కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశం.. హాజరైన తెలుగు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు
కేంద్ర బడ్జెట్ 2024-25 సన్నాహక సమావేశాలు శనివారం న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రారంభమైన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలకు తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు.

విధాత : కేంద్ర బడ్జెట్ 2024-25 సన్నాహక సమావేశాలు శనివారం న్యూఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రారంభమైన కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలకు తెలంగాణ డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఫిబ్రవరిలో ప్రవేశపెట్టగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను వచ్చే నెలలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సన్నాహక సమావేశాల్లో బడ్జెట్ రూపకల్పనపై హాజరైన వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ చర్చించారు. మధ్యాహ్నం నిర్మాలా సీతారామన్ స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై చర్చించనున్నారు.
ఇటీవల తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణకు బడ్జెట్‌లో దక్కాల్సిన వాటా, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టులకు సంబంధించి సానుకూల చర్యలు తీసుకోవాలని కోరారు. గత ఎన్‌డీఏ ప్రభుత్వ బడ్జెట్‌లలో తెలుగు రాష్ట్రాలకు ముఖ్యంగా తెలంగాణకు అన్యాయం జరిగిందన్న విమర్శలు వ్యక్తమయిన నేపథ్యంలో ఈ దఫా బడ్జెట్‌లోనైనా తెలంగాణకు న్యాయం జరుగాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తుంది. కాగా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మనుగడకు ఏపీలోని అధికార టీడీపీ పార్టీ ఎంపీలే కీలకంగా ఉన్నందునా ఈ దఫా ఏపీకి కేంద్ర బడ్జెట్‌లో పెద్ద పీట దక్కవచ్చని అంచనా వేస్తున్నారు.