EPF withdrawal rules | ఈపీఎఫ్ నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా?: ఈ రూల్స్ తెలుసా?

ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకొనే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు ఉపసంహరించుకొనే విషయంలో కేంద్ర కార్మిక శాఖ కీలక మార్పులు చేసింది. ఈపీఎఫ్ ఖాతా నుంచి 75 శాతం ఒకేసారి నిధులను డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25 శాతం నిధులను కూడా ఏడాది తర్వాత తీసుకొనే వెసులుబాటు కూడా ఉంది.

  • By: TAAZ |    news |    Published on : Oct 20, 2025 10:00 AM IST
EPF withdrawal rules | ఈపీఎఫ్ నుంచి డబ్బులు డ్రా చేస్తున్నారా?: ఈ రూల్స్ తెలుసా?

నిరుద్యోగం విషయంలో 75 శాతం పీఎఫ్ బ్యాలెన్స్ వెంటనే ఉపసంహరించుకోవచ్చని మంత్రిత్వ శాఖ చెబుతోంది. మిగిలిన 25% ఒక సంవత్సరం తర్వాత కూడా ఉపసంహరించుకోవచ్చు. 55 సంవత్సరాల సర్వీస్ పొందిన తర్వాత రిటైరైతే శాశ్వత వైకల్యం, పని చేయడానికి అసమర్థత, తొలగింపు, స్వచ్ఛంద పదవీ విరమణ లేదా భారతదేశం నుంచి శాశ్వతంగా వెళ్లిపోయే పరిస్థితులు ఏర్పడితే కూడా మొత్తం PF బ్యాలెన్స్ (కనీస బ్యాలెన్స్ 25%తో సహా) పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు.

పీఎఫ్ నుంచి డబ్బులు ఎప్పుడు డ్రా చేయాలి?

చిన్న చిన్న అవసరాలకే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేయడం మానుకోవాలి. రెండు నెలలు ఉద్యోగం లేకుండా ఉంటే పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసే బదులుగా ఇతర ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాలి. పిల్లల చదువు, పెళ్లి, గృహ నిర్మాణం, ఆరోగ్య అవసరాలకు పీఎఫ్ ఖాతా నుంచి డబ్బులు డ్రా చేసుకొంటే ఇబ్బంది ఉండదు. పిల్లల చదువుల అవసరాల కోసం 10 సార్లు కూడా డ్రా చేసుకోవచ్చు. పెళ్లిళ్లకు ఐదుసార్లు కూడా డ్రా చేయవచ్చు. ప్రత్యేక పరిస్థితుల్లో పీఎఫ్ ఖాతా నుంచి మొత్తం డబ్బులు కూడా డ్రా చేసుకోవచ్చు. 12 నెలల పాటు ఉద్యోగం చేస్తే చాలు పీఎఫ్ నుంచి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. గతంలో మాత్రం ఒక్కో అవసరానికి ఒక్కో రకమైన నిబంధన ఉండేది. గతంలో ఉన్న నిబంధనలను మార్చివేశారు. గతంలో 13 రకాల అవసరాలకు పీఎఫ్ నుంచి డబ్బులు డ్రా చేసుకొనే అవకాశం ఉండేది. అయితే ఒక్కో అవసరానికి ఒక్కో రకమైన నిబంధనలు ఉండేవి. పీఎఫ్ ఖాతా నుంచి డ్రా కోసం ధరఖాస్తు చేసిన మూడు రోజుల్లో డబ్బులు వినియోగదారుడి ఖాతాల్లోకి వస్తున్నాయి. గతంలో ఇది 15 రోజుల నుంచి నెల వరకు సమయం పట్టేది.

ఎక్కువ వడ్డీ రావాలంటే?

ప్రతి నెలా ఉద్యోగి జీతం నుంచి 12 శాతం, యజమాని నుంచి మరో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తాయి. దీనిపై వడ్డీ కూడా వస్తుంది. ఉద్యోగి రిటైరైన తర్వాత కూడా ఈ డబ్బులు డ్రా చేసుకోకుండా 61 ఏళ్ల వరకు ఆగిపోతే మెరుగైన వడ్డీ లభిస్తోంది. ఒక సంస్థలో ఉద్యోగం మానేసి మరో సంస్థలో ఉద్యోగంలో చేరితే మీ పీఎఫ్ ఖాతాను కొత్త సంస్థకు లింక్ చేయాలి. ఈపీఎఫ్ ఖాతాలో ఉద్యోగులు ఇంకా ఎక్కువగా కూడా డబ్బులు జమ చేయవచ్చు. అంటే మీకు జీతంలో పీఎఫ్ కోసం మినహాయించే మొత్తానికి అదనంగా కూడా ఈ ఖాతాలో డబ్బులు వేయవచ్చు. అలా చేస్తే మీ ఖాతాలో నగదు పెరుగుతోంది. వడ్డీ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈపీఎఫ్ పై 8.25 శాతం వడ్డీ ఇస్తున్నారు. ప్రతి ఏటా అసలులో వడ్డీ కలుస్తోంది. అంటే ఒక రకంగా చక్రవడ్డీ తరహాలో వడ్డీ వస్తుంది. దీంతో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఈ నిదులను డ్రా చేసుకుంటే ఆదాయపన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు.