Ramoji Rao | రామోజీరావు మృతికి జాతీయ నాయకుల సంతాపాలు

Ramoji Rao | ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు మృతికి జాతీయ స్థాయి నాయకుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. రామోజీ మరణం చాలా బాధాకరమని, ఆయన భారతీయ మీడియా విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని నరేంద్రమదీ కొనియాడారు. రామోజీరావు మీడియాను ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు తీసుకెళ్లిన మహనీయుడని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకున్నారు.

  • By: Thyagi |    national |    Published on : Jun 08, 2024 10:11 AM IST
Ramoji Rao | రామోజీరావు మృతికి జాతీయ నాయకుల సంతాపాలు

Ramoji Rao : ఈనాడు గ్రూప్‌ సంస్థల అధినేత రామోజీరావు మృతికి జాతీయ స్థాయి నాయకుల నుంచి సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. రామోజీ మరణం చాలా బాధాకరమని, ఆయన భారతీయ మీడియా విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడని నరేంద్రమదీ కొనియాడారు. రామోజీరావు మీడియాను ఎవరెస్టు శిఖరమంత ఎత్తుకు తీసుకెళ్లిన మహనీయుడని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలుగాలని కోరుకున్నారు.

రామోజీరావు మరణం మీడియా రంగానికి, భారతీయ సినిమా ప్రపంచానికి తీరని లోటని, ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయెల్ పేర్కొన్నారు. రామోజీరావు మరణం బాధాకరమని, భారతదేశ అభివృద్ధి కోసం ఆయన చూపిన అంకిత భావం అపూర్వమని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రశంసించారు. మీడియా రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చి, సినిమా రంగానికి ఎనలేని సేవ చేసిన రామోజీరావు మరణం బాధాకరమని కాంగ్రెస్‌ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే సంతాపం వ్యక్తం చేశారు.

రామోజీరావు మరణం బాధాకరమని, మీడియా రంగానికి, సినిమా రంగానికి చేసిన సేవల ద్వారా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని కేంద్ర మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి సంతాపం తెలియజేశారు. అదేవిధంగా ఇంకా పలువురు కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు రామోజీకి సంతాపం తెలిపిన వారిలో ఉన్నారు. కాగా, గ‌త కొంతకాలంగా అనారోగ్య స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతున్న రామోజీరావు శుక్రవారం మధ్యాహ్నం తీవ్ర అస్వస్థతకు గురవడంతో నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఈ తెల్లవారుజామున 4.50 గంటలకు క‌న్నుమూశారు.