సామాన్యుడికి ఒక న్యాయం.. కార్పొరేట్లకు మరో న్యాయమా?

కార్పొరేట్ రుణాల రైటాఫ్‌లు, దివాలా ప్రక్రియలు, బ్యాంకుల వన్‌టైమ్ సెటిల్‌మెంట్లపై చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. సామాన్యులు, రైతులతో పోలిస్తే కార్పొరేట్ సంస్థలకు భిన్నమైన వైఖరి ఎందుకని ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

బ్యాంకులకు వేలకోట్ల ఎగవేతలపైన…రుణాల చెల్లింపులలో మినహాయింపులపైన సామాన్యులకు, కార్పోరేట్లకు భిన్నమైన న్యాయం అమలు చేయడం పట్ల సమాజంలో ప్రశ్నలు బలపడుతున్నాయి. తాజాగా ఓ జర్నలిస్టు జీవీకే సంస్థ, గాయత్రి సంస్థల దివాలా ప్రక్రియ, రుణ సెటిల్మెంట్లు, కొత్త ఆస్తుల కొనుగోలు అంశాలపై కీలక ప్రశ్నలు సంధించిన వీడియో వైరల్ గా మారింది. ఆలోచించండి ఒక సారి అంటూ ఆయన చేసిన వీడియోలో దేశంలోని ఆర్థిక చట్టాలు, బ్యాంకర్లు సామాన్యుల రుణాల పట్ల నిర్భంధంగా..కార్పోరేట్ సంస్థల రుణాల ఎగవేతలకు మద్దతుగా వ్యహరిస్తున్న తీరును ఎండగట్టారు. ..దేశంలోని చట్టాలు కార్పోరేట్ చుట్టాలుగా మారయనడానికి కార్పోరేట్ సంస్థల రుణ ఎగవేతల పట్ల బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు అనుసరించిన తీరు చక్కని నిదర్శనం అని..ఆయన నిలదీసిన వైనం అందరిని ఆలోచింపచేస్తుంది.

వారికి వేల కోట్ల రుణ చెల్లింపుల మినహాయింపులు!

గతంలో మాజీ ఎంపీ టి.సుబ్బరాంరెడ్డి గాయత్రి ప్రాజెక్టు లిమిటెడ్(కనస్ట్రక్షన్స్) సంస్థ దివాలా తీసిందంటూ బ్యాంకులకు రూ.8,500 కోట్లు ఎగవేసిందని, అయితే బ్యాంకర్ల కమిటీ వన్ టైమ్ సెటిల్మెంట్ కింద వారికి రూ. 2,500కోట్లు కడితే చాలంటూ చివరకు రూ. 5వేల కోట్ల రుణ మినహాయింపు ఇచ్చారని, అలాంటి ఆఫర్ సామాన్యుల గృహ రుణాలకు, రైతుల రుణాలకు ఎందుకు ఇవ్వరంటూ ఆ జర్నలిస్టు ప్రశ్నలు సంధించారు. సుబ్బరాంరెడ్డి వియ్యంకుడైన జీ.వీ.కృష్ణారెడ్డి కుమార్తె శాలిని భూపాల్ జీవీకే సంస్థ తాజాగా తాజ్ కృష్ణా, తాజ్ దక్కన్ హోటల్స్ నుంచి టాటా గ్రూప్ నుంచి 25.52శాతం రూ.592కోట్ల రూపాయల వాటాలను కొనుగోలు చేశారని వెల్లడించారు. అయితే ఇదే జీవీకే సంస్థ ఎన్సీఎల్టీలో ఇటీవల దివాలా పిటిషన్ దాఖలు తీసిందని, అలాంటి వాళ్లు ఆరు నెలల్లోనే రూ.592కోట్ల వాటాలను ఎలా కొనుగోలు చేశారని ప్రశ్నించారు. దీనిని భారతీయ చట్టాలు ఎలా గుర్తించలేదని నిలదీశారు.

దివాల పిటిషన్ వేసి వందల కోట్ల కొత్త ఆస్తుల కొనుగోలు ?

అలాగే జీవీకే పవర్ ఆండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ సంస్థ ఐసీఐసీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.18వేల కోట్ల బకాయిలను మేం చెల్లించలేమంటూ ఎన్సీఎల్టీలో 2024 జూలైలో దివాలా పిటిషన్ వేశారని ఆయన వెల్లడించారు. దివాలా తీశామని చెప్పిన వాళ్లే టాటాల నుంచి రూ.592కోట్ల వాటాలను కొనుగోలు చేశారని ఎత్తి చూపారు. అదేమని ప్రశ్నిస్తే..మాకు చాల సంస్థలు, విభాగాలు ఉంటాయని ఒక వింగ్ దివాలా తీస్తే..మిగతా వింగ్ లు ఎందుకు కొత్త ఆస్తులను కొనుగోలు చేయరాదంటూ కార్పోరేట్ సంస్థలు ప్రశ్నిస్తుంటాయని ఆయన వివరించారు. జీవీకే సంస్థపై ముంబై ఎయిర్ పోర్టు నిర్వహణలో (ఎంఐఏఎల్) రూ.705కోట్ల స్కామ్ కు సంబంధించి ఈడీ, సీబీఐ కేసులు నడుస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముంబై ఎయిర్ పోర్టులో జీవీకే తన వాటాను ఆదానీకి విక్రయించిందని తెలిపారు. అలాగే ఆస్ట్రేలియాలోని బొగ్గు గనుల కోసం జీవీకే కోల్ డెవలపర్స్ తీసుకున్న రూ.12వేల కోట్ల రూపాయల రుణాలను తిరిగి చెల్లించడంలో విఫలమైనట్లుగా 2022లో లండన్ హైకోర్టులో ఐసీఐసీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా సహా ఆరు బ్యాంకులు కేసులు వేశాయని గుర్తు చేశారు.

సామాన్యుడు చేస్తే బ్యాంకర్లు భరిస్తారా..?

ఇన్ని వేల కోట్ల రుణ ఎగవేతలకు, స్కామ్ లకు పాల్పడిన జీవీకే సంస్థ ఇప్పుడు కొత్తగా తాజ్ హోటల్స్ లో టాటాల నుంచి రూ. 592కోట్ల వాటాలను కొనుగోలు చేసే అవకాశం ఉండటం భారతీయ చట్టాలలోని లోపాలకు నిదర్శనం అని చురకలేశారు. అదే సామాన్యుడు, రైతులు వారు కట్టాల్సిన రుణాలను ఎగవేసి..కొత్తగా ఆస్తులను కొనుగోలు చేస్తే ఈ చట్టాలు, బ్యాంకులు ఊరుకుంటాయా అని..ఇలాంటి వ్యవస్థ గూర్చి ఓసారి ప్రజలు సీరియస్ గా ఆలోచించాలని ఆయన కోరారు.

పదేళ్లలో రూ.16లక్ష కోట్ల కార్పోరేట్ రుణాల మాఫీ.. !

దేశంలో బ్యాంకింగ్ రంగాన్ని పెద్ద పారిశ్రామిక వేత్తల, కార్పొరేట్ సంస్థల రుణ ఎగవేతలు, మొండి బకాయిలు తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. గడిచిన పదేళ్లలో వాణిజ్య బ్యాంకులు ఏకంగా రూ.16 లక్షల కోట్లకు పైగా కార్పొరేట్ రుణాలను మాఫీ (రైటాఫ్) చేశాయి. అలాగే, కేవలం ఐదేళ్ల వ్యవధిలో వివిధ బ్యాంకులు రూ.1.42 లక్షల కోట్ల మోసాలను (ఫ్రాడ్స్) ఎదుర్కొన్నట్లు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన ఐదు ఆర్థిక సంవత్సరాల్లో (2021-22 నుంచి 2025-26 వరకు) రూ.1,42,112 కోట్లు మోసపోయామని దేశంలోని వాణిజ్య బ్యాంకులు (ప్రభుత్వ, ప్రైవేట్‌, విదేశీ, స్మాల్‌ ఫైనాన్స్‌, పేమెంట్స్‌, స్థానిక బ్యాంకులు కలిపి), అఖిల భారత ఆర్థిక సంస్థలు ప్రకటించాయి. ఇదే సమయంలో రూ.6,389 కోట్లు రికవరీ అయినట్టు తెలిపాయి. ఈ మేరకు మంగళవారం పార్లమెంట్‌కు కేంద్రం వెల్లడించింది.

మారని బ్యాంకుల తీరు..

కార్పోరేట్ సంస్థలు బ్యాంకులకు భారీగా రుణాల ఎగవేతలకు పాల్పడుతున్నప్పటికి.. వారి పట్ల బ్యాంకులు తమ ప్రేమను వదులుకోవడం లేదు. ఈ జూన్ త్రైమాసికంలో, భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులు రుణాల విషయంలో ఒక కొత్త ట్రెండ్‌ వెలుగు చూసింది. కార్పొరేట్ లోన్ల వృద్ధి ఏడాదికి సగటున 26% పెరిగింది. దీనికి విరుద్ధంగా, రిటైల్ రుణాల విభాగం కేవలం 10% మాత్రమే వృద్ధిని సాధించడం ఆర్థిక నిపుణులలో చర్చనీయాంశమైంది.

మొండి బాకీలలో వారే అగ్రగామి

మొండి బాకీలలో దేశ వ్యాప్తంగా సంచలం రేపిన విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఈ సంస్థ భారీ నష్టాలు, అప్పుల కారణంగా 2012లో దివాలా తీసింది. నిర్వహణా ఖర్చు పెరగడంతో పాటు రకరకాల లోపాల కారణంగా సంస్థ నష్టాలపాలైంది. అయితే సంస్థను నడిపిం చుకునేందుకు దాదాపు 9 వేల కోట్ల రూపాయల మేర బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నాడు విజయ్ మాల్యా. లోన్ ఇచ్చిన 17 బ్యాంకులలో SBI ప్రాతినిధ్యం వహించింది. అయితే పెనాల్టీలు, వడ్డీలు అంతా కలుపుకుని ఈ లోన్ వాల్యూ 17 వేల కోట్లకు పెరిగినట్టు అంచనా. 2021 నాటికి ఇందులో 7 వేల కోట్ల వరకూ బ్యాంకులు రికవరీ చేయగలిగాయి. ఇదంతా జరిగాక విజయ్ మాల్యా యూకేకి పరారయ్యాడు. భారత్‌కు అప్పగించే ప్రక్రియ ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కేసు కూడా ఇదే తీరులో కొనసాగుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు 14 వేల కోట్ల రూపాయలు పైగా ఎగవేశాడు. ఏకంగా లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ స్కామ్‌కు తెరతీశాడు. ఆ తర్వాత నీరవ్ మోదీ యూకేకి పారిపోయాడు. చేసేదేమీ లేక పీఎన్‌బీ ఈ రుణం మొత్తాన్ని రైటాఫ్ చేసింది. గుజరాత్‌కు చెందిన షిప్ తయారీ సంస్థ ఏబీజీ షిప్‌యార్డ్‌కు 28 బ్యాంకుల నుంచి 2005-12 మధ్య కాలంలో భారీ స్థాయిలో రుణాలు తీసుకుంది. తర్వాతా ఈ సంస్థ మొత్తంగా 22 వేల కోట్ల రూపాయలకు పైగా ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే.

Latest News