GST వ‌సూళ్ల రికార్డు.. తొలిసారి 2.37 ల‌క్ష‌ల కోట్లు

  • By: sr    news    May 01, 2025 7:03 PM IST
GST వ‌సూళ్ల రికార్డు.. తొలిసారి 2.37 ల‌క్ష‌ల కోట్లు

విధాత, వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లలో సరికొత్త రికార్డు నమోదైంది. ఏప్రిల్‌ నెలలో రూ.2.37 లక్షల కోట్లు జీఎస్టీ రూపంలో వసూలైనట్లు కేంద్రం గురువారం వెల్లడించింది. గతేడాది ఏప్రిల్‌ నెలలో ఈ మొత్తం రూ.2.10 లక్షల కోట్లుగా ఉంది. తాజాగా ఆ రికార్డు బద్దలైంది. 2017 జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అత్యధిక వసూళ్లు నమోదైన నెలగా 2025 ఏప్రిల్‌ నిలిచింది. గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే జీఎస్టీ వసూళ్లు 12.6 శాతం మేర పెరగడం విశేషం.

అంతకుముందు నెలలో (మార్చి) జీఎస్టీ వసూళ్లు 1.96 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఏప్రిల్‌ నెల మొత్తం వసూళ్లలో దేశీయ లావాదేవీల ద్వారా రూ.1.9 లక్షల కోట్లు వసూళ్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈ మొత్తం 10.7 శాతం మేర పెరిగింది. దిగుమతైన వస్తువులపై వేసే జీఎస్టీ ద్వారా వచ్చే ఆదాయం 20.8 శాతం మేరకు పెరిగి రూ.46,913 కోట్లకు పెరిగింది. రూ.27,341 కోట్ల రిఫండ్లు జారీ అనంతరం నికర జీఎస్టీ వసూళ్లు 9.1 శాతం వృద్ధితో రూ.2.09 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.

రూ.90వేల కోట్ల నుంచి రూ.237లక్షల కోట్లకు

దేశంలో వివిధ రకాల పరోక్ష పన్నుల స్థానే 2017 జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. తొలి నెల రూ.92వేల కోట్లు వసూళ్లు నమోదయ్యాయి. 2018 ఏప్రిల్‌లో తొలిసారి జీఎస్టీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలు దాటాయి. కొవిడ్‌ కారణంగా రెండేళ్ల పాటు వసూళ్లు నెమ్మదించాయి. మళ్లీ 2022 ఏప్రిల్‌లో రూ.1.67 లక్షల కోట్ల వసూళ్లు నమోదయ్యాయి. ఆ పై ప్రతి నెలా రూ.1.50 లక్షల కోట్లు పైనే వసూళ్లు నమోదవుతూ వచ్చాయి. తొలిసారి 2024 ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్లు మార్కు దాటింది. సరిగ్గా ఏడాది తర్వాత రికార్డు వసూళ్లు నమోదు కావడం విశేషం.