కోవిడ్‌ వల్ల 2.20 కోట్ల మంది మృతి: డబ్ల్యుహెచ్ వో కీలక ప్రకటన

కోవిడ్-19 వల్ల ప్రపంచవ్యాప్తంగా 2.20 కోట్ల మంది మరణించారని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. మహమ్మారి ఆరోగ్య వ్యవస్థల బలహీనతలను బయటపెట్టిందని నివేదిక పేర్కొంది.

ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్‌(COVID-19) వల్ల 2.20 కోట్ల(22.1మిలియన్లు) మంది మృతి చెందినట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక ప్రకటన చేసింది. COVID-19 మహమ్మారి ప్రపంచ ఆరోగ్య వ్యవస్థలలోని బలహీనతలను బహిర్గతం చేసిందని, అలాగే 2020 – 2023 మధ్య పరోక్ష మరణాలతో కలిపి సుమారు 22.1 మిలియన్ల అదనపు మరణాలకు ఇది కారణమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. నమోదైన అదనపు మరణాలలో సుమారు 57% పురుషులలో, 43% మహిళల్లో సంభవించాయని తెలిపింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రధాన ‘ప్రపంచ ఆరోగ్య గణాంకాల నివేదిక’లో ప్రచురించబడిన ఈ అంచనా, అధికారికంగా నివేదించబడిన కోవిడ్-19 మరణాల సంఖ్య కంటే మూడు రెట్లు అధికంగా ఉండటంతో పాటు ప్రపంచంపై కోవిడ్ మహమ్మారి ప్రభావ తీవ్రతను ప్రతిబింబిస్తుంది. కోవిడ్ వైరస్ విస్తరణ ఆయురార్ధం పురోగతిని 10ఏళ్లు వెనక్కి నెట్టిందని, ప్రాంతాలవారీగా రీకవరి పరిణామాలు అసమానంగా కొనసాగుతున్నాయని ఆ నివేదిక పేర్కొంది.

తగ్గిన హెచ్ఐవీ విస్తరణ

ఈ నివేదిక పలు రంగాలలో సాధించిన గణనీయమైన పురోగతిని కూడా ప్రముఖంగా ప్రస్తావించింది. 2010 – 2024 మధ్య కాలంలో కొత్త HIV సంక్రమణలు 40% మేర తగ్గాయి అని, ఇదే సమయంలో పొగాకు వినియోగం, మద్యపానం కేసులు క్షీణించాయి అని తెలిపింది. 2010 నుండి 2024 మధ్య, నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధుల (neglected tropical diseases) చికిత్సల కోసం అవసరమైన వ్యక్తుల సంఖ్య 36% మేర తగ్గిందని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆఫ్రికన్ ప్రాంతం, హెచ్‌ఐవి (HIV) సంక్రమణలను 70శాతం, క్షయవ్యాధిని 28శాతం మేర తగ్గించడంలో ప్రపంచ స్థాయి కంటే వేగంగా విజయం సాధించిందని నివేదిక పేర్కొంది. ఆగ్నేయాసియా ప్రాంతం మలేరియా తగ్గింపు కోసం నిర్దేశించుకున్న 2025 మైలురాయిని చేరుకునే దిశలో ఉందని కూడా అది తెలిపింది.

మలేరియా నివారణ లక్ష్యాలలో వెనుకబాటు

పలు కీలక వ్యాధుల నివారణలో గణనీయమైన సవాళ్లు ఇంకా మిగిలి ఉన్నాయని నివేదిక హెచ్చరించింది. 2015 నుండి మలేరియా వ్యాప్తి 8.5% పెరగడంతో, ప్రపంచం ప్రపంచ లక్ష్యాలకు మరింత దూరమైందని, అదే సమయంలో ప్రాంతాలవారీగా పురోగతి అసమానంగా ఉందని వెల్లడించింది.

పునరుత్పత్తి వయస్సులో ఉన్న మహిళల్లో 30.7% మంది రక్తహీనతతో బాధపడుతున్నారని నివేదిక తెలిపింది. గత దశాబ్ద కాలంలో ఈ పరిస్థితిలో ఎటువంటి మెరుగుదల నమోదు కాలేదు అని, ఐదేళ్లలోపు పిల్లలలో అధిక బరువు శాతం 2024 నాటికి 5.5%కి చేరుకుందని ఆందోళన వ్యక్తం చేసింది. పిల్లలకు టీకాల కవరేజ్ లక్ష్యం కంటే తక్కువగానే ఉందని, రోగనిరోధక శక్తిలో ఉన్న లోపాలు వ్యాధులు వ్యాప్తి చెందడానికి దోహదపడుతున్నాయని నివేదిక జోడించింది.

లక్ష్యం కంటే మూడు రెట్లు అధికంగా ప్రసూతి మరణాలు

2000 సంవత్సరం నుండి ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి మరణాలు 40% తగ్గినప్పటికీ, అవి 2030 లక్ష్యం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని డబ్ల్యుహెచ్ వో వెల్లడించింది. ఐదేళ్లలోపు పిల్లల మరణాలు 51% తగ్గాయి, కానీ చాలా దేశాలు ఇంకా ఆ లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయని, అంటువ్యాధులు కాని వ్యాధుల వల్ల సంభవించే అకాల మరణాలను తగ్గించడంలో పురోగతి కూడా 2015 నుండి గణనీయంగా మందగించిందని ఆందోళన వ్యక్తం చేసింది.

పోషకాహారం, ప్రవర్తనా, పర్యావరణపరమైన ప్రమాదాలతో సహా అనారోగ్యానికి కారణమయ్యే అనేక అంశాల నియంత్రణ ఆశించినంత వేగంగా మెరుగుపడటం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది. 2021లో ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం వల్ల సుమారు 66 లక్షల మరణాలు సంభవించగా, 2019లో సరిపోని నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత కారణంగా 14 లక్షల మరణాలు సంభవించాయని తెలిపింది.

మహిళలపై హింస పెరుగుతుంది..

మహిళలపై హింస ఇంకా విస్తృతంగా కొనసాగుతోందని, ప్రపంచవ్యాప్తంగా ప్రతి నలుగురు మహిళల్లో ఒకరు తమ సన్నిహిత భాగస్వాముల హింసకు గురవుతున్నారని కూడా ఆ నివేదిక పేర్కొంది. మహిళలపై వేధింపుల నివారణకు మరింత పటిష్టమైన చర్యలు, సామాజిక రక్షణ విధానాల ఆవశ్యకతను నొక్కి చెబుతున్నాయని నివేదిక అభిప్రాయపడింది.

విస్తరించిన ఆరోగ్య ప్రభావిత సేవలు

2015 నుంచి 2024 మధ్య ఆరోగ్య ఫలితాలను ప్రభావితం చేసే సేవల లభ్యత కూడా వేగంగా విస్తరించిందని తెలిపింది. ఈ కాలంలో, 96.1 కోట్ల మందికి సురక్షితంగా నిర్వహించబడే తాగునీరు, 120 కోట్ల మందికి పారిశుధ్యం, 160 కోట్ల మందికి ప్రాథమిక పరిశుభ్రత, 140 కోట్ల మందికి స్వచ్ఛమైన వంట ద్రావణాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.

అయితే సార్వత్రిక ఆరోగ్య కవరేజ్ (UHC) దిశగా పురోగతి తీవ్రంగా మందగించిందని కూడా నివేదిక పేర్కొంది. 2015 నుంచి 2023 మధ్య ప్రపంచ UHC సేవల కవరేజ్ సూచిక 68 నుండి 71కి స్వల్పంగా మాత్రమే పెరిగింది. ప్రపంచ జనాభాలో నాలుగో వంతు మంది ఆరోగ్య ఖర్చుల కారణంగా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారని, 2022లో సొంత ఖర్చులతో కూడిన ఆరోగ్య వ్యయం కారణంగా 160 కోట్ల మంది ప్రజలు పేదరికంలో జీవిస్తున్నారు లేదా పేదరికంలోకి నెట్టబడ్డారు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ గణంకాలు ఆరోగ్య బీమా, రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి ప్రభుత్వ వైద్య వసతుల కల్పన ఆవశ్యకతను వెల్లడిస్తుంది.

ప్రపంచం ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడంలో మందగమనం

ప్రపంచం ఆరోగ్య లక్ష్యాలను చేరుకోవడంలో మందగమనంతో సాగుతుందని, కొన్ని దేశాలలో తిరోగమనం నెలకొందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. చాలా మంది ప్రజలు, ముఖ్యంగా మహిళలు, పిల్లలు, వెనుకబడిన వర్గాల వారు, ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన ప్రాథమిక పరిస్థితులను ఇప్పటికీ కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఆరోగ్య డేటా సేకరణలో దేశాల వెనుకబాటు

ప్రపంచ ఆరోగ్య డేటా సేకరణలోనూ లోపాలు కొనసాగుతున్నాయని, 2025 చివరి నాటికి, కేవలం 18% దేశాలు మాత్రమే ఒక సంవత్సరంలోపు మరణాల డేటాను WHOకు నివేదిస్తుండగా, దాదాపు మూడింట ఒక వంతు దేశాలు మరణానికి గల కారణాల డేటాను ఎన్నడూ నివేదించలేదు అని అసహనం వ్యక్తం చేసింది. కేవలం మూడింట ఒక వంతు దేశాలు మాత్రమే మరణాల డేటా అందించడంతో WHO ప్రమాణాలను అందుకుంటుండగా, దాదాపు సగం దేశాల వద్ద తక్కువ లేదా చాలా తక్కువ నాణ్యత గల డేటా ఉందని, కొన్ని దేశాలు వద్ద అది కూడా లేదు అని ఆందోళన వ్యక్తం చేసింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా అంచనా వేయబడిన 6.1 కోట్ల మరణాలలో, కేవలం మూడింట ఒక వంతు మాత్రమే మరణానికి గల కారణాల సమాచారంతో నివేదించబడ్డాయని, కేవలం ఐదవ వంతు మాత్రమే అర్థవంతమైన అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ICD) కోడెడ్ డేటాను కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆరోగ్య సంక్షోభాలను ఎదుర్కోవడంలో, వేగంగా ప్రతిస్పందించడంలో, ఆరోగ్య పరిణామాలు, వ్యాధుల తీవ్రతను విశ్లేషించడంలో డేటా కీలకంగా ఉపయోగపడుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) పేర్కొంది.

ఇవి కూడా చదవండి :

ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో ఎన్ఐఏ ఛార్జ్ షీట్
Viral News | చీర నచ్చలేదని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. షాక్‌లో వరుడు!

Latest News