CM Mamata Banerjee | నీతి ఆయోగ్‌ సమావేశం నుంచి మమతాబెనర్జీ వాకౌట్‌

శనివారం న్యూఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్‌ సమావేశం నుంచి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వాకౌట్‌ చేశారు. మొత్తం ప్రతిపక్షం నుంచి తాను ఒక్కదాన్నే హాజరైనా తానకు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వలేదని చెప్పారు

CM Mamata Banerjee | నీతి ఆయోగ్‌ సమావేశం నుంచి మమతాబెనర్జీ వాకౌట్‌

ఐదు నిమిషాలకే మైక్‌ బంద్‌ చేశారని ఆరోపణ

న్యూఢిల్లీ : శనివారం న్యూఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్‌ సమావేశం నుంచి పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ వాకౌట్‌ చేశారు. మొత్తం ప్రతిపక్షం నుంచి తాను ఒక్కదాన్నే హాజరైనా తానకు మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వలేదని చెప్పారు. అందుకు నిరసనగా సమావేశం నుంచి మధ్యలోనే బయటకు వచ్చేశానని అనంతరం ఆమె మీడియాకు చెప్పారు. ‘నాకు ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. కానీ నాకంటే ముందు మాట్లాడినవారికి 15 నుంచి 20 నిమిషాలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు 20 నిమిషాలు మాట్లాడారు. అసోం, గోవా, ఛత్తీస్‌గఢ్‌ సీఎంలు పది పన్నెండు నిమిషాలు మాట్లాడారు. నేను మాట్లాడుతుండగానే నా మైక్‌ కట్‌ అయింది. దానికి నిరసనగా బయటకు వచ్చేశాను’ అని ఆమె తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపరాదని మమత అన్నారు. ప్రతిపక్షం నుంచి తానొక్కదాన్నే హాజరైనందుకు తనను అడ్డుకున్నారని ఆరోపించారు. ‘ప్రతిపక్షం నుంచి నేనొక్కదాన్నే హాజరయ్యాను. కానీ.. నాకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇది చాలా అవమానకరం’ అని తృణమూల్‌ చీఫ్‌ విమర్శించారు. ఇది ఒక్క పశ్చిమబెంగాల్‌కు మాత్రమే కాదని, అన్ని ప్రాంతీయ పార్టీలకు జరిగిన అవమానమని చెప్పారు. పశ్చిమబెంగాల్‌కు కేంద్రం నిధులు ఇవ్వలేదన్న విషయాన్ని మాట్లాడుతుండగా మైక్‌ను కట్‌ చేశారని తెలిపారు. ఎన్డీయే పక్షాల పట్ల కేంద్రం పక్షపాతం వహిస్తున్నదని ఆరోపించారు.

ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల పలువురు ముఖ్యమంత్రులు నీతి ఆయోగ్‌ సమావేశాన్ని బహిష్కరించిన సంగతి తెలిసిందే. తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్‌ ఎంకే స్టాలిన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ సింగ్‌ మాన్‌ తదితరులు ఈ సమావేశానికి హాజరుకాలేదు. కేంద్ర బడ్జెట్‌లో బీజేపీయేతర పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం తీవ్ర వివక్ష ప్రదర్శించిందని ఆరోపిస్తూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత మమతా బెనర్జీ కూడా ఈ సమావేశానికి హాజరుకాబోరని వార్తలు వచ్చినా.. తాను సమావేశానికి వెళుతున్నానని శుక్రవారం ఆమె ధృవీకరించారు.

అయితే.. తనను మాట్లాడేందుకు అనుమతించకపోతే సమావేశం నుంచి బయటకు వచ్చేస్తానని చెప్పారు. అదే సమయంలో నీతి ఆయోగ్‌ను రద్దు చేసిన గతంలో ఉన్న ప్రణాళికా సంఘాన్ని పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ప్రభుత్వం తుకడే తుకడే వేదిక అని అభివర్ణించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులు రాని నేపథ్యంలో వారందరి తరఫున తమ వాణిని వినిపిద్దామనే నీతి ఆయోగ్‌ సమావేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు ఆమె తెలిపారు.

అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం మమత ఆరోపణలను కొట్టిపారేసింది. ఆమెకు కేటాయించిన సమయం ముగిసిందని పేర్కొన్నది. వాస్తవానికి ఆమె మధ్యాహ్న భోజనం అనంతరం మాట్లాడాల్సి ఉన్నదని, కానీ.. ఆమె అత్యవసరంగా తిరిగి రాష్ట్రానికి చేరుకోవాల్సి ఉన్నదన్న పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఆమెను ఏడో ఉపన్యాసకురాలిగా చేర్చామని తెలిపింది.

మమత మాటలు అసత్యాలు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల

మమతాబెనర్జీ మైక్‌ను కట్‌ చేశారనడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. ‘మమతాబెనర్జీ నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరయ్యారు. ఆమె చెప్పిందంతా విన్నాం. ప్రతి ముఖ్యమంత్రికి మాట్లాడేందుకు నిర్దిష్ట సమయం కేటాయించారు. ఆ సమయంలో వారి ముందు ఉన్న డిస్‌ప్లే స్క్రీన్‌పైనా కనిపిస్తుంటుంది. తన మైక్‌ కట్ చేశారని మమత మీడియా సమావేశంలో చెప్పారు. అది పూర్తిగా అసత్యం’ అని తెలిపారు.

మమతా బెనర్జీ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవని పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌ పేర్కొన్నది. ‘ఆమె మాట్లాడే సమయం ముగిసిందని క్లాక్‌ చూపించింది. సమయం ముగిసిందని సూచించేందుకు బెల్‌ కూడా మోగలేదు’ అని తెలిపింది. మొత్తానికి కేంద్ర ఆర్థిక మంత్రిగానీ, పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌గానీ మమతకు ఐదే నిమిషాలు కేటాయించిన అంశాన్ని మాత్రం పరోక్షంగా అంగీకరించారు.