Malla Reddy |
విధాత : బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy) తరచు తన మాటలు..చేష్టలతో అందరిని నవ్విస్తుంటారు. పాలమ్మినా..పూలమ్మినా అన్న డైలాగ్ లతో ఫేమస్ అయినా మల్లారెడ్డి తన విద్యాసంస్థల కార్యక్రమాలకే కాకుండా అసెంబ్లీలో..బయట తన మార్క్ డైలాగ్ లతో.. డ్యాన్సులతో అందరిని అలరిస్తుంటారు. అడపదడపా సినిమా ఈవెంట్లకు కూడా హాజరై తనదైన శైలీ డైలాగ్ లతో నవ్వించడం చూస్తుంటాం. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా ఈవెంట్ కు హాజరైన మల్లారెడ్డి సరదాగా మాట్లాడే క్రమంలో హీరోయిన్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదస్పదంగా మారాయి.
మల్లారెడ్డి (Malla Reddy) వేదికపై మాట్లాడుతూ.. సినిమా హీరోయిన్ పేరు కసికపూర్ (Kasi Kapoor) అంట.. మంచి కసి కసిగా ఉంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మల్లారెడ్డి హీరోయిన్ పై చేసిన వ్యాఖ్యలతో అక్కడున్న వారంత నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే విద్యాసంస్థల ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా ఉన్న మల్లారెడ్డి తన కూతురు వయసున్న హీరోయిన్ ను ఉద్దేశించి అలా మాట్లాడం మంచిది కాదంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
మల్లారెడ్డి ఇదే వేదికపై మాట్లాడుతూ సినిమా హీరో మా విద్యాసంస్థల్లోనే చదువుకున్న విద్యార్థి అని.. ఇప్పుడు ఇక్కడే హీరో కావడం సంతోషమని చెప్పుకొచ్చారు. హీరో తండ్రి మా విద్యా సంస్థల్లో ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారని.. అందుకే వారి సినిమా ప్రమోషన్ ఈవెంట్ కోసం ఈ రోజు అసెంబ్లీకి డుమ్మా కొట్టి వచ్చానని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాల్సిన బాధ్యత విస్మరించడమే కాకుండా..సమావేశాలకు డుమ్మా కొట్టి ఓ సినిమా ఈవెంట్ కు హాజరై అసెంబ్లీ ప్రాధాన్యతను తగ్గించేశారని మల్లారెడ్డి తీరును నెటిజన్లు తప్పుబడుతున్నారు. పైగా సినిమా ఈవెంట్ లో తన స్థాయిని.. హుందాతనాన్ని మరిచి ఓ అమ్మాయి మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడని మల్లారెడ్డిని ట్రోల్ చేస్తున్నారు.