Kadiyam Srihari | కాళేశ్వరం కూలడానికి కేసీఆర్, హరీష్ కారణం : మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి

Kadiyam Srihari | విధాత, వరంగల్ ప్రతినిధి: కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులలో కేసీఆర్, కేటీఆర్ లు జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి జోష్యం చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ ను దుర్వినియోగం చేశారనీ, లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ద్వారా 50వేల ఎకరాలకు కూడా సాగు నీరు అందలేదని విమర్శించారు. కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆర్, హరీష్ రావులే కారణమని, కాళేశ్వరానికి మెడిగడ్డ గుండెకాయలాంటిదన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు నాంది పలికింది కేసీఆరే అంటూ తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ పరిధిలో జరిగిన కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ సందర్భంగా కడియం ప్రసంగించారు. గత పాలకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూ కబ్జాలు, అవినీతి, అక్రమాలు, వేల కోట్ల ఆస్తులు ఎలా సంపాదించుకున్నారన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ద్వారా 50వేల ఎకరాలకు కూడా సాగు నీరు అందలేదన్నారు. కాళేశ్వరం కుంగిపోయి, కూలిపోయే స్థితికి వచ్చిందని అన్నారు.
నా అంత తెలివి ఎవరికీ లేదని నీటి పారుదల ప్రాజెక్టులలో కేసీఆర్ జోక్యం చేసుకోవడం వల్లనే కాళేశ్వరం కూలిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన జరుగుతున్న న్యాయ విచారణలో కేసీఆర్, హరీష్ రావు అనేక తప్పిదాలకు పాల్పడ్డారని కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆర్ హరీష్ రావులే కారణమని విచారణ కమిటీ చెబుతోందని అన్నారు. ఈ విషయం ప్రజల్లోకి వెళ్లకుండా ప్రజలను తప్పుదారి పట్టించడానికి కృష్ణ, గోదావరి జలాలలో అన్యాయం జరుగుతుందని మాట్లాడడానికి సిగ్గు ఉండాలని మండి పడ్డారు. గోదావరి పెన్నా నదుల అనుసంధానం ప్రతిపాదన గత ప్రభుత్వ హయాంలోనే జరిగిందని, అప్పుడే టెండర్లు పిలిచారు పనులు ప్రారంభించారాని అన్నారు. ఇప్పుడు పేర్లు మార్చి గోదావరి పైన పోలవరం, కృష్ణ నది పైన బనకచర్ల లింక్ ప్రాజెక్టు అని పనులు చేస్తున్నారని అన్నారు. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ హక్కులే ముఖ్యమని, మనకు చెందాల్సిన నది జలాలను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. పోలవరం, బనకచర్ల ప్రాజెక్టులను ఆపి తీరుతామని అన్నారు. సోషల్ మీడియా అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వంపై విషం చీమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.