Sabarimala | అయ్యప్ప భక్తులకు బంగారు లాకెట్లు..!

  • By: sr    news    Apr 14, 2025 7:38 PM IST
Sabarimala | అయ్యప్ప భక్తులకు బంగారు లాకెట్లు..!

Sabarimala | Gold Lockets

విధాత: శబరిమల అయ్యప్ప భక్తులకుమీదట బంగారు లాకెట్లను పంపిణీ కార్యక్రమాన్ని ట్రావెన్‌కోర్ దేవస్థానం సోమవారం ప్రారంభించింది. గర్భ గుడిలో పూజించిన బంగారు లాకెట్ల పంపిణీని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్​ వాసవన్ ప్రారంభించారు. మొదటి బంగారు లాకెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న ఏపీకి చెందిన భక్తుడికి మంత్రి అందించారు. ఆ తరువాత శబరిమల ప్రధాన పూజారి కందరారు రాజీవరు, టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, బోర్డు సభ్యుడు ఏ అజికుమార్ సహా మిగిలిన భక్తులకు లాకెట్లను పంపిణీ చేశారు. ప్రారంభోత్సవం రోజున 100కు పైగా లాకెట్లు అమ్ముడుపోయాయి.

అయ్యప్ప రూపంతో ఉన్న బంగారు లాకెట్లను గర్భ గుడిలో ఉంచి పూజ చేసిన తర్వాత భక్తులకు పంపిణీ చేస్తారు. అయ్యప్ప భక్తులు బంగారు లాకెట్ల పంపిణీపై హర్షాతీరేకాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడుకు చెందిన జీఆర్టీ జ్యువెల్లర్స్, కేరళకు చెందిన కల్యాణ్ జ్యువెల్లర్స్ 2 గ్రాములు, 4 గ్రాములు, 8 గ్రాముల్లో తయారు చేసే అయ్యప్ప బంగారు లాకెట్లు భక్తులకు విక్రయిస్తారు. 2 గ్రాముల బంగారు లాకెట్ ధర రూ.19,300, అలాగే 4 గ్రాముల బంగారు లాకెట్ ధర రూ.38,600 , ఇక 8 గ్రాముల బరువు ఉండే బంగారు లాకెట్ ధరను 77,200 రూపాయలకు అమ్ముతున్నట్లు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వెల్లడించింది.

బంగారు లాకెట్లు కావాలనుకునే వారు కచ్చితంగా శబరిమల వెళ్లాల్సి ఉండగా… ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చని.. అలాగే నగదు చెల్లించి కూడా పొందవచ్చని దేవస్థానం తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా బుక్ చేసుకోవాలనుకునే వాళ్లు WWW.Sabarimalaonline.org కు వెళ్లి గోల్డ్ లాకెట్లు బుక్ చేసుకుని డబ్బులు చెల్లించాలి. ఆ తర్వాత శబరిమల వెళ్లి.. వారు నగదు చెల్లింపు చేసిన రశీదును చూపిస్తే నేరుగా లాకెట్ అందజేస్తారు. ఇలా కాకుండా నేరుగా శబరిమల వెళ్లిన వాళ్లు ఆలయ ప్రధాన ప్రాంతమైన సన్నిధానంలోని దేవస్థానం పరిపాలనా కార్యాలయంలో నగదు చెల్లించడం ద్వారా పొందవచ్చని టీడీబీ పేర్కొంది.