Harish Rao | జాబ్ క్యాలెండర్.. ఒక దగా క్యాలెండర్! : మాజీ మంత్రి హరీష్ రావు

మేం ఏడాదికి 16 వేల ఉద్యోగాలు సగటున మేం ఇస్తే, రెండేళ్లుగా రేవంత్ రెడ్డి సగం కూడా ఇవ్వలేదన్నారు. లక్షా 62 వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని..మేం ఉద్యోగాలు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్న సీఎం రేవంత్ రెడ్డి వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.

  • By: TAAZ    news    Jun 28, 2025 7:24 PM IST
Harish Rao | జాబ్ క్యాలెండర్.. ఒక దగా క్యాలెండర్! : మాజీ మంత్రి హరీష్ రావు

Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో పెట్టిన జాబ్ క్యాలెండర్ మేరకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. దీనిపై తాము అసెంబ్లీలో ప్రశ్నిస్తే చర్చ పెట్టకుండా సభ వాయిదా వేసుకొని పారిపోయాడని విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్పీడీసీఎల్, ఫారెస్ట్, గ్రూప్స్, డీఎస్సీ, పోలీసు ఇలా అన్ని శాఖల్లో పోస్టుల భర్తీ అని జాబ్ క్యాలెండర్‌లో చెప్పారని..ఇప్పటిదాక ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదని విమర్శించారు. ఇది జాబ్ క్యాలెండర్ కాదు..దగా క్యాలెండర్ అని..మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయ్యిందన్నాని ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో పెట్టి కూడా ఒక్క ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వని చరిత్ర కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనని విమర్శించారు. నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తుంటే..20 నెలలు కావొస్తున్నా నోటిఫికేషన్లు ఇవ్వకపోగా..నోటిఫికేషన్లు వద్దు అని విద్యార్థులు ధర్నా చేస్తున్నరని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మొదటి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అని ఫుల్ పేజీ యాడ్స్ ఇచ్చారని..20 నెలల్లో రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు 12 వేలు దాటలేదని విమర్శించారు.

మేం ఏడాదికి 16 వేల ఉద్యోగాలు సగటున మేం ఇస్తే, రెండేళ్లుగా రేవంత్ రెడ్డి సగం కూడా ఇవ్వలేదన్నారు. లక్షా 62 వేల ఉద్యోగాలు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందని..మేం ఉద్యోగాలు ఇవ్వడం లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 60 వేల ఉద్యోగాలు ఇచ్చామంటున్న సీఎం రేవంత్ రెడ్డి వాటిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. కోదండరాం, బల్మూరి వెంకట్, ఆకునూరి మురళి, రియాజ్‌లు వచ్చి ఎన్నికల్లో విద్యార్థులను, నిరుద్యోగులను మాయ మాటలు చెప్పి రెచ్చగొట్టారని..ఇప్పుడు విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదు కానీ, రెచ్చగొట్టిన వారికి మాత్రం రాజకీయ ఉద్యోగాలు వచ్చాయని హరీష్ రావు విమర్శించారు. ప్రియాంక గాంధీ సరూర్‌నగర్ స్టేడియంలో మీటింగ్ పెట్టి యూత్ డిక్లరేషన్ ప్రకటించారని..రాహుల్ గాంధీ సెంట్రల్ లైబ్రరీ మెట్ల మీద కూర్చొని నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారని..మరి నోటిఫికేషన్లు, ఉద్యోగాలు ఏమయ్యాయో సీఎం రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. 5 అంశాలున్న యూత్ డిక్లరేషన్‌లో ఒక్కటి కూడా అమలు కాలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ బీసీలకు మేలు చేసేలా 75 శాతం ప్రైవేటు రంగంలో రిజ్వరేషన్ తెస్తామన్నారని..జీవో 29 రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు నియామకాల్లో దగా చేశారన్నారు.

అమరుల కుటుంబాలకు నెలకు 25వేల ఫించన్ అన్నారని..అమ్మాయిలకు స్కూటీలు ఇస్తం అన్నారని ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్ నగర్, వివిధ జిల్లాల నుంచి నిరుద్యోగ యువత వచ్చి ఛలో సెక్రెటేరియట్ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు హరీష్ రావు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసే దాకా అసెంబ్లీ లోపల, బయట బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. పోరాటం తెలంగాణ రక్తంలోనే ఉందని..రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చే దాకా రేవంత్ రెడ్డిని వదిలిపెట్టబోమన్నారు. రూ. 3,000 కోట్ల ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేస్తామని చెప్పి చేయడం లేదని..రీయెంబర్స్‌మెంట్ ఒక్క రూపాయి ఇవ్వక కాలేజీలు మూత పడుతున్నాయని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. బడా కాంట్రాక్టర్లకు 12 వేల కోట్లు విడుదల చేశారని.. పిల్లలు కమిషన్ ఇవ్వడం లేదని ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వడం లేదా? అని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో 20 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారన్నారు. కరోనా వచ్చినా, ఆర్థిక సమస్యలు వచ్చినా కేసీఆర్ ఆపలేదన్నారు. తక్షణం ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు, రెండు లక్ష ఉద్యోగాలు ఇవ్వాలని, నాలుగు వేల భృతి ఇవ్వాలని, అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.