VVPAT Slips | బీహార్ ఎన్నిక‌ల వేళ‌.. రోడ్డు ప‌క్క‌న వీవీప్యాట్ స్లిప్పులు ప్ర‌త్య‌క్షం..!

VVPAT Slips | బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల( Bihar Assembly Elections ) వేళ‌.. రోడ్డు ప‌క్క‌న వీవీప్యాట్ స్లిప్పులు( VVPAT Slips ) ప్ర‌త్య‌క్షమ‌వ‌డం క‌ల‌క‌లం రేపింది. వీవీప్యాట్ల‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో కేంద్ర ఎన్నికల సంఘం( CEC ) అప్ర‌మ‌త్త‌మైంది. స‌హాయ‌క రిటర్నింగ్ అధికారి( ARO )పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది.

VVPAT Slips | పాట్నా : బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల( Bihar Assembly Elections ) వేళ‌.. రోడ్డు ప‌క్క‌న వీవీప్యాట్ స్లిప్పులు( VVPAT Slips ) ప్ర‌త్య‌క్షమ‌వ‌డం క‌ల‌క‌లం రేపింది. వీవీప్యాట్ల‌కు సంబంధించిన వీడియో వైర‌ల్ కావ‌డంతో కేంద్ర ఎన్నికల సంఘం( CEC ) అప్ర‌మ‌త్త‌మైంది. స‌హాయ‌క రిటర్నింగ్ అధికారి( ARO )పై స‌స్పెన్ష‌న్ వేటు వేసింది. దీంతో పాటు స‌ద‌రు అధికారిపై కేసు కూడా న‌మోదైంది.

ఈ నెల 6వ తేదీన బీహార్ అసెంబ్లీకి తొలివిడుత ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అయితే స‌మ‌స్తిపూర్ జిల్లాలోని స‌రాయ్‌రంజ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని ఓ కాలేజీ వ‌ద్ద రోడ్డు ప‌క్క‌న చెల్లాచెదురుగా వీవీప్యాట్ స్లిప్పులు క‌నిపించాయి. ఇక వీటిని స్థానికులు త‌మ కెమెరాల్లో బంధించి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ చేశారు. పార్టీ గుర్తులు ముద్రించి ఉన్న ఆ స్లిప్పుల‌ను స్థానికులు ఏరుతున్న‌ట్లు వీడియోలో క‌నిపించింది.

ఈ వైర‌ల్ వీడియోపై ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ప్రజాస్వామ్య దోపిడీదారులు ఈ చర్యలకు పాల్పడినట్టు ఆర్జేడీ ఆరోపించింది. ఈ స్లిప్పులు ఎవరు, ఎప్పుడు, ఎవరి ఆదేశాలతో పడేశారని ప్రశ్నించింది. ‘దొంగ కమిషన్‌’ దీనికి జవాబు చెప్తుందా? బయటి నుంచి వచ్చిన ‘ప్రజాస్వామ్యాన్ని దోచుకునే బందిపోట్ల’ ఆదేశాలతోనే ఇదంతా జరుగుతున్నదా?’ అని ప్రశ్నించింది. ఈవీఎంలు ఉంచే స్ట్రాంగ్ రూమ్‌లకు భద్రత పెంచాలని డిమాండ్ చేసింది.

ఈ వ్య‌వ‌హారంపై ఎన్నికల కమిషన్‌ స్పందిస్తూ, ఈ స్లిప్పులు ఈ నెల 6న పోలింగ్‌ ప్రారంభం కావడానికి ముందు నిర్వహించిన మాక్‌ పోల్‌కు సంబంధించినవని తెలిపింది. పోలింగ్‌కు ముందు ఈవీఎంలను పరీక్షించినపుడు ఈ స్లిప్పులు వచ్చాయని వివరించింది. అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ను సస్పెండ్‌ చేసి, ఆయనపై కేసు నమోదు చేసినట్లు తెలిపింది. సంఘటన స్థలానికి వెళ్లి, దర్యాప్తు జరపాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. సమస్తిపూర్‌ జిల్లా మేజిస్ట్రేట్‌ రోషన్‌ కుష్వాహా మాట్లాడుతూ, అభ్యర్థుల సమక్షంలో ఆ వీవీప్యాట్‌ స్లిప్పులను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇద్దరు అధికారులపై శాఖాపరమైన దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.