Kerala Wildlife Crime : కొండచిలువ మాంసంతో వంట..ఇద్దరి అరెస్టు
కేరళలో ఇద్దరు వ్యక్తులు కొండచిలువను వేటాడి మాంసంతో వంట చేసిన ఘటన సంచలనం.. అటవీ శాఖ అరెస్ట్ చేసి కేసు నమోదు చేసింది.

విధాత : వన్యప్రాణులనో..అడవి పందులనో అక్రమంగా వేటాడే వారిని చూశాంగాని..ఇద్దరు వ్యక్తులు కొండ చిలువను వేటాడి దాని మాంసంతో వంట చేసుకున్న వైనం సంచలనం రేపింది. ఇదేదో చైనాలోనో లేక పాములు, కప్పలు తినే మనుషులు ఉండే మరే దేశంలోనో జరుగలేదు. కేరళలోని పనపుళ జిల్లాలో ఈ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఇద్దరు వ్యక్తులు కొండచిలువను చంపి..దాని మాసంతో వంట వండారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు నిందితులు ఇద్దరిని అరెస్టు చేశారు. వారి నుంచి కొండ చిలువ శరీర భాగాలను. వంట వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ప్రమోద్, బినీష్ అనే ఇద్దరు వ్యక్తులు తమ ఇళ్లకు సమీపంలోని రబ్బరు తోటలో ఒక పెద్ద కొండచిలువను వేటాడారని, ఆ తర్వాత దాని మాంసంతో వంట చేసుకున్నారని సమాచారం అందుకున్న తాలిపరంబా రేంజ్ ఆఫీసర్ సురేష్, అతని బృందం నిందితుల ఇంటిపై దాడి చేసి కొండ చిలవ మాంసం వంటకాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.