Banakacharla | హైదరాబాద్, జూలై 27 (విధాత) : బనకచర్ల ప్రాజెక్టు అత్యంత అన్యాయమైన ప్రాజెక్టు అని, అసలు ఆ ఆలోచనే దుర్మార్గమైనదని సాగునీటి రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘ఈ ప్రాజెక్టు ఉద్దేశం రాయలసీమకు నీళ్లివ్వడం కాదు.. ప్రాజెక్టు పేరుతో నిధులను దోచేయడమే. ఇవి ప్రజల ప్రాజెక్టులు కాదు. నాయకులకోసం కంట్రాక్టర్లు రూపొందించిన ప్రాజెక్టులు’ అని నీటిపారుదల నిపుణులు నైనాల గోవర్ధన్ చేసిన వ్యాఖ్య బనకచర్లకు అక్షరాలా సరిపోతుంది. బనకచర్ల ఆంధ్ర కాళేశ్వరం అవుతుందని కూడా ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దండగమారి ప్రాజెక్టు అని గోవర్ధన్ చాలా కాలంగా మాట్లాడుతున్నారు. కాళేశ్వరం వల్ల సుమారు 50 వేల కోట్లు అదనంగా రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు. బనకచర్ల కూడా అటువంటిదే స్పష్టంచేశారు. రాయలసీమకు నీటిని తరలించే విషయంలో ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు లేవని, సీమకు అవసరమైన నీటిని తరలించడానికి ఇప్పుడున్న ప్రాజెక్టులు సరిపోతాయని నీటిపారుదల నిపుణులు, పౌర సమాజ ప్రతినిధులు వాదిస్తున్నారు. పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ నుంచి మొదట తరలించింది 11000 క్యూసెక్కులు మాత్రమే. అంటే రోజుకు ఒక టీఎంసీ. రాజశేఖర్‌రెడ్డి దానికి నాలుగింతల కాలువ తవ్వి మరో 44,000 క్యూసెక్కుల నీటిని తరలించే ఏర్పాటు చేశారు. అంటే రోజుకు మరో నాలుగు టీఎంసీలు తరలించవచ్చు. అంటే మొత్తంగా రోజుకు ఐదు టీఎంసీల నీటిని తరలించే అవకాశం ఉంది. ఇది చాలదని జగన్‌మోహన్‌రెడ్డి ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శ్రీశైలం అట్టడుగునుంచి అంటే 800 అడుగుల లెవెల్ నుంచి రోజుకు 34,722 క్యూసెక్కుల నీటిని, అంటే రోజుకు మరో మూడు టీఎంసీల నీటిని తరలించేందుకు మరో కాలువను పోతిరెడ్డిపాడుదాకా తవ్వుకొచ్చి అక్కడి నుంచి ఎత్తిపోసేందుకు రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించారు. అంటే మొత్తంగా రోజుకు 89,722 క్యూసెక్కుల నీటిని.. అంటే 8 టీఎంసీల నీటిని తరలించేందుకు ప్రాజెక్టులు పూర్తయ్యాయి. రాయలసీమ ఎత్తిపోతల పథకం (ఆర్ఎల్ఐఎస్) ఇంకా నీటిని తరలించడం ప్రారంభించలేదు. ఆర్ఎల్ఐఎస్ పూర్తి కాకుండానే 2024/25 సంవత్సరంలో రాయలసీమకు తరలించిన నీటి మొత్తం 240 టీఎంసీలు. ఇవి తుంగభద్ర, సుంకేశుల నుంచి ఉపయోగించుకున్న నీటికి అదనమని నీటిపారుదల నిపుణులు చెబుతున్నారు. 2019/20 నుంచి ఇప్పటి దాకా ఒక్క 2023/24లో తప్ప మిగిలిన అన్ని సంవత్సరాల్లో 200 టీఎంసీలకు పైగా నీటిని తీసుకుంటూనే ఉంది. దీనికి ఆర్ఎల్ఐఎస్ తోడైతే ఇక చెప్పేదేముంది? రోజుకు 8 టీఎంసీల చొప్పున 30 వరద రోజుల్లోనే 240 టీఎంసీల నీటిని తీసుకోవచ్చు. ఇదికాకుండా హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి తీసుకునే 40 టీఎంసీలు వేరే. తుంగభద్ర నుంచి తీసుకునే 20 టీఎంసీలు కూడా లెక్క గడితే సుమారు 300 టీఎంసీలు రాయలసీమ తీసుకోగలుగుతుంది. ఇవి తెలంగాణ తీసుకునే నీటికంటే ఎక్కువ. ఇక బనకచర్ల ఎందుకు?
కడప, నెల్లూరు కోసమే ఆరాటం?
ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాయలసీమలో మొత్తం సాగుభూమి 49 లక్షల ఎకరాలు. అందులో అత్యధిక సాగుభూమి ఉంది అనంతపురంలోనే. పోతిరెడ్డిపాడు లెక్కలో అనంతపురం ఉండదు. ఒక్క హంద్రీనీవా మాత్రమే అనంతపురానికి నీళ్లిస్తుంది. హంద్రీనీవా కాలువ నీటి తరలింపు సామర్థ్యం 4000 క్యూసెక్కులు. పూర్తిసామర్థ్యం నీళ్లు వదిలితే కాలువ నిలిచే పరిస్థితి లేదు. లైనింగ్ చేయలేదు. హంద్రీ నీవా కింద అనంతపురంలో పిల్ల కాలువలు పూర్తి చేయలేదు. చెరువులు, పొలాలకు నీరిచ్చే పనులను ఇంకా పూర్తి చేయలేదు. కానీ కడప, నెల్లూరు జిల్లాల కడుపు నింపడానికి మాత్రం మొన్న చంద్రబాబు, నిన్న జగన్, నేడు మళ్లీ చంద్రబాబు తెగ ఆరాటపడుతున్నారని రాయలసీమకే చెందిన సీనియర్ జర్నలిస్టు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే 26.7 లక్షల ఎకరాల సాగుభూమి ఉండగా, కడప, కర్నూలు జిల్లాల సాగుభూమి 18.4 లక్షల ఎకరాలు మాత్రమేనని ఆయన అన్నారు. హంద్రీ నీవా కాలువ సామర్థ్యం పెంచకుండా ముచ్చుమర్రి, మల్యాల వద్ద లిఫ్టులు పెంచుకుంటూ పోవడం వల్ల ప్రయోజనం ఏముంటుందని ఆయన ప్రశ్నించారు. రాయలసీమకు మొత్తం 300 టీఎంసీల నీరు సరిపోతుంది. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ప్రకారం రెండు రాష్ట్రాలకు కలిపి మరో 200 టీఎంసీలు అదనంగా వచ్చాయి. మొత్తంగా వెయ్యి టీఎంసీలు రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చు. ఎటొచ్చీ పంపకాల వద్దే పంచాయతీ అంతా.
కృష్ణా డెల్టాకు గోదావరి జలాలు.. సీమ, తెలంగాణకు కృష్ణా జలాలు
గోదావరి నుంచి నీటిని బనకచర్లకు తీసుకురానవసరం లేదని నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చంద్రబాబుకు గానీ జగన్‌కు గానీ నిజాయతీ ఉంటే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాల్లో తెలంగాణకు, రాయలసీమకు నికరజలాలు కేటాయించి, పోలవరం నుంచి ఎంత నీటిని వాడుకున్నా ఎవరూ అభ్యంతరపెట్టరని అంటున్నారు. పట్టి సీమ నుంచి ఇప్పటికే ప్రతిఏటా 80 నుంచి 90 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు తెస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఆ నీటిని కృష్ణా నదిలో ఎగువ రాష్ట్రాలకు కేటాయించాలి. తెలంగాణకు లేక రాయలసీమకు 45 టీఎంసీలు నికరజలాలు ఇస్తున్నామని చెబితే బనక చర్ల అవసరమే ఉండదు. అలాగే కొత్తగా పోలవరం నుంచి తరలించాలనుకుంటున్న 200 టీఎంసీలలో కూడా తెలంగాణకు, రాయలసీమకు వాటా ఇవ్వాల్సి ఉంటుంది. నాగార్జున సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు 180 టీఎంసీలు, సాగర్ కుడికాలువ కింద 132 టీఎంసీలు ఉపయోగిస్తున్నారు కదా… కృష్ణా డెల్టాకు పూర్తిగా పోలవరం నీటిని కేటాయించి సాగర్లో మిగిలే జలాలను రెండు ప్రాంతాలకు కేటాయించవచ్చు కదా! అన్ని లిఫ్టులు ఎందుకు? టన్నెళ్లు ఎందుకు? బనకచర్లదాకా ఎందుకు? దానిపేరుతో 80 వేల కోట్ల ఖర్చు ఎందుకు? ఇది ప్రజాధనం వృథా చేయడమే. రాష్ట్ర ఖజానాపై మోయలేని భారాన్ని మోపడమే. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేయడమే. ప్రజలకిచ్చే ఉచిత పథకాలకంటే బనకచర్ల ప్రమాదకరమైన పథకం. అందుకే ఆంధ్ర పౌర సమాజం ప్రతినిధులు కూడా ఈ పథకంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారని నిపుణులు గుర్తు చేస్తున్నారు.
నదుల అనుసంధానం ఒక పెద్ద బోగస్
గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి.. ఇలా నదులన్నింటినీ అనుసంధానం చేస్తామని కేంద్రం చాలాకాలంగా ఊదరగొడుతున్నది. అనుసంధానం పేరుతో నదీ జలాలపై పూర్తి పెత్తనం చేజిక్కించుకోవాలన్నది కేంద్రం ఎత్తుగడ అనే అభిప్రాయాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కూడా సందు దొరికితే చాలు నదులను అనుసంధానం చేస్తానంటూ బీరాలు పోతారని ఆంధ్ర ప్రాంత మేధావులు అంటున్నారు. ‘నిజానికి నదుల అనుసంధానం ఇప్పటికే జరిగిపోయింది. గోదావరి- కృష్ణా నదులను పట్టి సీమ నుంచి విజయవాడ వద్ద ఇప్పటికే సంధానించారు. గోదావరి-కృష్ణా నదులను ఎస్ఆర్ఎస్పీ రెండో దశ కాలువను మూసీకి సంధానించారు. ఇక కృష్ణా- శ్రీశైలం కుడికాలువ, తెలుగుగంగ, గాలేరు నగరి పథకం, హంద్రీనీవా పథకాల ద్వారా కృష్ణా-పెన్నా నదులతోపాటు రాయలసీమలోని ఆరు నదులను సంధానించారు. హంద్రీనీవా నీళ్లు అనంతపురంలో అన్ని ప్రాంతాలకు అందినా అందకపోయినా చిత్తూరు కొసకు పాలారు నదిని దాటుకుని కుప్పం ఆవల పాలసముద్రం చెరువును నింపుతాయి. అంత ఉత్సాహం ఉంటే పాలారు నదిపై పెద్ద రిజర్వాయరు నిర్మించి కావేరికి తరలించవచ్చు. అంతే తప్ప కొత్తగా నదుల అనుసంధానం గురించి మాట్లాడడం అంటే ప్రజాధనాన్ని బూడిదలో పోయడమేనని నీటిపారుల నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
నిజానికి రాయలసీమలోని వివిధ ప్రాజెక్టుల డీపీఆర్‌ల ప్రకారం నికరజలాలు కానీ వరదజలాలు కానీ ఎస్ఆర్‌బీసీకింద 19 టీఎంసీలు, చెన్నయ్ తాగునీటికోసం 15 టీఎంసీలు, తెలుగుగంగకు 29 టీఎంసీలు, గాలేరు నగరికి 38 టీఎంసీలు, హంద్రీ నీవాకు 40 టీఎంసీలు, తుంగభద్ర ఎగువకాలువకు 10 టీఎంసీలు, కడప-కర్నూలు కాలువకు 10 టీఎంసీల నీటిని వాడుకోవలసి ఉంది. అంటే మొత్తం 161 టీఎంసీలు కృష్ణా జలాలను వాడుకోవడానికి ప్రాజెక్టుల నిర్మాణం జరిగింది.
ఇవి కూడా చదవండి..
Banakacharla Project | సీమకు కావాల్సింది గోదావరి కాదు.. కృష్ణా జలాలే!
Banakacharla Controversy | ఆంధ్రా కాళేశ్వరం.. బనకచర్ల! ఇక్కడా, అక్కడా మేఘా కోసమే!
Banakacharla | పోలవరం – బనకచర్ల మనకొద్దంటూ ఏపీలో ఉద్యమం.. కారణాలివే..