Site icon vidhaatha

Prabir Purkayastha | న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్టు చెల్లదు

సుప్రీంకోర్టు సంచలన తీర్పు
వెంటనే విడుదల చేయాలని ఆదేశం

న్యూఢిల్లీ : ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద న్యూస్‌క్లిక్‌ వ్యవస్థాపకుడు ప్రబీర్‌ పుర్కాయస్థ అరెస్టు చెల్లదని సుప్రీంకోర్టు బుధవారం సంచనల తీర్పు వెలువరించింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. పుర్కాయస్థ కస్టడీ పిటిషన్‌పై విచారణ కోర్టు నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆయన అరెస్టుకు పుర్కాయస్థకుగానీ, ఆయన తరఫు న్యాయవాదికి గానీ అరెస్టుకు కారణం తెలియజేయలేదని జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ సందీప్‌ మెహతా ధర్మాసనం పేర్కొన్నది.

‘పుర్కాయస్థ అరెస్టుకు ప్రాతిపదికను వెల్లడించలేదు. దీనితో అరెస్టు నీరుగారిపోయింది. పంకజ్‌ బన్సాల్‌ కేసు నేపథ్యంలో పిటిషనర్‌ను కస్టడీ నుంచి విడుదల చేయవచ్చు. రిమాండ్‌ ఆర్డర్‌ చెల్లదు’ అని జస్టిస్‌ మెహతా పేర్కొన్నారు. పుర్కాయస్థను మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపర్చే ముందు ఆయన అరెస్టు విషయాన్ని ఆయన లాయర్‌కు ఎందుకు తెలియజేయలేదని గత నెలలో సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

భారతదేశ సార్వభౌమాధికారానికి విఘాతం కలిగించేందుకు, దేశం పట్ల విద్వేషం రెచ్చగొట్టేందుకు చైనా నుంచి న్యూస్‌క్లిక్‌ నిధులు పొందిందని ఎఫ్‌ఐఆర్‌లో ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. 2019లోక్‌సభ ఎన్నికలకు వెన్నుపోటు పొడిచేందుకు పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ సెక్యులరిజం (పీఏడీఎస్‌)తో కలిసి ప్రబీర్‌ పుర్కాయస్థ కుట్ర చేశారని ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపించారు.

అన్యాయంగా జైల్లో ఉన్నవారికి భరోసా ఈ తీర్పు

ప్రబీర్ పురకాయస్థను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీరుపై అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి బీ వెంకట్‌ హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం సభలో ఆయన మాట్లాడుతూ.. నేడు దేశంలో బీజేపీ, వారి విధానాలు ప్రశ్నించే వారిని అణచివేసి, అక్రమంగా కేసులు బనాయించి జైలు పాలు చేస్తున్నదని విమర్శించారు. ప్రబీర్ పుర్కాయస్థ లాంటివారిపై కేసులు బనాయించి ప్రశ్నించే గొంతుక లేకుండా బీజేపీ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు. దేశంలో అన్యాయంగా జైల్లో ఉన్నవారందరికీ ఈ తీర్పు భరోసాను కలిగించేదిగా ఉన్నదని, ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని కల్గించేలా ఉందని అన్నారు. ఇలాంటి కుట్రలు చేస్తూ దేశ మేధావులను జైలుపాలు చేస్తున్న బీజేపీని ఈ ఎన్నికల్లో ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు.

పుర్కాయస్థ ఎవరినీ కలవకూడదని షరతు విధించాలని తొలుత కోర్టును కోరిన స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అఖండ్‌ ప్రతాప్‌సింగ్‌.. తర్వాత దానిపై పట్టుబట్టలేదు. ఒక దశలో పుర్కాయస్థ తరఫున హాజరైన న్యాయవాది అర్ష్‌దీప్‌ సింగ్‌.. ‘ఆయన తన లాయర్‌తో మాట్లాడవచ్చా?’ అని ప్రశ్నించడంతో కోర్టు హాలు ఒక్కసారిగా నవ్వులతో నిండిపోయింది. ఆ తర్వాత ఆయన పుర్కాయస్థ జీవిత భాగస్వామి గీతా హరిహరన్‌ పేరు ప్రస్తావించారు. గీత పేరు కూడా చార్జిషీటులో ఉన్నది. న్యూస్‌క్లిక్‌ హెచ్‌ఆర్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ అమిత్‌ చక్రవర్తి ఒక్కరే ప్రస్తుతానికి ఈ కేసులో అప్రూవర్‌ అని స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ చెప్పగా.. అర్ష్‌దీప్‌ స్పందిస్తూ.. ‘ఇప్పటికైతే ఒక్కరే. చూద్దాం ఇంకెవరిని చేరుస్తారో’ అని వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో పటియాలా హౌస్‌ కోర్టు లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అదే సమయంలో ఈ కేసులో సాక్షులను, అప్రూవర్‌లను కలువరాదని, ఈ కేసు మెరిట్స్‌ గురించి మాట్లాడకూడదని, కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లరాదని షరతులు విధించింది.

Exit mobile version