మోదీజీ.. మణిపూర్‌పై ఇకనైనా నోరు విప్పండి : మణిపూర్‌ ఎంపీ అంగోమ్చా బిమల్‌ అకోయిజాం

హింసాకాండతో అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని ఇన్నర్‌ మణిపూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అంగోమ్చా బిమల్‌ అకోయిజాం తీవ్రంగా దుయ్యబట్టారు.

  • Publish Date - July 2, 2024 / 05:37 PM IST

న్యూఢిల్లీ : హింసాకాండతో అల్లకల్లోలంగా ఉన్న మణిపూర్‌ను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిందని ఇన్నర్‌ మణిపూర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అంగోమ్చా బిమల్‌ అకోయిజాం తీవ్రంగా దుయ్యబట్టారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన సోమవారం అర్ధరాత్రి లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘ఈ విషయం కేంద్ర ప్రభుత్వానికి మణిపూర్‌ పట్టదనే అంశాన్ని ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు, ప్రత్యేకించి మణిపూర్‌ ప్రజలకు మీ మౌనం సంకేతాలనిస్తున్నదా?’ అని నిలదీశారు. ఇకనైనా ప్రధాన మంత్రి మణిపూర్‌ విషయంలో నోరు విప్పాలని డిమాండ్‌ చేశారు.
రాష్ట్రపతి ప్రసంగంలో మణిపూర్‌ హింస అంశం లేకపోవడాన్ని బిమల్‌ అకోయిజాం ప్రశ్నించారు. ఇది కేవలం ప్రసంగంలో విస్మరించిన అంశంగా పరిగణించరాదన్నారు. 60వేల మంది ప్రజలు ఏడాదిగా సహాయ శిబిరాల్లో నానా కష్టాలు పడుతున్న అంశాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ‘60వేల మంది నిరాశ్రయులైన అంశం ఆషామాషీ కాదు. 200 మందికిపైగా చనిపోయారు. అంతర్యుద్ధ తరహా పరిస్థితులు అక్కడ నెలకొని ఉన్నాయి. ఒంటి నిండా ఆయుధాలు వేసుకుని అక్కడ ప్రజలు తిరుగుతున్నారు. తమ గ్రామాలను రక్షించుకునేందుకు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. కానీ.. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏడాదిగా మౌన ప్రేక్షకుడిలా చూస్తూ నిలుచున్నది’ అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌ నాయకులు సహా సభలో ఎవరూ లేని సమయంలో తనకు మాట్లాడేందుకు సమయం కేటాయించడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Latest News