దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులు

- ఉద్యోగులకు అందించిన తమిళనాడు టీ ఎస్టేట్ సంస్థ
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన చిత్రాలు
విధాత: దీపావళి పండుగకు అనేక సంస్థలు తమ ఉద్యోగులకు బోనస్‌లు ప్రకటిస్తాయి. కొన్ని సంస్థలు స్వీట్లు, మరికొన్ని 5-10 వేల విలువైన ఓచర్లు, కుటుంబాలకు దుస్తులు, ఇతర వస్తువులు అందిస్తుంటాయి. కానీ, తమిళనాడులోని నీలగిరి జిల్లా కోటగిరికి చెందిన ఓ టీ ఎస్టేట్ సంస్థ తమ ఉద్యోగులకు రూ.2 లక్షల విలువైన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను బోనస్‌గా అందజేసింది. దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను ఉద్యోగులు పొందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
తిరుపూర్‌లోని వానాజిపాళయానికి చెందిన పీ శివకుమార్‌కు కోటగిరి సమీపంలో 190 ఎకరాల టీ ఎస్టేట్ ఉంది. ఇందులో కూరగాయలు, పూల తోటలతోపాటు టీ తోటలు కూడా ఉన్నాయి. ఈ సంస్థలో రెండు దశాబ్దాలుగా 627 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా తమ సంస్థలో పని చేస్తున్నఉద్యోగులకు దీపావళి బోనస్‌గా గృహోపకరణాలు, నగదును బహుమతిగా ఇచ్చేవారు. ఈ ఏడాది వారి సహకారానికి మెచ్చి రూ.2 లక్షలకు పైగా విలువైన బైక్‌లను ఇవ్వాలని నిర్ణయించారు. సరిగ్గా పండుగకు పది రోజుల ముందు దీపావళి బోనస్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లను బహుమతిగా ఇచ్చి వారి కుటుంబాల్లో దీపావళి వెలుగులు పంచారు.
తన మేనేజర్, సూపర్‌వైజర్, స్టోర్ కీపర్, క్యాషియర్, ఫీల్డ్ స్టాఫ్,డ్రైవర్లతో సహా తన 15 మంది ఉద్యోగులకు బైక్‌లను బహుమతిగా ఇచ్చాడు. తన టీ ఎస్టేట్ వృద్ధికి ఉద్యోగులు ఎలా సహకరించారో ఈ సందర్భంగా శివకుమార్ తెలిపారు. “గతంలో వారికి ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కొనుగోలు చేసినందున, నేను కొద్దిమంది కార్మికులకు బైక్‌లు ఇవ్వాలనుకుంటున్నాను” అని చెప్పారు. పండుగ సీజన్‌కు ముందు కొందరు కార్మికులకు ఎల్‌సీడీ టీవీలు, 18 శాతం బోనస్‌ను కూడా బహుమతిగా అందించినట్టు వెల్లడించారు.
తమ కార్మికుల పిల్లలను ఆంగ్ల మాధ్యమ పాఠశాలల్లో చదివించడం కోసం ఎస్టేట్ సమీపంలో పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను కూడా టీ ఎస్టేట్ యాజమాన్యం నియమించింది. గతంలో మూతపడే దశలో ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 320 మంది విద్యార్థులు చదువుతున్నారు. అందులో 80 మంది టీ ఎస్టేట్ సిబ్బంది పిల్లలే కావడం విశేషం. శివకుమార్ ఫార్మసీని కూడా నడుపుతున్నారు. అక్కడ కార్మికులకు ఉచితంగా మందులు అందిస్తారు.