ముంబై మెట్రో స్టేషన్ లో రస్సైల్ వైపర్ పాము కలకలం

ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మెట్రో స్టేషన్‌లో అత్యంత విషపూరితమైన రస్సెల్ వైపర్ పాము కనిపించడం కలకలం రేపింది. అటవీ శాఖ సిబ్బంది దానిని సురక్షితంగా పట్టుకుని అడవిలో విడిచిపెట్టారు.

అటవీ ప్రాంతాలు..గ్రామాలలో కనిపించే రస్సెల్ వైపర్ (రక్త పింజర) పాము ఏకంగా ముంబై మెట్రో రైలు స్టేషన్ ఫ్లాట్ ఫామ్ పై ప్రత్యక్షమవ్వడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. నిత్యం ప్రయాణికుల రద్దీతో కనిపించే ముంబై – బాంద్రా కుర్లా కాంప్లెక్స్ మెట్రో లైన్-3 స్టేషన్‌లో అత్యంత విషపూరితమైన రస్సెల్స్ వైపర్ పాము కనిపించింది. బీకేసీ ఆక్వా మెట్రో లైన్ 3 స్టేషన్ బేస్‌మెంట్-2లో రస్సెల్స్ వైపర్ పాము సంచారాన్ని గమనించి సిబ్బంది హడలిపోయారు. పామును గుర్తించిన వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పాములను రక్షించే నిపుణులను, అటవీ శాఖకు సమాచారం అందించారు.

వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది, స్నేక్ క్యాచర్ నీరసంగా బేస్మెంట్ పై పాకుతున్న రస్సెల్ వైపర్ ను చూశారు. ఆ పామును సురక్షితంగా బంధించే ముందు దానికి కొంత నీరు ఇచ్చి..నెమ్మదిగా ఓ సీసాలో దానిని బంధించారు. అటవీ శాఖ మార్గదర్శకాల ప్రకారం దాని సహజ ఆవాసంలోకి తిరిగి వదిలివేశారు.

Latest News