Ranya Rao: 15 కిలోల బంగారం స్మగ్లింగ్.. పట్టుబడ్డ‌ హీరోయిన్‌

  • By: sr    news    Mar 05, 2025 4:51 PM IST
Ranya Rao: 15 కిలోల బంగారం స్మగ్లింగ్.. పట్టుబడ్డ‌ హీరోయిన్‌

Ranya Rao:

ఇంట్లో రెండు కోట్ల విలువైన న‌గ‌లు.. రెండున్నర కోట్ల హార్డ్ క్యాష్‌!

విధాత, వెబ్ డెస్క్: దుబాయి నుంచి వ‌స్తూ 14.2 కిలోల బంగారం స్మ‌గుల్ చేస్తూ దొరికి పోయిన క‌న్న‌డ హీరోయిన్ ర‌న్యారావు ఇంట్లో కూడా భారీగానే బంగారం, క్యాష్ ఉన్న విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ర‌న్యారావు త‌ర‌చూ దుబాయికి వెళ్లి వ‌స్తుంటుంది. ఈ క్ర‌మంలోనే మంగ‌ళ‌వారం కూడా దుబాయి నుంచి బెంగ‌ళూరు ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న‌ది. స్పెసిఫిక్ ఇన్ఫ‌ర్మేష‌న్‌తో ఆమెను అడ్డుకున్న అధికారులు.. ఆమెను సోదా చేయ‌గా.. 14.2 కిలోల బంగారాన్ని అక్ర‌మంగా తీసుకువ‌స్తున్న‌ట్టు గుర్తించి, అరెస్టు చేశారు. త‌దుప‌రి ఆమె నివాసాల్లో త‌నిఖీలు చేసి.. 2.06 కోట్ల విలువైన బంగారు ఆభ‌ర‌ణాలు, 2.67 కోట్ల రూపాయ‌ల న‌గ‌దు సీజ్ చేసిన‌ట్టు డైరెక్ట‌రేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు బుధ‌వారం వెల్ల‌డించారు.

33 ఏళ్ల ర‌న్యారావు.. డీజీపీ ర్యాంకులో ఉన్న క‌ర్ణాట‌క సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి కే రామ‌చంద్రారావు స‌వ‌తి కుమార్తె. దుబాయి నుంచి బెంగ‌ళూరుకు ఎమిరేట్ ఫ్లైట్‌లో మార్చి 3వ తేదీన సుమారు 33 ఏళ్ల వ‌య‌సున్న ఒక భార‌తీయ‌ మ‌హిళా ప్ర‌యాణికురాలిని నిర్దిష్ట స‌మాచారంతో త‌నిఖీ చేశాం. ఆమె వ‌ద్ద 14.2 కిలోల బ‌రువున్న గోల్డ్ బార్స్ స్వాధీనం చేసుకున్నాం.. అని డీఆర్ఐ ఒక బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఇటీవ‌లి కాలంలో బెంగ‌ళూరు విమానాశ్ర‌యంలో ఇంత పెద్ద మొత్తంలో బంగారం సీజ్ చేయ‌డం ఇదే మొద‌టిసారి అని పేర్కొన్న‌ది.అరెస్ట‌యిన ర‌న్యారావును మార్చి 18 వ‌ర‌కూ డీఆర్ ఐ క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ ఆర్థిక నేరాల ప్ర‌త్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలోనే ఆమె నివాసంలో అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. బెంగ‌ళూరులోని లావెల్లీ రోడ్డులో ఉన్న ఇంటిలో ర‌న్యారావు త‌న భ‌ర్త‌తో క‌లిసి నివ‌సిస్తున్న‌ది.

ఎయిర్‌పోర్ట్‌లో స్వాధీనం చేసుకున్న బంగారం, ఇంట్లో సోదాల సంద‌ర్భంగా సీజ్ చేసిన‌వి మొత్తం క‌లుపుకొని 17.29 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని డీఆర్ఐ వ‌ర్గాలు చెబుతున్నాయి. ర‌న్యారావును క‌స్ట‌మ్స్ యాక్ట్ 1962 సెక్ష‌న్ల ప్ర‌కారం అరెస్టు చేసి, జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీకి పంపిన‌ట్టు డీఆర్ఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది.2014లో 22 ఏళ్ల వ‌య‌సులో క‌న్న‌డ సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన ర‌న్యారావు.. మూడు క‌న్న‌డ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. ఇత‌ర ద‌క్షిణాది రాష్ట్రాల సినిమాల్లో కూడా ప్ర‌య‌త్నాలు చేసుకుంటున్న‌ది. ఆమె స‌వ‌తి తండ్రి కే రామ‌చంద్రారావు కూడా ప‌లు వివాదాల్లో ఉన్న‌వారే. గ‌తంలో క‌ర్ణాట‌క నుంచి కేర‌ళ‌కు ఒక బ‌స్సులో వెళుతున్న ఒక బంగారం వ్యాపారి నుంచి గోల్డ్ క‌న్‌సైన్‌మెంట్ మైసూరులో అనుమానాస్ప‌ద రీతిలో దోపిడీకి గురైంది. ఈ వివాదంతో ఆయ‌న‌కు లింకులు ఉన్నాయ‌ని గ‌తంలో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ దోపిడీ కేసులో కొంద‌రు కిందిస్థాయి పోలీసు అధికారుల హ‌స్తం కూడా ఉంద‌నే మాట‌లు వినిపించాయి. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో స‌ద‌రు సీనియ‌ర్ పోలీసు అధికారిని ఉన్న పోస్టు నుంచి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారే త‌ప్పించి, ఎలాంటి లీగ‌ల్ యాక్ష‌న్ తీసుకోలేదు.

గ‌త ఏడాది కూడా రామ‌చంద్ర‌రావు కొడుకును క‌ర్ణాట‌క పోలీసులు ఇంట‌ర్నేష‌న‌ల్ హ్యాక‌ర్ శ్రీ‌కృష్ణ ర‌మేశ్ అలియాస్ శ్రీ‌కితో సంబంధాలు ఉన్నాయ‌న్న అంశంపై విచారించారు. శ్రీకి అనుచరులు కొనుగోలు చేసినట్టు చెబుతున్న పోర్షే మెకాన్ కారును 2018లో 57 లక్షలకు కొనుగోలు చేశార‌న్న అంశంలో ఈ విచార‌ణ జ‌రిపారు. త‌ర్వాత ఆ కారును రిఫండ్ కోసం షోరూమ్‌కు తిప్పి పంపారు. స‌ద‌రు ఐపీఎస్ అధికారి కుమారుడు రాజ‌కీయ నాయ‌కురాలిగా మారిన క‌ర్ణాట‌క సినీ న‌టి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ర‌న్యారావుకు కూడా క‌ర్ణాట‌కలోని సీనియ‌ర్ పొలిటీషియ‌న్స్‌తో సంబంధాలు ఉన్న‌ట్టు తెలుస్తున్న‌ది. అయితే.. ఆమె స్మ‌గ్లింగ్ వ్య‌వ‌హారంతో త‌న‌కేమీ సంబంధం లేద‌ని ఆమె స‌వ‌తి తండ్రి, డీజీపీ కే రామ‌చంద్రారావు పేర్కొన్నారు. ఆమె వ్య‌వ‌హారాల‌తో త‌న‌కేమీ సంబంధం లేద‌ని రామ‌చంద్రారావు చెప్పిన‌ట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఆమె నాలుగు నెల‌ల క్రిత‌మే వివాహం చేసుకున్న‌ద‌ని, అప్ప‌టి నుంచి త‌మ ఇంటికి రాలేద‌ని ఆయ‌న చెప్పారు. ఆమె భ‌ర్త ఏం వ్యాపారం చేస్తుంటాడో కూడా త‌మ‌కు తెలియ‌ద‌ని పేర్కొన్నారు. ఈ సంఘ‌ట‌న త‌న‌ను షాక్‌కు గురిచేసింద‌ని అన్నారు. చ‌ట్టం త‌న ప‌ని తాను చేసుకుపోతుంద‌ని క్లారిటీ ఇచ్చారు