరే తెరపైకి వచ్చేది. ఆయన ఉన్నా..లేకున్నా..ఆయన పేరే ముందుండేది. భద్రతాబలగాలకు మావోయిస్టులకు జరిగిన అనేక ఎన్ కౌంటర్లలో హిడ్మా ఉన్నారనేది ఒక వాస్తవమైతే….అనేక సంఘటనల నుంచి తృటిలో తప్పించుకున్నారని ప్రకటించేవారూ. భద్రతా బలగాల దాడులు జరిగినప్పుడు కూడా హిడ్మా టార్గెట్ గా జరిగిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కగార్ ఆపరేషన్ ప్రారంభమైన తర్వాత ‘హిడ్మా’ లక్ష్యంగా ఆపరేషన్లు సాగాయి.

ఇందులో కర్రెగుట్టల్లాంటి 21 రోజుల పాటు జరిగిన భీకర యుద్ధాలున్నాయి. హిడ్మాను వేంటాడి ఎట్టకేలకు మంగళవారం ఉదయం ఏపీలోని మారేడుమిల్లి టైగర్ జోన్ లో ఎన్‌కౌంటర్ చేశారు. మారేడుమిల్లి సంఘటనకు ముందు జరిగిన అనేక ఎన్ కౌంటర్లలో హిడ్మా చనిపోయారంటూ పదేపదే ప్రచారం జరిగేది. నిజంగానే చనిపోయారని భావించిన సందర్భాలు కూడా లెక్కకు మించినవి అనేకం ఉన్నాయి. మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో హిడ్మా చనిపోయారంటూ ముందుగా ప్రచారం జరిగితే నిజమేనా? కాదా? అనే సంశయం, సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, అనేక సార్లు చంపబడిన మోస్ట్ వాంటేడ్ మావోయిస్టు హిడ్మా ఎట్టకేలకు ఈ సారీ నిజంగానే చనిపోయారూ… కాదు…కాదు ‘ఎన్ కౌంటర్’ చేశారు. ఆయన సహచరి హేమతో కలిసి అసువులు బాశారు.

యాబైయేళ్ళకు పైగా ఉన్న ఆయన వయస్సులో నాలుగున్నర దశాబ్దాలు మావోయిస్టు ఉద్యమ జీవితమే…ఇందులో సగానికి పైగా ‘యుద్ధ’ జీవితమే సాగింది. మావోయిస్టు సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో హిడ్మా కీలక వ్యక్తి, ఇక బస్తర్ డివిజన్‌లో హిడ్మాకే తుది నిర్ణయాధికారం ఉంటోంది. హిడ్మా అడవిని విడిచి అరుదుగా బయటకు వస్తాడనే పేరుంది. ఈ కారణంగానే ఆయనను ట్రాక్ చేయడం కష్టమంటారు. అనుక్షణం అప్రమత్తతతో వ్యవహరించే హిడ్మా ఈసారి అడవిని విడిచి ఆంధ్రప్రదేశ్లోని ఓ షెల్టర్ లో పట్టుబడినట్లు సమాచారం. చత్తీస్ గడ్ అటవీప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల్లో ఆయన మకాం మార్చినట్లు చెబుతున్నారు. హిడ్మా టీమ్ మెంబర్లు 27 మందిని విజయవాడలో పోలీసులు అరెస్టు చేయగా హిడ్మా మాత్రం మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో మృత్యువాత పడడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఈ ఎన్‌కౌంటర్ పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ ఆయనను పట్టుకుని కాల్చిచంపారంటూ ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘం ఆరోపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే మావోయిస్టు పార్టీ ఉద్యమంలో ఆదివాసీ బిడ్డ హిడ్మా సుదీర్ఘ ప్రస్థానానికి తెరపడింది.

సాధారణ ఆదివాసీ నుంచి కీలక నేత వరకు..

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం సుక్మా జిల్లాలోని పునర్తి గ్రామంలో సాధారణ ఆదివాసీ కుటుంబంలో మడావి హిడ్మా పుట్టారు. చిన్న వయస్సులోనే మావోయిస్టు ఉద్యమంలో భాగస్వామ్యమై మిలటరీ నైపుణ్యంలో దిట్టగా పేరొందారు. హిడ్మాకు హిందీ, గోండి, తెలుగు, కోయ, బెంగాలీ భాషల్లో మంచిపట్టున్నట్లు చెబుతారు. ఈ కారణంగా ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీస్గడ్, చివరికి బెంగాల్ ప్రాంతానికి వెళ్ళిన సులభంగా ప్రజల్లో కలిసిపోయి జీవించేవారని చెబుతారు. ఇక ఆదివాసీ కుటుంబం నుంచి రావడంతో స్థానికంగానే కాకుండా దండకారణ్యంపై మంచి పట్టున్న నేతగా గుర్తింపు పొందారు. అటవీప్రాంతంలోని నైసర్గిక స్వరూపాలు అనుపానాలు, బాటలు, కొండలు, లోయలు, వర్రెలు, మంచినీటి తావులు, సహజసిద్ధమైన షెల్టర్లు ఆయనకు కొట్టినపిండిగా చెబుతారు. అందుకే భద్రతాబలగాలు దశాబ్దాలుగా వేలాది మందితో వేట సాగించినా హిడ్మా టీమ్ ను ఎదుర్కొవడం కష్టంగా ఉండేదంటారు. ఈ ప్లటూన్ మావోయిస్టు పార్టీలో అత్యంత శక్తివంతమైందిగా పేరొందింది. నేషనల్ పార్క్ కేంద్రంగా పనిచేసే హిడ్మాదే భారీ ఆపరేషన్లలో మాస్టర్‌ మైండ్ గా అభివర్ణిస్తారు.

దాడుల్లో సూత్రధారి..పాత్రధారి

దంతేవాడలో 2010 జరిగినదాడిలో హిడ్మాదే ప్రధాన పాత్రగా చెబుతారు. 2013 కాంగ్రెస్ నేతల కాన్వాయ్ పై దాడిలో కీలక పాత్ర ఆయనదే. ఈ దాడిలో మాజీ మంత్రి మహేంద్ర కర్మ, కాంగ్రెస్ నేత నందకుమార్ పటేల్, ఇతర నేతలు, భద్రతా సిబ్బంది సహా 30 మంది మృతి చెందారు. 25 మే 2013 బస్తర్, చత్తీస్‌గఢ్ జీర్వంలో దాడి, బుర్కాపాల్ 2017, సుక్మా 2018లో జరిగిన వరుస తీవ్ర దాడుల్లో కీలక రోల్ గా చెబుతారు. 2021 సుక్మా–బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో కూడా హిడ్మా ప్లానింగ్ ఉన్నట్లు ప్రచారం జరిగింది. పోలీసులు చెప్పిన ప్రకారం ఆయన 31 ఎన్ కౌంటర్లలో పాల్గొన్నారు.