Dolphins: విశ్వంలో తెలివైన జంతువు ఇదే.. మనిషితో సమానంగా ఆలోచించగలదు..

Dolphins: సృష్టిలో స్వయంగా ఆలోచించగల శక్తి కేవలం మనిషికి మాత్రమే ఉందన్న విషయం తెలిసిందే. అయితే మనిషితో సమానంగా తెలివి తేటలున్న జంతువు గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. సముద్రంలో జీవించే డాల్ఫిన్లు మనిషితో సమానంగా ఆలోచించగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డాల్ఫిన్లు సమస్యలను పరిష్కరించుకోవడంలో.. ఆలోచించడంలో ఇతర జంతువులకంటే ముందుంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
డాల్ఫిన్లు సమూహాలుగా జీవిస్తాయట. అంతేకాక పరస్పరం సహకరించుకుంటాయట. కొన్ని ఇతర జంతువులు కూడా సమూహాలుగా జీవిస్తాయి.. పరస్పరం సహకరించుకుంటాయి. అయితే తమ సమూహంలోని ఒక జంతువుకు గాయం అయితే డాల్ఫిన్లు వాటిని రక్షిస్తాయట. వేటాడటంలోనూ డాల్ఫిన్లు కలిసే ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు.
వేటాడేందుకు ప్రత్యేక సాధనాలు
డాల్ఫిన్‌లు వేటాడేందుకు కొన్ని సాధనాలను కూడా ఉపయోగిస్తాయట. ఆస్ట్రేలియాలోని షార్క్ బేలో డాల్ఫిన్‌లు సముద్రపు స్పాంజ్‌లను తమ ముక్కుపై ధరించి, సముద్ర గర్భంలో ఆహారం కోసం వెతకడాన్ని సైంటిస్టులు గుర్తించారు. ఇటువంటి ప్రవర్తన జంతువుల్లో అసాధారణమైనదని సైంటిస్టులు చెబుతున్నారు. డాల్ఫిన్‌లు అద్దంలో తమను తాము గుర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. ఈ “మిర్రర్ టెస్ట్” స్వీయ-అవగాహన ఉన్న జంతువులలో డాల్ఫిన్‌లను చేర్చిందని సైంటిస్టులు చెబుతున్నారు.
కమ్యూనికేషన్ చేసుకుంటాయా?
డాల్ఫిన్‌లు కొన్ని రకాలైన శబ్ధాలు, సంకేతాల ద్వారా సంక్లిష్టమైన సమాచారాన్ని పంపగలవని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఒకదానికి ఒకటి సందేశాలను పంపుకుంటాయట. సమూహంలో సమన్వయం చేస్తాయి. ఈ లక్షణాలు డాల్ఫిన్‌లను జంతు రాజ్యంలో అత్యంత తెలివైన జీవులలో ఒకటిగా చేస్తాయి. డాల్ఫిన్‌లు అసాధారణమైన బుద్ధిశక్తి కలిగిన జంతువులని సైంటిస్టులు చెబుతున్నారు. స్వీయ-అవగాహన వాటిని మనిషితో సమానమైన తెలివి ఉన్న జంతువులుగా చేస్తాయి. డాల్ఫిన్‌ల అధ్యయనం మనకు జంతు బుద్ధిశక్తి, మన సొంత బుద్ధిశక్తి గురించి మరింత అవగాహన కల్పిస్తున్నట్టు సమాచారం.