Hemant Soren | ‘కేజ్రీవాల్‌’ ఉత్తర్వులు నాకూ వర్తిస్తాయి: హేమంత్‌ సోరెన్‌

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, భూకుంభకోణం అభియోగాలపై మనీలాండరింగ్‌ కేసులో

  • Publish Date - May 13, 2024 / 04:47 PM IST

బెయిల్‌ ఇవ్వాలన్న హేమంత్‌ సోరెన్‌
మే 20 తర్వాత విచారిస్తామన్న సుప్రీంకోర్టు
అప్పటికి ఎన్నికలు అయిపోతాయన్న సిబల్‌
మే 17న లిస్టు చేసేందుకు అంగీకరించిన బెంచ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ, భూకుంభకోణం అభియోగాలపై మనీలాండరింగ్‌ కేసులో తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై మే 17వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది. ఢిల్లీ లిక్కర్‌ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన కేజ్రీవాల్‌కు ఎన్నికల్లో ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సుప్రీంకోర్టు జూన్‌ 1 వరకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

‘కేజ్రీవాల్‌ కేసులో ఉత్తర్వులు నాకూ వర్తిస్తాయి’ అంటూ హేమంత్‌ తరఫున కోర్టుకు హాజరైన సీనియర్‌ అడ్వొకేట్‌ కపిల్‌ సిబల్‌.. జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం దృష్టికి తెచ్చారు. దీనిపై ధర్మాసనం ఈడీకి నోటీ జారీ చేసింది. తన అరెస్టును సవాలు చేస్తూ హేమంత్‌ సోరెన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టు కొట్టివేయడంతో దానిని ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేశారు.

తొలుత తాము ఈడీకి సమయం ఇచ్చి, వారి సమాధానం అనంతరం మే 20న వాదనలు వింటామని సుప్రీంకోర్టు పేర్కొన్నది. అయితే.. అప్పటికి లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు ముగియనున్న కారణంగా ఉపయోగం ఉండదని కపిల్‌ సిబల్‌ వాదించారు. అయితే.. అది మార్గం కాదని బెంచ్‌ పేర్కొన్నది. ‘మేం ఎప్పుడూ ఇలాంటి విజ్ఞప్తులు చేయం. మాకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. ఇది సరైంది కాదు’ అని సిబల్‌ వాదించారు. తాము ఈడీకి ఏడు రోజులు మాత్రమే సమయం ఇచ్చామని, ఇందులో వీరు సఫలమైతే మీరు బయటకు రావచ్చని బెంచ్‌ పేర్కొనగా.. ‘నేను బయటకు వస్తానా? రానా? అన్నది విషయమే కాదు. నేను కచ్చితంగా బయటకు వస్తాను. నాకు తెలుసు.

కానీ.. విషయం అది కాదు.. ఈ ప్రక్రియ మొత్తం ఉద్దేశం ఏమిటో మీకు తెలుసు..’ అని సోరెన్‌ తరఫున సిబల్‌ వాదించారు. శుక్రవారం కూడా ఈ కేసును విచారించే అవకాశాలు 99 శాతం లేవని బెంచ్‌ పేర్కొన్నది. మే 20న ఈ కేసును చేపడుతామని తెలిపింది. దీనికి సిబల్‌ స్పందిస్తూ.. ఎన్నికల్లో పాల్గొనలేని పక్షంలో తన పిటిషన్‌ ఉపసంహరించుకుంటానని అన్నారు. ‘ఏమంటున్నారు మీరు? పిటిషన్‌ వాపస్‌ తీసుకోవాలనుకుంటున్నారా? అని ధర్మాసనం ప్రశ్నించింది. తాము మే 17న విచారణ జరిపినప్పటికీ అదే రోజు తీర్పు వెలువరించలేమని, మే 20న ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నది. దీనికి సిబల్‌ స్పందిస్తూ.. ఆ తర్వాత కూడా ఎన్నికలు ఉన్నాయని గుర్తు చేశారు. చివరకు ఈ కేసును మే 17వ తేదీన లిస్ట్‌ చేసేందుకు కోర్టు అంగీకరించింది. అయితే.. ఆ రోజు చేపడుతామో లేదో తెలియదని పునరుద్ఘాటించింది.

Latest News