వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రధాని మోదీ దేశ పరిపాలన చరిత్రలో సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. ఎన్నికైన ప్రధానిగా వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డును బుధవారం ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను అధిగమించి ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. ఇప్పటివరకు జవహర్‌లాల్ నెహ్రూ పేరిట ఉన్న 4,398 రోజుల రికార్డును ఇవాళ్టితో అధిగమిస్తూ మోదీ చరిత్రలో తన పేరును లిఖించుకున్నారు.
2014 మే 26న తొలిసారిగా ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ.. 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి అధికారంలో కొనసాగుతున్నారు. ఈ క్రమంలో బుధవారంతో ఆయన ప్రధానమంత్రి పదవిలో 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. దీంతో ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చి నిరవధికంగా అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నాయకుడిగా నిలిచారు.
భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ తొలి సాధారణ ఎన్నికల అనంతరం 1952లో ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 1964 మే 27న మరణించే వరకు 4,398 రోజుల పాటు నెహ్రు ప్రధానిగా కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును మోదీ అధిగమించారు. ప్రధానమంత్రుల పదవీకాలాల జాబితాలో ఇందిరా గాంధీ 4,077 రోజులతో మూడో స్థానంలో ఉన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ 3,652 రోజులు, అటల్ బిహారీ వాజ్‌పేయి 2,272 రోజులు, పీ.వీ. నరసింహారావు 1,827 రోజులు ప్రధానమంత్రులుగా కొనసాగారు.
అత్యధిక కాలం ప్రభుత్వాధినేత రికార్డు కూడా మోదీ ఖాతాలోనే
స్వతంత్ర భారత చరిత్రలో అత్యధిక కాలం పాలన సాగించిన ఎన్నికైన ప్రభుత్వాధినేతగా (దేశ/రాష్ట్ర) కూడా మోదీ పేరిటే రికార్డు ఉంది. సిక్కిం సీఎంగా పవన్ కుమార్ చామ్లింగ్ 8,930 రోజులు పని చేయగా, మోదీ ఈ ఏడాది మార్చిలోనే (సీఎంగా, పీఎంగా కలుపుకొంటే) ఆ రికార్డును అధిగమించారు. 2001 నుంచి 2014 వరకు ఆయన గుజరాత్ సీఎంగా పనిచేశారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకుని 13వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అదే సమయంలో సుదీర్ఘకాలం దేశ ప్రధానిగా సేవలందించిన వ్యక్తిగా మోదీ రికార్డు సాధించారు. ఈ క్రమంలో బుధవారం ఢిల్లీలో ఎన్డీయే సమావేశంలో ప్రధామోదీని అభినందిస్తూ.. ఎన్డీయేకు ఆయన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సమావేశంలో తీర్మానం చేశారు. ఆయనను ఘన సన్మానించి అభినందనలతో ముంచెత్తారు.
