Plane Crash | అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనను చిత్రీకరించిన బాలుడు.. పోలీసుల అదుపులో!

  • By: TAAZ    news    Jun 14, 2025 9:35 PM IST
Plane Crash | అహ్మదాబాద్‌ విమాన ప్రమాద ఘటనను చిత్రీకరించిన బాలుడు.. పోలీసుల అదుపులో!

Plane Crash | ఆ వీడియో ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వేలు లక్షల్లో సామాజిక మాధ్యమాల్లో షేర్‌ అయింది. దానిని చిత్రీకరించిన బాలుడు మాత్రం ఇప్పుడు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాడు. ఆ రోజు రాత్రి నిద్రకూడా పట్టలేదని చెబుతున్నాడు. ఇప్పుడు ఈ వీడియోను నిపుణులు, భద్రతా సిబ్బంది తమ తదుపరి దర్యాప్తులో ఆధారంగా చేసుకుంటున్నారు. ఆ బాలుడు.. గాల్లో ఎగురుతూ.. క్రమంగా కిందికి వాలిపోతూ.. ఒక భవంతిపై పడి.. మరుక్షణం అగ్నిగోళాన్ని సృష్టిస్తూ సాగిన మొత్తం క్రమాన్ని రికార్డు చేశాడు. ఇప్పుడు ఆ బాలుడిని పోలీసులు శనివారం తమ రక్షణలోకి తీసుకున్నట్టు తెలుస్తున్నది.

తాను నివసించే మూడంతస్తుల భవనం టెర్రస్‌పై ఆ సమయంలో ఉన్న బాలుడు.. తన కళ్లముందు మునుపెన్నడూ చూడని దృశ్యం గమనించి.. దానిని రికార్డు చేశాడు. ఆ బాలుడు తన తండ్రితో కలిసి నివసించే ఆ భవనం అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టకు అతి సమీపంలో లక్ష్మణ్‌నగర్‌లో ఉన్నది. ఈ బాలుడు 12వ తరగతి చదువుతున్నాడు. వాస్తవానికి ఎయిర్‌పోర్టు నుంచి విమానాలు ఎగిరే సందర్భంలో వాటిని చిత్రీకరించి.. అరవల్లి జిల్లాలోని తన గ్రామంలోని స్నేహితులకు పంపుదామని ఆ భవంతి టెర్రస్‌పైకి వచ్చినప్పుడు అదే సమయంలో ప్రమాదానికి గురైన విమానం కిందికి జారుతూ వస్తుండగా దానిని రికార్డు చేశాడు. ఈ వీడియోను రికార్డు చేసిన బాలుడు.. ఆ ప్రమాద తీవ్రతను తెలుసుకుని తీవ్రంగా కలత చెందాడని, రాత్రి సరిగా నిద్రకూడా పోలేదని చెబుతున్నాడు. మీడియా వెంటపడుతున్న నేపథ్యంతోపాటు.. ఇతర వివరాలను తెలుసుకునే ఉద్దేశంతో అహ్మదాబాద్‌ పోలీసులు అతడిని తమ వెంట తీసుకుని వెళ్లినట్టు తెలుస్తున్నది.