తెలంగాణ నుంచి సోనియా పోటీ!
కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సన్నద్దదమవుతున్నది. మెజార్టీ పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకునే దిశగా కార్యాచరణ మొదలు పెట్టింది

- అధినేత్రికి విజ్ఞప్తి చేస్తూ కాంగ్రెస్ తీర్మానం
- లోక్‌సభ ఎన్నికలపై కసరత్తు
- నెల ముందే నోటిఫికేషన్ వచ్చే చాన్స్
- తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలి
- అధినేత్రికి విజ్ఞప్తి చేస్తూ ఏకగ్రీవ తీర్మానం
- నియోజకవర్గాలకు ఇన్‌చార్జ్‌లుగా మంత్రులు
- నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీ
- ఎంపిక బాధ్యత ఇంచార్జీ ఠాక్రే, ఏసీసీసీ కార్యదర్శులదే
- గ్రామ సభలో ఆరుగ్యారెంటీల లబ్దిదారుల ఎంపిక
- పీఏసీ సమావేశంలో చర్చ
విధాత, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలకు సన్నద్దదమవుతున్నది. మెజార్టీ పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకునే దిశగా కార్యాచరణ మొదలు పెట్టింది. లోక్ సభకు నెల రోజుల ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా బరిలోకి దిగేందుకు వీలుగా క్యాడర్‌ను సన్నద్దం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో పాలనా పగ్గాలు స్వీకరించిన తరువాత తొలిసారిగా సోమవారం గాంధీ భవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ(పీఏసీ) భేటీ అయింది. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కన్వీనర్ షబ్బీర్ అలీ,సీనియర్ నేత వి. హనుమంతరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే పార్లమెంటు నియోజక వర్గాల వారీగా మంత్రులకు కూడా ఇంచార్జీలు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి చేవెళ్ల, మహబూబ్‌నగర్ బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. అలాగే నల్లగొండకు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌కు పొన్నం ప్రభాకర్, భువనగిరికి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదిలాబాద్ కు సీతక్క, వరంగల్‌కు కొండా సురేఖ, నాగర్ కర్నూల్‌కు జూపల్లి కృష్ణారావులకు బాధ్యతలు అప్పగించారన్న చర్చ జరుగుతోంది. మంత్రులతో పాటు సీనియర్ నాయకులకు కూడా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర నాయకులే కాకుండా ఏఐసీసీ కూడా17 నియోజకవర్గాలకు ఇంచార్జీలుగా ఇప్పటికే నియమించింది. తెలంగాణ నుంచి ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చే యాలని కోరుతూ పీఏసీ ఏకగ్రీవంగా తీర్మానించింది.
కార్యకర్తలు సంతృప్తి పడేలా పని చేద్దాం- సీఎం రేవంత్
పార్లమెంటు ఎన్నికలపై కేంద్రీకరించి పని చేయాలని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి పీఏసీలో మాట్లాడుతూ గెలుపే లక్ష్యంగా పని చేద్దామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలు నెల రోజుల ముందే వచ్చే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో పార్టీ బీ- ఫామ్ నుంచి పోటీ చేసిన నాయకులు ఓడినా, గెలిచినా మన నాయకులేనన్నారు. ప్రజలకు అందించే సంక్షేమ ఫలాలన్నీమనం బి-ఫామ్ అందించిన నాయకుడి ద్వారానే అందిస్తే ఫలితం ఉంటుందన్నారు. అలాగే ఆరు గ్యారెంటీలకు లబ్దిదారుల ఎంపిక అంతా కూడా గ్రామ సభల ద్వారానే అందించాలని స్పష్టం చేశారు. కాగా నామినేటెడ్ పోస్టులన్నీ నెల రోజుల్లోగా భర్తీ చేద్దామని చెప్పారు. అయితే ఎమ్మెల్సీ సీట్ల అంశం అధిష్టానం చూసుకుంటుందని,నామినేటెడ్ పోస్టుల భర్తీ ఏఐసీసీ ఇంచార్జీ మానిక్ రావుఠాక్రేతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు చూసుకుంటారన్నారు. అయితే పార్టీని గెలిపించిన కార్యకర్తలు సంతృప్తి పడేలా పని చేద్దామని రేవంత్ నాయకులకు స్పష్టం చేశారు.
పార్టీని గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు
కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో గెలిపించి, అధికారంలోకి తీసుకువచ్చిన తెలంగాణ ప్రజలకు, పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ఏఐసీసీ అగ్ర నేతలు, ప్రచారం లో పాల్గొన్న నాయకులు, ఇంచార్జ్ లుగా పని చేసిన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ తరపున పీఏసీ ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేసిందని పీఏసీ కమిటీ కన్వినర్ షబ్బీర్ అలీ తెలిపారు. ఈ మేరకు సమావేశం ముగిసిన తరువాత గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీఏసీ సమావేశంలో మూడు తీర్మానాలు చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం అందించిన ప్రజలకు కృతజ్ఞతలు, సోనియా గాంధీ, మల్లికార్జేనఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీలతో పాటు జాతీయ నేతలకు ధన్యవాదాలు తెలిపామన్నారు. అలాగే తెలంగాణలో సోనియా పోటీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశామన్నారు. ఇదే తీరుగా తెలంగాణ ఇచ్చిన తల్లిగా మీకు బుణపడి ఉంటామన్నారు. గతంలో ఇందిరా గాంధీ మెదక్ నుంచి పోటీ చేశారని ఈ సందర్భంగా తెలిపారు.
పీఏసీ సమావేశంలో ఆరు గ్యారంటీలపై చర్చించామని షబ్బీర్ అలీ అన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీటీలు ప్రకటించామని మిగిలిన గ్యారంటీలపై అసెంబ్లీలో సిఎం రేవంత్ ప్రకటిస్తారన్నారు. కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం నాగపూర్ లో ఈ నెల 28 న జరుగుతుందని, ఈ సభకు యాభై వేల మందిని తరలించాలని నిర్ణయించామన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభ్యులకు వివరించారని షబ్బీర్ తెలిపారు. ఇరిగేషన్ అవకతవకలపై ఉత్తమ్ వివరించారన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై వేల కోట్లు ఖర్చు చేసినా ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదన్నారు. ఎలక్ట్రిసిటీ, ఫైనాన్స్, సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై ప్రజలకు వివరిస్తామన్నారు. రేషన్ కార్డులు, పెన్షన్లు,హౌసింగ్ పై త్వరలో గ్రామ సభ ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 28 నుంచి ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 28 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు. పార్లమెంట్ స్థానాలకు మంత్రులను ఇంఛార్జ్ ల నియమించామన్నారు. నామినేటెడ్ పోస్టులను తొందర్లోనే భర్తీ చేస్తామని సిఎం చెప్పారన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ మాట్లాడుతూ కాంగ్రెస్ కార్యకర్తల కృషిని అభినందించారన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారన్నారు. గెలిపించిన ప్రజల నమ్మకాలను నిలబెట్టుకోవాలన్నారు.
లోక్‌సభ నియోజకవర్గాల ఇంచార్జీల నియామకం
అదిలాబాద్ సీతక్క
పెద్దపల్లి శ్రీధర్ బాబు
కరీంనగర్ పొన్నం ప్రభాకర్
నిజామాబాద్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి
జహీరాబాద్ పి.సుదర్శన్‌రెడ్డి
మెదక్ దామోదర రాజనర్సింహ
మల్కాజిగిరి తుమ్మల నాగేశ్వరరావు
సికింద్రాబాద్, హైదరాబాద్ మల్లు భట్టి విక్రమార్క
చేవెళ్ల, మహబూబ్‌నగర్ రేవంత్‌రెడ్డి
నాగర్ కర్నూల్ జూపల్లి కృష్ణారావు
నల్లగొండ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
వరంగల్ కొండాసురేఖ
మహబూబాబాద్, ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి