BUS ACCIDENT: ప్రమాద ఘటన పై తిరగబడ్డ జనం
రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులపై ప్రజలు తిరగబడ్డారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని వారు నిలదీశారు. ప్రజల నుంచి ఇలాంటి ప్రతిఘటన వస్తుందని వారు ఊహించలేకపోయారు.
ఎమ్మెల్యే యాదయ్యపై రాళ్లు
సబితా రెడ్డి, విశ్వేశ్వర్ ల నిలతీత
హైదరాబాద్, విధాత: రంగారెడ్డి జిల్లా ప్రజా ప్రతినిధులపై ప్రజలు తిరగబడ్డారు. ప్రజల ప్రాణాలంటే లెక్కలేదని వారు నిలదీశారు. ప్రజల నుంచి ఇలాంటి ప్రతిఘటన వస్తుందని వారు ఊహించలేకపోయారు. చేవెళ్ల నియోజకవర్గానికి మాజీ మంత్రులు మహేందర్ రెడ్డి, సబితా రెడ్డి, ఎమ్మెల్యే యాదయ్యలు ఏమీ చేయలేదని ప్రమాద బాధితుల బంధువులు దుమ్మెత్తిపోశారు. ఈ ప్రమాదానికి కారకులు వారేనంటూ ఆరోపించారు.
సోమవారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేట్ వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సును టిప్పర్ బలంగా ఢీకొట్టింది. ఓవర్ లోడ్ కంకర తో వస్తున్న టిప్పర్ మితిమీరిన వేగంతో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్ సహా 24 మంది మరణించగా, 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సు నుజ్జు నుజ్జయి ఆనవాలు లేకుండా పోయింది. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ఎమ్మెల్యే యాదయ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయగా మరికొందరు రాళ్లు విసిరారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గమనించిన అనుచరులు అక్కడి నుంచి ఆయనను పంపించారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఎమ్మెల్యే యాదయ్య అక్కడి నుంచి నిష్క్రమించారు. నిత్యం ఈ రోడ్డులో ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులతో స్థానికులు వాగ్వివాదానికి దిగారు. ఆర్టీసి బస్సును ఇక్కడి నుంచి తొలగించవద్దని పోలీసులను బాధితుల బంధువులు హెచ్చరించారు.
ప్రజా ప్రతినిధులకు పరాభవం
చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పీ.సబితా రెడ్డిని నిలదీశారు. మీరు ఈ ప్రాంతానికి చేసిందేమి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేవెళ్లకు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఏమీ చేయలేదని, మరో మాజీ మంత్రి సబితారెడ్డి కూడా ఏమీ చేయలేదని ప్రమాదంలో తన కుమార్తెను కోల్పోయిన తండ్రి ఆక్రోశం వ్యక్తం చేశారు. సబితా రెడ్డి మంత్రిగా ఉన్నా రోడ్డు వేయలేదన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్య కూడా చేసిందేమి లేదన్నారు. వీళ్లు పట్టించుకుంటే ఈ ఘోర ప్రమాదం జరిగేది కాదన్నారు. అధికారంలో ఉంటూ వాళ్ల ఆస్తులు పెంచుకున్నారంటూ దూషించారు. తమ ఆస్తులను కాపాడుకునేందుకు రోడ్డు విస్తరణ అడ్డుకున్నారన్నారు. ఈ యాక్సిడెంట్ కు కారణం ఈ నలుగురు నాయకులేనన్నారు. వీళ్లు తప్పకుండా బాధ్యత వహించాలన్నారు. నా సోదరుడి కుమార్తె అఖిల ఈ దుర్ఘటనలో చనిపోయిందన్నారు. ఎంబీఏ చదువుతున్నదని, మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయిని కోల్పోయామన్నారు. సబితారెడ్డి మా తాండూరు ఆడబిడ్డనే, ఈ రోడ్డును పట్టించుకుని పూర్తి చేస్తే ఇంతమంది చనిపోయేవారు కాదన్నారు. మేడం మీరే కారణం అని ఆయన ఆమెను నిలదీశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు. చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరి మధ్య కొద్దిసేపు వాదులాట జరిగింది.
బీఆర్ఎస్ వల్లే రోడ్డు ఆగిపోయింది
హైదరాబాద్ నుంచి వికారాబాద్ వరకు ఇది ఒక్కటే జాతీయ రహదారి అని చేవెళ్ల బీజేపీ ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ రోడ్డు నేనే తెచ్చాను, భూ సేకరణ చేయకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆపిందని విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదేళ్ల నుంచి పనులు కాకుండా అడ్డుకుందన్నారు. 2017 లో నేనే కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తో చెప్పి నిధులు మంజూరు చేయించానన్నారు. తెలంగాణకు 11 జాతీయ రహదారులు మంజూరు కాగా, 10 పూర్తి అయ్యాయని, ఈ ఒక్క రోడ్డు పూర్తి కాలేదన్నారు. కరీంనగర్, నల్లగొండలో జాతీయ రహదారులకు భూ సేకరణ పూర్తి అయ్యిందని, ఇక్కడ మాత్రం చేయలేదన్నారు. రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ కన్పిస్తుందని, ప్రజల కష్టాలు ప్రభుత్వాలకు కన్పించవన్నారు. రియల్ ఎస్టేట్ కోసం వంకర టింకర గా భూ సేకరణ చేశారన్నారు. నేరుగా అలైన్ మెంట్ ఖరారు చేయాలని కోరగా, మర్రి చెట్లు పోతున్నాయని చెన్నై గ్రీన్ ట్రిబ్యునల్ లో కొందరు కేసు వేయించారన్నారు. ఇక్కడి ప్రజలు కేసు వేయలేదని, చెన్నై వాసులు కేసు వేశారన్నారు. ట్రిబ్యునల్ లో కేసు కూడా పరిష్కారం అయ్యిందని, ఏడాదిన్నరలో రోడ్డు విస్తరణ పూర్తవుతుందన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram