• Telugu News
  • /National

Mallikarjun Kharge | మమ్మల్ని ప్రేమించి.. మోదీని పెళ్లాడారు.. : దేవెగౌడపై ఖర్గే సెటైర్‌

పదవీవిరమణ చేస్తున్న సభ్యులకు వీడ్కోలు చెప్పే సందర్భంగా రాజ్యసభలో మాట్లాడిన మల్లికార్జున ఖర్గే.. జేడీఎస్‌ నేత హెచ్‌డీ దేవెగౌడపై సెటర్‌ వేశారు. ఆయన తనకు 54 ఏళ్లుగా తెలుసన్న ఖర్గే.. మమ్మల్ని ప్రేమించి.. మోదీని పెళ్లాడారని చమత్కరించడంతో సభలో నవ్వులు పూశాయి.

Reported by: Jagan Mohan Talluri | జాతీయం | Mar 18, 2026, 5:19 pm IST
Read Time: 5 mins
Mallikarjun Kharge | మమ్మల్ని ప్రేమించి.. మోదీని పెళ్లాడారు.. : దేవెగౌడపై ఖర్గే సెటైర్‌

Mallikarjun Kharge | రాజకీయాలు, ప్రజా సేవలో ఉన్న నాయకులకు విశ్రాంతి లేదా విరమణ అంటూ ఉండవని రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. రాజ్యసభ పదవీకాలం ముగిసిన సభ్యులకు ఆయన ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రస్తుతం కొనసాగుతున్న బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ఖర్గే రాజ్యసభలో మాట్లాడారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడనుద్దేశించి… ఆయనతో తనకు 54 ఏళ్లుగా అనుబంధం ఉందని ఖర్గు గుర్తు చేసుకున్నారు. ‘దేవెగౌడ నాకు 54 ఏళ్లుగా తెలుసు. ఆయనతో కలిసి ఎంతోకాలం పనిచేశాను. తర్వాత ఏమైందో నాకు తెలియదు. వో మొహబ్బత్‌ హమారే సాథ్‌ కియా.. షాదీ మోదీ సాహెబ్‌ కే సాథ్‌’ అన్నారు.

అంతకు ముందు ప్రధాని నరేంద్రమోదీ సైతం రిటైర్‌ అవుతున్న రాజ్యసభ సభ్యులకు వీడ్కోలు చెప్పారు. రాజ్యసభ సభ్యులుగా వారు అందించిన సేవలకు గాను ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో ఫుల్‌ స్టాప్‌లు ఉండవన్న మోదీ.. ప్రస్తుతం రిటైర్‌ అవుతున్న సభ్యులు భవిష్యత్తులో నిర్వహించబోయే రాజకీయ పాత్రపై శుభాకాంక్షలు తెలిపారు. ‘సభలో వివిధ అంశాలపై చర్చలు జరుగుతాయి. వాటిలో ప్రతి ఒక్క సభ్యుడూ విశిష్ట పాత్ర పోషిస్తారు. ఇటువంటి సందర్భాల్లో రాజకీయాలకు అతీతంగా ఒక గౌరభావం వెల్లివిరుస్తుంది. పదవీకాలాన్ని ముగించుకుని వెళుతున్న సభ్యులకు నేను చెప్పేదొక్కటే. రాజకీయాల్లో ఫుల్‌స్టాప్‌లు ఉండవు. మీకోసం భవిష్యత్తు వేచి చూస్తున్నది. మీ అనుభవం, మీరందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి’ అని మోదీ అన్నారు. హెచ్‌డీ దేవెగౌడ, మల్లికార్జున ఖర్గే, శరద్‌పవార్‌ వంటి సీనియర్‌ నేతలు వారి జీవితకాలంలో సగం సమయం పార్లమెంటరీ పనుల్లోనే నిమగ్నమయ్యారని మోదీ చెప్పారు. కొత్తగా ఎన్నికైన సభ్యులు వారి నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని అన్నారు.

రాందాస్‌ అథవాలే గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన మోదీ.. సభలో హాస్య చతురతకు, వ్యంగ్యానికి చాలా అవకాశం ఉంటుందని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటామని, అయితే.. ఈ మధ్య కాలంలో అది క్రమంగా తగ్గుముఖం పడుతున్నదని చెప్పారు. కానీ.. అథవాలే ఎవర్‌గ్రీన్‌ అని, ఆయన సభ నుంచి వెళ్లిపోతున్నా.. ఇక్కడ ఎవ్వరూ ఆ లోటు అనుభవించరని, ఆయన హాస్యాన్ని పుష్కలంగా అందిస్తూనే ఉంటారన్న నమ్మకం తనకు ఉందని మోదీ అన్నారు.

మొత్తం 37 మంది సభ్యులు పదవీ విరమణ చేస్తున్నారు. వరిలో అథవాలే, ప్రియాంక చతుర్వేది, తిరుచి శివ, అమరేంద్రధారి, అభిషేక్‌ మను సంఘ్వి కూడా ఉన్నారు. పది రాష్ట్రాల్లోని ఈ స్థానాలను భర్తీ చేసేందుకు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో 26 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.