Site icon vidhaatha

Smita Sabharwal: ట్రాన్స్‌ఫర్‌పై.. భగవద్గీత స్లోకంతో స్మిత సబర్వాల్‌ ట్వీట్‌!

Smita Sabharwal:

బీఆరెస్‌ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగువెలిగి.. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు ఉన్న ఐఏఎస్‌ అధికారి స్మిత సబర్వాల్‌ తాజా చేసిన ట్వీట్‌ ఆసక్తిని రేపింది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ భూముల విషయంలో ఆమె చేసిన ట్వీట్‌.. ఆమె పోస్టింగ్‌కే ఎసరు తెచ్చిన విషయం తెలిసిందే.

అప్పటి వరకూ యూత్‌ అడ్వాన్స్‌మెంట్‌, టూరిజం, సాంస్కృతిక శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీగా పనిచేసిన స్మితాసబర్వాల్‌ను తాజాగా ఐఏఎస్‌ అధికారుల పునర్వ్యవస్థీకరణలో పెద్దగా ప్రభావం లేని, ఆమె గతంలో పనిచేసిన ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌ సెక్రటరీ పోస్టులోకి మార్చారు.దీంతో ఆమె ఎంతో ఆశపడిన మిస్‌వర్డల్‌ పోటీల నిర్వహణ బాధ్యతలకూ దూరం అయ్యారు.

ఈ నేపథ్యంలో తన పోస్టు మార్పిడిపై ఆమె ‘కర్మణ్యే వాధికారస్తే.. మా ఫలేషు కదాచనా’ అనే భగవద్గీత శ్లోకం జోడిస్తూ ఒక పోస్టు చేశారు. ప్రతిఫలం ఆశించకుండా తన విధిని తాను నిర్వహించానని చెబుతూ.. నాలుగు నెలల కాలంలో చేసిన పనులను చెప్పుకొన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న టూరిజం పాలసీ 25-30ని తీసుకొచ్చానని తెలిపారు. ఇది ఇప్పటి వరకూ నిర్లక్ష్యానికి గురైన టూరిస్ట్‌ సర్కిళ్లలో ఇన్వెస్ట్‌మెంట్లకు గట్టి ప్రాతిపదికను ఏర్పరుస్తుందని పేర్కొన్నారు.

రెండో అంశంగా.. డిపార్ట్‌మెంట్‌ పనితీరును పూర్తిగా మార్చివేశానని, జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకు కృషి చేశానని తెలిపారు. ఇక మూడోది.. మిస్‌ వర్డల్‌ పోటీలు. గ్లోబల్‌ ఈవెంట్‌కు పునాది వేశానని, ఇది అనేక అంశాల్లో తలుపులు తీస్తుందని పేర్కొన్నారు. సంతోషంగా, గౌరవంగా ఉందని చెబుతూ ట్వీట్‌ ముగించారు. ఈ ట్వీట్‌తో టేబుల్‌పై భగవద్గీత పుస్తకం ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.

Exit mobile version