Ratan Tata । భారతదేశ పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా అస్తమయం

భారతదేశ దిగ్గజ పారిశ్రామికవేత్త, అందరిబాగు కోరిన దాతృస్వభావి రతన్‌ టాటా అస్తమించారు. బుదవారం రాత్రి ముంబైలోని బ్రీచ్‌క్యాండీ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు.

  • By: TAAZ |    national |    Published on : Oct 10, 2024 1:23 AM IST
Ratan Tata । భారతదేశ పారిశ్రామిక దిగ్గజం రతన్‌ టాటా అస్తమయం

Ratan Tata । భారతదేశం గర్వించదగిన దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా సన్స్‌ గౌరవ చైర్మన్‌ (chairman emeritus of Tata Sons) రతన్‌ టాటా (Ratan Tata) తీవ్ర అస్వస్థతతో బుధవారం అర్ధరాత్రి తుదశ్వాస విడిచారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నదని, ముంబైలోని బ్రీచ్‌కాండీ హాస్పిటల్‌లో ఆయనకు ఐసీయూ (intensive care unit)లో ఉంచి చికిత్స అందిస్తున్నారని  రాయిటర్స్‌ వార్తా సంస్థ తొలుత పేర్కొన్నది. ఆయన వయసు 86 ఏళ్లు. రొటీన్‌ ఆరోగ్య పరీక్షల కోసమే తాను హాస్పిటల్‌లో చేరానని కొద్ది రోజుల క్రితం రతన్‌ టాటా పేర్కొంటూ.. తన ఆరోగ్యం విషయంలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేశారు. అయితే.. ఈలోపే ఆయన ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. సోమవారం తన సామాజిక మాధ్యమంలో ఒక పోస్టు పెట్టిన రతన్‌ టాటా.. తన ఆరోగ్యంపై వస్తున్న వదంతులకు సమాధానం ఇచ్చారు. తాను తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టు వచ్చిన వార్తలను కొట్టిపారేశారు. ‘ఆందోళన పడాల్సిన అవసరం  ఏమీ లేదు. నేను చాలా బాగున్నాను’ అని పేర్కొన్నారు. తనకు జరుగుతున్న వైద్య పరీక్షలు రొటీన్‌ అని తెలిపారు. తన ఆరోగ్యం విషయంలో తప్పుడు ప్రచారాలు చేయొద్దని ప్రజలకు, మీడియాకు విజ్ఞప్తి చేశారు. అయితే.. రతన్‌ టాటా మరణ వార్తను టాటా సన్స్‌ గ్రూప్‌ అధికారికంగా ప్రకటించింది. అసలైన అసాధారణ వ్యక్తి అంటూ కొనియాడింది. యావత్‌ టాటా కుటుంబం తరఫున ఆయన ప్రేమికులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని నటరాజన్‌ చంద్రశేఖరన్‌ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశ పారిశ్రామిక రంగంలో రతన్‌ టాటా అగ్రగణ్యులు. దేశంలోనే అతిపెద్ద, అత్యంత ప్రభావశీల పారిశ్రామిక సామ్రాజ్యమైన టాటా సన్స్‌కు రతన్‌ టాటా 1991లో చైర్మన్‌ అయ్యారు. 2012 వరకూ గ్రూపు తన సారథ్యంలో నడిపించారు. తాను సారథ్యం వహించిన సమయంలో టాటా గ్రూపును ఆయన విశ్వవ్యాప్తం చేశారు. టెట్లీ, కోరస్‌, జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌ వంటి పెద్ద కంపెనీలను అక్వైర్‌ చేశారు. ప్రధానంగా దేశీయ కంపెనీగా ఉన్న టాటాను అంతర్జాతీయ స్థాయిలో శక్తిమంతమైన కంపెనీగా తీర్చిదిద్దారు. రతన్‌ టాటా  నాయకత్వంలోనే టాటా సన్స్‌ గ్రూపు మధ్యతరగతి కుటుంబాల కోసం ప్రపంచంలో అత్యంత చవకైన టాటా నానో కారును తీసుకు వచ్చింది. ఆయన నాయకత్వంలోనే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ప్రపంచ ఐటీ దిగ్గజంగా ఎదిగింది. 2012లో ఆయన టాటా చైర్మన్‌ పదవి నుంచి తప్పుకొన్నారు. అప్పటి నుంచి టాటా మోటర్స్‌, టాటా స్టీల్‌ సహా టాటా సన్స్‌ గ్రూపు కంపెనీలకు గౌరవ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. నాయకత్వం వివాదం తలెత్తినప్పుడు 2016లో కొంతకాలం ఆయన మళ్లీ చైర్మన్‌ బాధ్యతలు చేపట్టారు.