నెలసరి సెలవులపై నమూనా విధానం రూపొందించండి: సుప్రీంకోర్టు
మహిళలకు నెలసరి సెలవులు మంజూరు చేసే విషయంలో ఒక నమూనా విధానాన్ని అన్ని రాష్ట్రాలు, ఈ అంశంలోని భాగస్వాములతో చర్చించి రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది

న్యూఢిల్లీ: మహిళలకు నెలసరి సెలవులు మంజూరు చేసే విషయంలో ఒక నమూనా విధానాన్ని అన్ని రాష్ట్రాలు, ఈ అంశంలోని భాగస్వాములతో చర్చించి రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ అంశంలో సోమవారం చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా ధర్మాసనం విచారణ జరిపింది. ఇది విధానపరమైన అంశమని, కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అంశం కాదని అభిప్రాయపడింది. అదే సమయంలో నెలసరి సెలవులు మంజూరు చేయడం ప్రతికూల ప్రభావాలకు దారి తీసే అవకాశం ఉన్నదని సుప్రీకోర్టు పేర్కొన్నది. ఆయా కంపెనీలు వారిని ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు వెనుకంజ వేసే అవకాశాలు ఉంటాయని, అది మహిళపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నది.
‘మరింత మంది మహిళలు ఉద్యోగాల్లో చేరేందుకు నెలసరి సెలవులు ఎలా ప్రోత్సహిస్తాయి?’ అని పిటిషనర్‌ను కోర్టు ప్రశ్నించింది. పైగా ఇటువంటి సెలవుల కారణంగా మహిళలను ఆయా కంపెనీలు ఉద్యోగాలకు దూరం చేస్తాయని పేర్కొన్నది. అటువంటి పరిస్థితిని తాము కోరుకోవడం లేదని వ్యాఖ్యానించింది. ఈ విషయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని సంప్రదించేందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ఈ విషయంలో వివిధ స్టేక్‌హోల్డర్లతో చర్చించి, ఒక నమూనా విధానం ఏమైనా రూపొందించగలమా? అనే విషయంలో ఒక అభిప్రాయానికి రావాలని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిని కోరింది. ఈ విషయంలో రాష్ట్రాలు చర్యలు తీసుకునేందుకు స్వేచ్ఛ ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం సంప్రదింపు ప్రక్రియ ప్రభావం వాటిపై ఉండదని కోర్టు స్పష్టతనిచ్చింది.
విద్యార్థినులకు, మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవును అన్ని రాష్ట్రాలు తప్పనిసరి చేయాలని దాఖలైన పిటిషన్‌ను ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు తిరస్కరించింది. అది తమ పనికాదని, కేంద్రం ఈ విషయంలో ఒక అభిప్రాయానికి రావాలని అప్పుడు కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నెలసరి సెలవును తప్పనిసరి చేయనప్పటికీ జొమాటో, బైజూస్, స్విగ్గి, మాగ్జ్‌టర్ వంటి కంపెనీలు తమ సంస్థల్లో పనిచేస్తున్న మహిళలకు నెలసరి సెలవులు మంజూరు చేస్తున్నాయని తెలుస్తున్నది.