Site icon vidhaatha

Waqf Bill | దేశ విభజనకే వక్ఫ్‌ సవరణ చట్టం : కాంగ్రెస్‌ ఎంపీ గొగోయ్‌

Waqf Bill | కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్‌ సవరణ బిల్లు 2024ను కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ‘రాజ్యాంగాన్ని నీరుగార్చేందుకు, మైనార్టీ వర్గాలను కించపరచేందుకు, భారత సమాజాన్ని విభజించేందుకు, మైనార్టీల హక్కులను కాలరాసేందుకు ఒక సాధనంగా ఈ బిల్లును తీసుకొచ్చిందని మండిపడ్డారు. వక్ఫ్‌ (సవరణ) బిల్లుపై బుధవారం ఆయన లోక్‌సభలో చర్చను ప్రారంభించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు అప్పటి యూపీఏ ప్రభుత్వం 123 ఆస్తులను ఢిల్లీ వక్ఫ్‌ బోర్డుకు బదలాయించిందన్న కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. అందుకు ఆధారాలను బయటపెట్టాలని కేంద్ర మంత్రిని సవాలు చేశారు. తప్పుడు ఆరోపణలతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు రిజిజు ప్రయత్నించారని ఆరోపించారు. మైనార్టీల పట్ల బీజేపీకి సున్నితత్వం లోపించిందని అంటూ.. లోక్‌సభలో బీజేపీకి ఉన్న మైనార్టీల సంఖ్య ఎంత అని ప్రశ్నించారు.

కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ బిల్లుపై ఐదు సమావేశాలు నిర్వహించినా, కొత్త వక్ఫ్‌ చట్టం ఆవశ్యకతపై ఎలాంటి చర్చ జరుగలేదని కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ చెప్పారు. బిల్లులో పొందుపర్చిన మత సర్టిఫికెట్ల అంశంపైనా ఆయన తీవ్రంగా స్పందించారు. ఇతర మతాల వారిని ఇటువంటి సర్టిఫికెట్లు అడుగుతారా? ఇది రాజ్యాంగ వ్యతిరేకం కాదా? అని నిలదీశారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో ముస్లింలు గొప్ప పాత్ర పోషించారన్న గొగోయ్‌.. వలస పాలన కాలపు ఎత్తుగడలను కేంద్ర ప్రభుత్వం మళ్లీ ముందుకు తెస్తున్నదని ఆరోపించారు. ‘మీరు క్విట్‌ ఇండియాకు అనుకూలంగా లేనప్పుడు వారు క్విట్‌ ఇండియా ఉద్యమానికి మద్దతు పలికారు. మీరు బ్రిటిష్‌ ప్రభుత్వానికి క్షమాపణ పత్రాలు రాసుకుంటూ ఉన్న సమయంలో వారు మాల్టా, ఈజిప్ట్‌లలో ప్రాణాలు త్యాగం చేశారు’ అని గొగోయ్‌ చెప్పారు. వక్ఫ్‌ బిల్లుపై జేపీసీ వ్యవహారాన్ని కూడా గౌరవ్‌ గొగోయ్‌ తప్పుపట్టారు. ప్రతిపక్షం గొంతు నొక్కేశారని ఆరోపించారు. ‘మేం చాలా జేపీసీలను చూశాం. కానీ.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు. బిల్లులోని క్లాజుల వారీగా చర్చలు జరుగనేలేదు’ అని ఆయన తెలిపారు. వక్ఫ్‌ చట్టంలోని 107వ సెక్షన్‌ తొలగింపుపై ఎన్డీయే పక్షాలైన టీడీపీ తన వైఖరిని స్పష్టం చేయాలని గొగోయ్‌ డిమాండ్‌ చేశారు. అంతకు ముందు ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరెన్‌ రిజిజు.. ఈ బిల్లును వ్యతిరేకించేవారంతా ముస్లిం వ్యతిరేకులేనని వ్యాఖ్యానించారు.

Exit mobile version