Warangal: ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని డబ్బు, బంగారం స్వాహా! నిందితుడి అరెస్టు

  • By: sr    news    Mar 07, 2025 7:04 PM IST
Warangal: ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానని డబ్బు, బంగారం స్వాహా! నిందితుడి అరెస్టు

విధాత, వరంగల్: ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తానంటూ, నిట్‌ లాంటి కళాశాలలో సీటు ఇప్పిస్తా అంటూ బాధితుల నుండి లక్షల్లో డబ్బుతో పాటు బంగారు అభరణాలను స్వాహా చేసిన మోసగాడిని హన్మకొండ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి నుండి పోలీసులు సుమారు ఐదు లక్షల పదివేల రూపాయల విలువ గల బంగారు అభరణాలు, 2లక్షల 68 వేల రూపాయల నగదుతో పాటు మూడు సెల్‌ఫోన్లను, IDFC డెబిట్ కార్డు ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హన్మకొండ ఏసిపి దేవేందర్‌ రెడ్డి వివరాలను వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, కడప జిల్లా,వీరపునాయునిపల్లి మండలం, ఇందుకూరు కొత్తపల్లి గ్రామానికి చెందిన నిందితుడు కొమ్మ వివేకానంద రెడ్డి ఆలియాస్‌ కిషోర్‌ రెడ్డి (37) కొద్ది కాలం ప్రవైయిట్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. సహోద్యోగులను మోసం చేసిన సంఘటనలో నిందితుడుపై అంధ్రప్రదేశ్‌లో మూడు కేసులున్నాయి. జైలు జీవితం గడిపిన అనంతరం నిందితుడు తన మకాంను హన్మకొండకు మార్చుకున్నాడు. ఓ ప్రవైయిట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ మహిళా ఉపాధ్యాయురాలి పరిచయం చేసుకొన్నాడు.

తనకు వరంగల్‌ ఎన్‌.ఐ.టిలో పరిచయస్తులు వున్నారని ల్యాబ్‌ అసిస్టెంట్‌ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెవద్ద ఎనిమిది లక్షల రూపాయలు, కొడుకుకు ఎన్‌.ఐ.టిలో సీటు ఇప్పిస్తానని 60గ్రాముల బంగారు అభరణాలు తీసుకుని అక్కడి మకాం మార్చాడు. ఇదే రీతిలో నిందితుడు పేరు మార్చుకొని మరో ముగ్గురు బాధితుల నుండి ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డాడు. శుక్రవారం పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఇందులో పాల్గొన్న హన్మకొండ పోలీస్‌, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఏసిపి అభినందించారు.