Kolkata doctor murder case | కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్‌

కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచార ఘటన పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జూనియ‌ర్‌, సీనియ‌ర్ డాక్ట‌ర్ల భ‌ద్ర‌త‌పై సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది.

Kolkata doctor murder case | కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు సీరియస్‌

వైద్యుల భద్రతపై ఆందోళన
ప్రిన్సిపాల్ తీరు..బెంగాల్ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం
జాతీయ టాస్క్‌ఫోర్సు ఏర్పాటు

Kolkata doctor murder case | కోల్‌కత్తా వైద్యురాలి హత్యాచార ఘటన పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు మంగళవారం విచారణ జరిపింది. జూనియ‌ర్‌, సీనియ‌ర్ డాక్ట‌ర్ల భ‌ద్ర‌త‌పై సుప్రీంకోర్టు ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. విచారణ సందర్భంగా బెంగాల్ ప్రభుత్వం, కోల్‌కత్తా పోలీసులు, మెడికల్ కాలేజీ అధికారులు వ్యవహారించిన తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. డాక్ట‌ర్ల భ‌ద్ర‌త కోసం జాతీయ టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్రకటించింది. కోల్‌క‌తా ట్రైనీ డాక్ట‌ర్ రేప్‌, మ‌ర్డ‌ర్ కేసులో ఎఫ్ఐఆర్‌ను ఎందుకు ఆల‌స్యంగా రాత్రిపూట‌ న‌మోదు చేసిన‌ట్లని కోర్టు ప్ర‌శ్నించింది. సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలా, మ‌నోజ్ మిశ్రాల ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారిస్తున్న‌ది. విచారణ సందర్నంగా సీజెఐ చంద్రచూడ్ దేశ‌వ్యాప్తంగా డాక్ట‌ర్ల‌ భ‌ద్ర‌త అంశం ఆందోళ‌న క‌లిగిస్తోంద‌న్నారు. అత్యాచార బాధితురాలి పేరు, ఫోటో, వీడియో క్లిప్ ఎలా బ‌య‌ట‌కు లీకైంద‌ని, బాధితురాలి పేరును వెల్ల‌డించ‌డం చ‌ట్టాన్ని ఉల్లంఘించ‌డ‌మే అవుతుంద‌ని, ప్రాణాలు కోల్పోయిన ఓ యువ డాక్ట‌ర్ గౌర‌వాన్ని ఇలాగేనా కాపాడేది అంటూ సుప్రీం ధ‌ర్మాస‌నం మండిపడింది. డాక్టర్ల సమ్మెతో వైద్య సేవలపై తీవ్ర ప్రభావం పడుతోందని పేర్కొంది. ఈ మేరకు వైద్యులు వెంటనే సమ్మె విరమించి తమ విధుల్లోకి చేరాలని కోరింది. ‘వైద్యులందరి భద్రత, సంక్షేమానికి సంబంధించిన విషయాలను కోర్టు పరిశీలిస్తున్నందున.. ప్రస్తుతం విధులకు దూరంగా ఉన్న వైద్యులు వీలైనంత త్వరగా తిరిగి విధుల్లోకి చేరాలని మేము కోరుతున్నాము’ అని సుప్రీం ధర్మాసనం తెలిపింది.

ప్రిన్సిపాల్ తీరుపై ఆగ్రహం

జూనియర్ డాక్ట‌ర్ ఘ‌ట‌న‌ను సూసైడ్‌గా చిత్రీక‌రించిన ప్రిన్సిప‌ల్ వైఖ‌రిని సుప్రీం త‌ప్పుప‌ట్టింది. ఎందుకు ఆమె పేరెంట్స్‌కు డెడ్‌బాడీని చూసే అవ‌కాశాన్ని ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. “ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించినట్లు తెలిసింది. కానీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారు. అతడి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు.. వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారు? ఇక, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కూడా ఆలస్యమైందని, మధ్యాహ్నం 1.45 గంటల నుంచి 4 గంటల మధ్య శవ పరీక్ష పూర్తయ్యింది. కానీ, మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన 3 గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎందుకు నమోదు చేయాల్సివచ్చింది? ఆసుపత్రి అధికారులు, కోల్‌కత్తా పోలీసులు అప్పటివరకు ఏం చేస్తున్నారు?. మృతదేహాన్ని చూపించేందుకు తల్లిదండ్రులు గంటల పాటు వేచిచూసేలా ఎందుకు చేశారు? ” అని సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూద్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసు దర్యాప్తు స్టేటస్ రిపోర్టు ఆగస్టు 22 కల్లా సమర్పించాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.

పోలీసుల వైఖరి గర్హనీయం

వైద్యురాలి హాత్యాచార ఘటనలో ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేష‌న్ గురించి సుప్రీం ప్ర‌శ్నించింది. క్రైం ఉద‌యం పూట జ‌రిగితే, ఎందుకు అప్పుడు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేద‌ని కోర్టు ప్రశ్నించింది. రాత్రి 11.45 నిమిషాల వ‌ర‌కు ఎందుకు ఎఫ్ఐఆర్ రాయ‌లేద‌ని సీజేఐ ప్ర‌శ్నించారు. అయితే అస‌హ‌జ మ‌ర‌ణం కింద కేసును రిజిస్ట‌ర్ చేసిన‌ట్లు సీనియ‌ర్ అడ్వ‌కేట్ క‌పిల్ సిబ‌ల్ తెలిపారు. అర్థ‌రాత్రి వ‌ర‌కు ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌లేదంటే, అది మ‌ర్డ‌రే అన్న సంకేతాన్ని ఇస్తుంద‌ని సుప్రీంకోర్టు తెలిపింది. ట్రైనీ డాక్ట‌ర్ శ‌రీరాన్ని ఆమె పేరెంట్స్‌కు అప్ప‌గించ‌డంలో ఎందుకు జాప్యం చేశార‌ని బెంగాల్ స‌ర్కార్‌ను కోర్టు ప్ర‌శ్నించింది. ఈ కేసును విచారించ‌డంలోనూ బెంగాల్ పోలీసులు నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించిన‌ట్లు కోర్టు చెప్పింది. ట్రైనీ డాక్ట‌ర్ అత్యాచారం, హ‌త్య కేసును బెంగాల్ ప్ర‌భుత్వం స‌రైన రీతిలో నియంత్రించ‌లేక‌పోయింద‌ని, ఆస్ప‌త్రిలో జ‌రిగిన విధ్వంసాన్ని ఎందుకు అడ్డుకోలేక‌పోయింద‌ని కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దీని ప‌ట్ల తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న‌ట్లు సీజీఐ చంద్రచూడ్ వెల్ల‌డించారు.

శాంతియుత నిరసనలపై అధికారం వాడరాదు

ఘటనను నిరసిస్తూ జరిగిన ఆందోళనలపై బెంగాల్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. “శాంతియుత నిరసనకారుల పై అధికారం చెలాయించవద్ధని హెచ్చరించింది. ఇది దేశమంతా ఆందోళన వ్యక్తం చేస్తున్న అంశమని పేర్కోంది. డాక్టర్లను, పౌరసమాజాన్ని అడ్డుకోవడం సరికాదని, నేరాలను నియంత్రించాల్సిన , శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే” అని ధర్మాసనం మందలించింది. అనంతరం దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 22వ తేదీకి వాయిదా వేసింది.

10మందితో టాస్క్‌ఫోర్సు

మెడికల్ కళాశాలల్లో భద్రత కోసం సుప్రీంకోర్టు జాతీయ టాస్క్‌ఫోర్సు ఏర్పాటు చేసింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లేనని అభిప్రాయపడింది. వైద్యుల‌ను ర‌క్షించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వ చ‌ట్టాలు ఉన్నా, అవి వ్య‌వ‌స్థీకృత నేరాల‌ను అడ్డుకోవ‌డం లేద‌ని సీజే వెల్ల‌డించారు. మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్‌కు సంస్థాగ‌త భ‌ద్ర‌త అవ‌స‌ర‌మని విచార‌ణ సంద‌ర్భంగా సీజేఐ తెలిపారు. ఈ రోజుల్లో చాలామంది యువ డాక్టర్లు 36 గంటలు ఏకదాటిగా పనిచేస్తున్నారని పేర్కోంది. వారికి పని ప్రదేశంలో భద్రత కల్పించడం కోసం ఓ జాతీయ ప్రొటోకాల్‌ను రూపొందించడం అత్యవసరమని, మాపై విశ్వాసం ఉంచండని, క్షేత్రస్థాయిలో మార్పులు తెచ్చేందుకు మరో అత్యాచారమో లేదా హత్యనో జరిగేవరకు మనం ఎదురుచూడొద్దు” అని ధర్మాసనం వెల్లడించింది. దీనికోసం 10 మందితో ఓ జాతీయ టాస్క్ ఫోర్సును సుప్రీంకోర్టు ఏర్పాటుచేసింది. ఇందులో హైదరాబాద్‌కు చెందిన ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ గ్యాస్ట్రాలజీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్. వై.నాగేశ్వర్ రెడ్డి. సర్జన్ వైస్ అడ్మిరల్ ఆర్తి శరిన్, ఎయిమ్స్ దిల్లీ డైరెక్టర్ ఎం. శ్రీనివాస్, డాక్ట‌ర్ ప్ర‌తిమా మూర్తి, డాక్ట‌ర్ గోవ‌ర్ద‌న్ ద‌త్ పురి, డాక్ట‌ర్ సౌమిత్ర రావ‌త్‌, ప్రొఫెస‌ర్ అనితా స‌క్సేనా(ఎయిమ్స్ కార్డియాల‌జిస్ట్‌), ప్రొఫెస‌ర్ ప‌ల్ల‌వి స‌ప్రే(ముంబై గ్రాంట్ కాలేజీ డీన్‌), డాక్ట‌ర్ ప‌ద్మ శ్రీవాత్స‌వ్‌(ఎయిమ్స్ న్యూరాల‌జీ) ఉన్నారు. వీరితో పాటు భార‌త ప్ర‌భుత్వ క్యాబినెట్ సెక్ర‌ట‌రీ, కేంద్ర ప్ర‌భుత్వం హోం కార్య‌ద‌ర్శి, కేంద్ర ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి, జాతీయ మెడిక‌ల్ క‌మీష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌, నేష‌న‌ల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామిన‌ర్స్ ప్రెసిడెంట్ ఆ జాబితాలో ఉన్నారు. వైద్యుల భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై మూడు వారాల్లోగా మధ్యంతర నివేదిక ఇవ్వాలని ధర్మాసనం ఈ కమిటీని సూచించింది.

టాస్క్‌ఫోర్సుకు మార్గదర్శకాలు

జాతీయ టాస్క్ ఫోర్స్ స‌భ్యులు ఓ యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది. లింగ ఆధారిత నేరాల‌ను అరిక‌ట్టేందుకు ప్ర‌ణాళిక‌లు వేయాలని, ఇంటెర్నీలు, రెసిడెంట్‌, నాన్ రెసిడెంట్ డాక్ట‌ర్ల భ‌ద్ర‌త కోసం జాతీయ ప్ర‌ణాళిక‌ల‌ను టాస్క్ ఫోర్స్ స‌భ్యులు రూపొందించాల్సి ఉంటుందని పేర్కోంది. ఎమ‌ర్జెన్సీ రూంల వ‌ద్ద అద‌న‌పు భ‌ద్ర‌త‌ను పెంచ‌డం, ఆస్ప‌త్రుల వ‌ద్ద బ్యాగేజీ స్క్రీనింగ్ పెంచ‌డం, పేషెంట్లు కాని వారు ఓ ప‌రిధి దాటి లోప‌లికి రాకుండా ఉండేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలని, ఆస్ప‌త్రుల్లో జ‌నాన్ని అదుపు చేసేందుకు భ‌ద్ర‌త కావాలని, డాక్ట‌ర్ల‌కు రెస్టు రూమ్‌లు కావాలని, అన్ని ప్రాంతాల్లో స‌రైన లైటింగ్ ఏర్పాటు చేయాలని, సీసీటీవీల‌ను ఏర్పాటు చేయాలని, మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్‌ను త‌ర‌లిచేందుకు రాత్రి ప‌ది నుంచి ఆరు వ‌ర‌కు ట్రాన్స్‌పోర్టు ఏర్పాటు చేయాలని సూచించింది. ఎమ‌ర్జెన్సీ వేళ మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ కోసం హెల్ప్‌లైన్ నెంబ‌ర్ ఏర్పాటు చేయాలి అని మార్గ‌ద‌ర్శ‌కాల్లో సూచించారు.