PM MODI | సైన్యానికి పూర్తి స్వేచ్ఛ! ఎప్పుడు చేస్తారో.. ఎలా చేస్తారో మీ ఇష్టం

  • By: sr    news    Apr 29, 2025 9:15 PM IST
PM MODI | సైన్యానికి పూర్తి స్వేచ్ఛ! ఎప్పుడు చేస్తారో.. ఎలా చేస్తారో మీ ఇష్టం
  • మీ పనితీరుపై మాకు పూర్తి విశ్వాసం
  • పహల్గామ్‌ ఘటనకు ప్రతీకారం తప్పదు

న్యూఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలనకు తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అన్నారు. పహల్గామ్‌ దాడికి ప్రతిస్పందించే విషయంలో సాయుధ బలగా వృత్తినైపుణ్యాలపై తమకు పూర్తి విశ్వాసం ఉన్నదని చెప్పారు. దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన పహల్గామ్‌ ఉగ్రదాడి నేపథ్యంలో మంగళవారం ప్రధాని అత్యున్నస్థాయి భద్రతా సమావేశాన్ని నిర్వహించారు. ‘మన ప్రతిస్పందనలో టార్గెట్‌లు, పద్ధతిని నిర్ణయించుకునేందుకు వారికి పూర్తిస్థాయి ఆపరేషనల్‌ స్వేచ్ఛ ఉన్నది’ అని మోదీ చెప్పారని విశ్వసనీయవర్గాలను ఉటంకిస్తూ వార్తలు వెలువడ్డాయి. ప్రధాని మోదీ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, త్రివిధ దళాధిపతులు పాల్గొన్నారు.

చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ అనిల్‌ చౌహాన్‌ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
అంతకు ముందు బీహార్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని.. పహల్గామ్‌ ఘటనకు బాధ్యులైనవారిని, పాకిస్తాన్‌ ఉద్దేశించి… వారిని పురికొల్పినవారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, ప్రపంచంలో ఎక్కడ దాగా ఉన్నా.. వెతికి మరీ వేటాడుతామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. వారిని ఎట్టిపరిస్థితిలో చట్టం ముందు నిలబెడుతామని చెప్పారు. తమ ప్రతీకారం ఎవరూ ఊహించని స్థాయిలో ఉంటుందని కూడా గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. ఈ ఘటనకు తొలి స్పందనగా అనేక దౌత్యపరమైన చర్యలను భారత ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్‌కు సింధు నది జలాలను నిలిపివేయడం కూడా అందులో కీలకమైనది.