Operation Sindoor | భారతదేశ సార్వభౌమత్వాన్ని ఎవరూ సవాల్ చేయలేరని, ఒక వేళ అలా అనుకుంటే ఊరుకునేది లేదని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. దాడులకు ప్రతి దాడులు తప్పవని స్పష్టంచేశారు. భారతదేశ సహనాన్ని పరీక్షించొద్దని పాకిస్తాన్‌కు రాజ్ నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశ సమగ్రత, భద్రతే తమకు ముఖ్యమన్నారు. మరిన్ని సైనిక దాడులకు సిద్ధంగా ఉన్నామని పాకిస్తాన్‌కు తేల్చి చెప్పారు. సవాల్ చేయడాలు, కుతంత్రాలు చేస్తూ కపటనాటకాలాడితే చావుదెబ్బ తీస్తామంటూ పాకిస్థాన్‌ను హెచ్చరించారు.
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని.. మరిన్ని దాడులకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు.‘మేం ఎల్లప్పుడూ సంయమనంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడాన్ని విశ్వసిస్తాం. అంతమాత్రాన మా ఓపికను దుర్వినియోగం చేయాలనుకుంటే ఊరుకునేది లేదు’ అని తేల్చి చెప్పారు. తమ సహనాన్ని అవకాశంగా తీసుకోవాలని ప్రయత్నిస్తే.. ఆపరేషన్ సిందూర్ మాదిరిగా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
పాకిస్తాన్‌పై కచ్చితమైన దాడులు చేసిన భారత సాయుధ దళాలను రాజ్ నాథ్ మరోసారి ప్రశంసించారు. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని చాలా ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టారన్నారు. రక్షణ రంగ ఉత్పత్తి, సాధికారతపై మోదీ ప్రత్యేక దృష్టి సారించారన్నారు. రక్షణ రంగంలో సార్వభౌమాధికారం ఉండాలని ప్రధాని మోదీ చెప్పేది ఇందుకేనని రాజ్ నాథ్ వెల్లడించారు.