Plane Crash | గతంలో హైదరాబాద్‌లోనూ ఘోర విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియాదే!

ఎయిర్ ఇండియా విమానాలు గతంలో పలు ప్రమాదాలకు గురయ్యాయి. ప్రమాదంలో ఒక్కరు చనిపోయినా ఘోరమే. ఇటువంటి ఘోరాల్లో తీవ్రమైనది మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో చోటు చేసుకున్న ప్రమాదం. ఆ ఘటనలో విమానం టేకాఫ్ తీసుకునే సమయంలో గోడకు గుద్దుకుని మండిపోయింది. అప్పటి బేగంపేట విమానాశ్రయంలోనూ ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది.
మాంట్ బ్లాంక్ ప్రమాదం: 1950, నవంబర్ 3 :
ఫ్రాన్స్ సమీపంలోని మాంట్ బ్లాంక్ వద్ద చోటు చేసుకున్న ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న ఉన్న మొత్తం 48 మంది చనిపోయారు. లాక్‌హీడ్ కాన్‌స్లెటేషన్ వీటీ సీక్యూపీ మాలిని విమానం.. జెనీవా వద్ద లాండ్ చేసే క్రమంలో పర్వతాన్ని ఢీకొన్నది.
మాంట్ బ్లాంక్ ప్రమాదం (రెండవది) : 1966 జనవరి 24:
ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దు సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నది. జెనీవా వెళుతున్న సమయంలో భారీ మంచు, తీవ్రమైన గాలుల కారణంగా ఎయిర్ ఇండియా ఫ్లైట్ 101 (బోయింగ్ 707..437 వీటీ డీఎంఎన్ కన్యాకుమారి.. మరోసారి మౌంట్ బ్లాంక్ పర్వతాన్ని ఢీకొన్నది. 1950లో సంభవించిన ప్రమాద స్థలికి చాలా దగ్గరలోనే ఈ ఘటన కూడా చోటు చేసుకున్నది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న సిబ్బంది సహా 117 మంది దుర్మరణం పాలయ్యారు.
హైదరాబాద్ ప్రమాదం : 1978 నవంబర్ 19 :
హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్ట్ నుంచి ముంబైకి (అప్పట్లో బొంబాయి) వెళుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఈ 687 బోయింగ్ 737-2ఏ8 వీటీ ఈఏఎం విమానం.. టేకాఫ్ తీసుకునే సమయంలో రన్వేకు దూరంగా ఉన్న ఒక ట్యాంకర్‌ను ఢీకొని.. దగ్ధమైంది. ఈ ఘోర దుర్ఘటనలో విమానంలో ఇద్దరు సిబ్బంది సహా 15 మంది చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 126 మంది ఉన్నారు. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ సైతం మృత్యువాత పడ్డాడు.
ఆరేబియా సముద్రం 1982 ఆగస్ట్ 19:
ముంబై నుంచి చెన్నైకి వెళుతున్న సమయంలో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఏఐ 403 (బోయింగ్ 747-237బీ, వీటీ ఈబీడీ ఎంప్రెస్ కనక అరేబియా సముద్రంలో పడిపోయింది. ప్రమాద కారణంగా స్పష్టంగా తెలియరాలేదు. అయితే.. క్యాబిన్ ప్రెషరైజేషన్ వ్యవస్థలో లోపం కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందన్న నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనలో ఆ సమయంలో విమానంలో ఉన్న మొత్తం 17 మంది సిబ్బంది చనిపోయారు.
మంగళూరు ప్రమాదం 2010 మే 22 :
అహ్మదాబాద్‌లో గురువారం చోటు చేసుకున్న ప్రమాదానికి ముందు జరిగిన ప్రమాదం ఇది. దుబాయి నుంచి మంగళూరు వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ IX 812 (బోయింగ్ 737 8HG (WL), VT AXV.. రన్‌వేను దాటుకుని గోడకు గుద్దుకుని దగ్ధమైంది. రన్‌వేకు దూరంగా, తక్కువ వేగంతో ల్యాండ్ చేయడం ఈ ప్రమాదానికి కారణంగా గుర్తించారు. ఆ సమయంలో విమానంలో 166 మంది ఉండగా.. ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది మాత్రం ప్రాణాలతో బయటపడగలిగారు.