PM Modi | వికసిత్ భారత్ 2047 నినాదం.. 140 కోట్ల మంది కలల తీర్మానం: ప్రధాని మోదీ
దేశ స్వాతంత్ర్య దినోత్సవం స్ఫూర్తితో 2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యంగా దేశ ప్రజలంతా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు

ప్రపంచానికే అన్నం పెట్టేస్థాయికి భారత్ ఎదగాలి
దేశాభివృద్ధికి పాలనా, న్యాయ సంస్కరణలు అవసరం
ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా భారత్
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
ఎర్రకోటపై దేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ప్రసంగంలో ప్రధాని మోదీ
మహిళల భద్రతకు మరింత శ్రద్ధ పెడుతాం
వారసత్వ రాజకీయాలు దేశ ప్రగతికి ఆటంకం
విధాత : దేశ స్వాతంత్ర్య దినోత్సవం స్ఫూర్తితో 2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యంగా దేశ ప్రజలంతా ముందుకు సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. భారత దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వరుసగా 11వసారి ఆయన ప్రధానిగా జెండా ఎగురవేశారు. వేడుకలకు సుమారు 6 వేల మంది అతిధులు హాజరయ్యారు. అంతకు ముందు ప్రధాని మోదీ రాజ్ ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. జాతీయ పతాకావిష్కరణ అనంతం దేశ ప్రజలనుద్ధేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశం కోసం పోరాడిన మహనీయులను స్మరించుకుందామని ప్రధాని పిలుపునిచ్చారు. “శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందని, దేశం కోసం జీవితాలనే పణంగా పెట్టిన మహనీయులు ఎందరో ఉన్నారని, ప్రాణాలర్పించిన మహనీయులకు దేశం రుణపడి ఉందన్నారు.
భారత దేశ ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. స్వాతంత్య్రం కోసం ఆనాడు 40కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పడు దేశ జనాభా 140 కోట్లకు పెరిగిందని చెప్పారు. ఈ 140కోట్ల జనం కలలను సాకారం చేయాల్సి ఉందన్నారు. ఇందుకు లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగాలన్నారు. మనం అనుకుంటే 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని చెప్పారు. వికసిత భారత్ 2047 నినాదం 140కోట్ల మంది కలల తీర్మానమని.. దళితులు, పీడితులు, ఆదివాసీలు గౌరవంగా బతకాలన్నారు. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలని, తయారీ రంగంలో గ్లోబల్ హబ్ గా చేయాలన్నారు. ప్రపంచానికే అన్నంపెట్టే స్థాయికి భారత్ ఎదగాలని.. దేశాభివృద్ధికి పాలనా సంస్కరణలు అవసరమన్నారు. న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. అంతరిక్షంలో భారత స్పేస్‌స్టేషన్ త్వరలో సాకారం కావాలన్నారు.
వోకల్ ఫర్ లోకల్ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పులు
వోకల్ ఫర్ లోకల్ అనేది ప్రభుత్వ వ్యూహమని.. వోకల్ ఫర్ లోకల్ నినాదం ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకువచ్చిందని చెప్పారు. సర్జికల్ స్ట్రైక్స్ ను దేశ ప్రజలు సగర్వంగా స్మరించుకుంటున్నారని, అభివృద్ధి బ్లూప్రింట్‌గా సంస్కరణలు తీసుకువస్తున్నామన్నారవు. నేషన్ ఫస్ట్.. రాష్ట్ర్ హిత్ సుప్రీం సంకల్పంతో ముందుకెళ్తున్నామన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎన్నో సంస్కరణలు అమలు చేశామని తెలిపారు. భారత బ్యాకింగ్ వ్యవస్థ ప్రపంచంలోనే బలమైందని.. జల్‌జీవన్ మిషన్ ద్వారా 15కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు. భారత్ చిరుధాన్యాలు ప్రపంచంలోని అందరికీ చేరాలని.. భారీ సంస్కరణలు తెచ్చేందుకు ప్రభుత్వం సంకల్పం తీసుకుందన్నారు. దేశాభివృద్ధికి నూతన ఆర్థిక విధానాలు అమలు చేస్తున్నామని.. ఉపాధి కల్పనలో గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. యువతకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయన్నారు. అన్ని రంగాల్లో ఆధునిక సాంకేతికతకు పెద్దపీట వేస్తామన్నారు.
మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్
భారత్ త్వరలోనే ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఆవిర్భవిస్తుందన్నారు. స్వయం సహాయక రంగాలకు ఇప్పటి వరకు రూ.9లక్షల కోట్ల రుణాలిచ్చామని, కోటి మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తామని ప్రధాని మోదీ అన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయని.. విపత్తు బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. “బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారన్నారు.. భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్ పురోగతిని ఆశించే శ్రేయోభిలాషి అని, త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణస్థితికి వస్తాయని ఆశిస్తున్నానన్నారు. అక్కడ ఉన్న మైనార్టీలు, హిందువుల సురక్షితను భారత్ కోరుకుంటోందని ప్రధాని తన ప్రసంగంలో స్పష్టం చేశారు.
కీచకులకు పడిన శిక్షలను ప్రధానంగా ప్రచురించాలి
పలు రంగాల్లో మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారని, అయినా ఇటీవల కొన్ని పరిణామాలు తనను ఆందోళనకు గురి చేస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. “మన తల్లులు, సోదరీమణులపై జరుగుతున్న దాడులపై ప్రజల్లో ఆందోళన ఉందని, దానిని నేను అర్ధం చేసుకొంటానన్నారు. దీనిని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు సమాజం కూడా తీవ్రంగా పరిగణించాలని, మహిళలపై దాడుల కేసులను వేగంగా దర్యాప్తు చేయాలి. నిందితులకు కఠిన శిక్షలు విధించాలని, ఇది సమాజంలో నమ్మకాన్ని పెంచుతుందని, కీచకులకు పడిన శిక్షణలను ప్రసార మాధ్యమాలు ప్రధానంగా ప్రచురించాలన్నారు.
సెక్యులర్ సివిల్ కోడ్ దిశగా అడుగులు
మనం భవిష్యత్తు కోసం చేపట్టే ప్రతీ కార్యక్రమంలో దేశాన్ని అత్యున్నతంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. సుప్రీం కోర్టు యూనిఫామ్ సివిల్ కోడ్‌పై చర్చించి అదేశాలు జారీ చేసిందని, ప్రస్తుతం ఉన్న సివిల్ కోడ్ మతపరమైందని, వివక్ష చూపుతుందని, విస్తృత స్థాయిలో దీనిపై చర్చ జరగాలని, సెక్యూలర్ సివిల్ కోడ్ డిమాండ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.దేశంలో సమతౌల్యం దెబ్బతీయడానికి కొందరు ప్రతికూల ఆలోచనాధోరణి ఉన్నవారు ప్రయత్నిస్తున్నారని ప్రజలు గ్రహించాలని, వారసత్వం, కులతత్వ రాజకీయాలు సమాజాన్ని దెబ్బతిస్తాయని, దేశ ప్రగతికి ఆటంకంగా మారుతాయని ఈ తరహా రాజకీయాలను మనం వదలించుకోవాలన్నారు. మన విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకోవాల్సిన పరిస్థితి ఉండాలని నేను కోరుకోవడం లేదని, మధ్యతరగతి వర్గాలు తమ పిల్లల విద్యపై ఇందుకోసం రూ. లక్షలు ఖర్చు పెడుతున్నాయని, మన యువత ఇక్కడే చదువుకొనేలా విద్యావ్యవస్థను అభివృద్ధి చేయాలని, విదేశీయులే ఇక్కడికి వచ్చి చదువుకొనేలా ఉండాలన్నారు. మనం బీహార్‌లో నలందా విశ్వవిద్యాలయాన్ని పునరుద్ధరించామని, విద్యావ్యవస్థలో శతాబ్దాల నాటి నలందా స్ఫూర్తిని తిరిగి నిలబెట్టాలన్నారు.