Pit Bull attack on Boy | న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ప్రేమ్ నగర్ ఏరియాలో ఓ కుక్క స్వైర విహారం చేసింది. కుక్క దాడిలో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుక్క దాడిలో అతని చెవి తెగిపడింది.
వివరాల్లోకి వెళ్తే.. ప్రేమ్ నగర్ ఏరియాలోని విజయ్ ఎన్‌క్లేవ్ వద్ద ఆదివారం సాయంత్రం ఓ బాలుడు ఆడుకుంటున్నాడు. పొరుగింట్లో నుంచి బయటకు వచ్చిన పిట్ బుల్(కుక్క) బాలుడిపై దాడి చేసింది. అతన్ని తీవ్రంగా గాయపరిచింది. బాలుడి కుడి చెవి తెగిపడింది.
అప్రమత్తమైన తల్లిదండ్రులు, స్థానికులు పిట్ బుల్ దాడి నుంచి బాలుడిని కాపాడారు. కుక్కను తరిమేశారు. అనంతరం బాధిత బాలుడిని రోహిణిలోని బీఎస్ఏ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
పిట్ బుల్‌ను రాజేశ్ పాల్ కుటుంబానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఏడాదిన్నర క్రితం రాజేశ్ కుమారుడు సచిన్ పాల్ కుక్కను తీసుకొచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో రాజేశ్ పాల్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
