Kavitha Letter to KCR | బీజేపీవైపు వెళతామన్న సంకేతాలు వెళ్లాయి! కేసీఆర్‌కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ ఇదేనా?

వక్ఫ్‌ చట్టం, బీసీ అంశాలు, ఎస్సీ వర్గీకరణ వంటి అంశాలను ప్రస్తావించకపోవడంతో పాటు కేసీఆర్‌ తరచూ మాట్లాడూ ఉర్దూ ప్రసంగం లేకపోవడంతో బీఆరెస్‌.. బీజేపీ వైపు మళ్లుతుందేమోనన్న సంకేతాలు కార్యకర్తల్లోకి వెళ్లాయని బీఆరెస్‌ ఎమ్మెల్సీ, కేసీఆర్‌ తనయ కవిత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె కేసీఆర్‌కు రాసినట్టు చెబతున్న ఒక లేఖ వైరల్‌గా మారింది. దీనిని కవిత ధృవీకరించాల్సి ఉన్నది.

  • By: TAAZ    news    May 22, 2025 7:12 PM IST
Kavitha Letter to KCR | బీజేపీవైపు వెళతామన్న సంకేతాలు వెళ్లాయి! కేసీఆర్‌కు ఆయన కుమార్తె కవిత రాసిన లేఖ ఇదేనా?

Kavitha Letter to KCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు ఆయన కూతురు, ఎమ్మెల్సీ కవిత రాసినట్టు చెబుతున్న లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లేఖలో పేర్కొన్న అంశాలు చూస్తే కవిత ఇటీవల పలు సందర్భాల్లో బీఆర్ఎస్ అధినాయకత్వంపై వ్యక్తం చేసిన అంశాలుగానే పరిగణిస్తున్నారు. లేఖలో కవిత పార్టీలోని పరిణామాలు.. తాజా రాజకీయ పరిస్థితులలో పార్టీ వైఖరులపై కుండ బద్దలు కొట్టినట్టు కనిపిస్తున్నది. ముఖ్యంగా కేసీఆర్ వ్యవహారశైలిపైన.. బీజేపీతో అనుసరించాల్సిన తీరుపైన.. కేడర్ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ పేరుతో నెగెటివ్, పాజిటివ్ అంశాల వారీగా తండ్రి కేసీఆర్‌కు పలు ప్రశ్నలు సంధిస్తూ.. సూచనలు చేశారు.

సానుకూల అంశాలు
వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు పార్టీ సీనియర్ నేతలతో మాట్లాడించి ఉంటే బాగుండేదని ఆ లేఖలో ఉంది. సభలో ధూంధాం కార్యక్రమం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో విఫలమైందన్నారు. పార్టీ శ్రేణుల్లో మీ స్పీచ్ పట్ల క్రేజ్‌ తగ్గలేదని రాశారు. కాంగ్రెస్ ఫెయిల్ ఫెయిల్ అని మీరు చెప్పినప్పుడు చాలా బాగుందని అనుకున్నారని వివరించారు. అపరేషన్ కగార్ పై మీరు మాట్లాడటం చాలమందికి నచ్చిందని.. పహల్గామ్ ఘటనపై సంతాపం వ్యక్తం చేయడం బాగుందన్నారు. మీరు రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలామందికి నచ్చిన అంశమని.. ఆయన మిమ్మల్ని రోజు తిడుతున్నప్పటికి మీరు హుందాగా వ్యవహరించారని కేడర్ నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందని తెలిపారు. తెలంగాణ అంటే బీఆర్ఎస్.. తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు మరింత బలంగా చెప్తారని చాలామంది అనుకున్నారని కవిత పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం.. తెలంగాణ గీతం విషయం మీరు మీ ప్రసంగంలో మెన్షన్ చేస్తారని ఎదురు చూశారని.. ఇంకొంచెం పంచ్‌లు ఎక్స్‌పెక్ట్‌ చేశారని తెలిపారు. మొత్తానికి పార్టీ శ్రేణులు స్పీచ్ పట్ల సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. పోలీసులకు వార్నింగ్ ఇవ్వడంపై కేడర్ నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు.

ప్రతికూల అంశాలు
స్పీచ్‌లో ప్రతికూల అంశాలలో ఉర్దూలో మాట్లాడకపోవడం, వక్ఫ్ బిల్లు మీద మాట్లాడకపోవడం, బీసీలకు 42% అంశం విస్మరించడం, ఎస్సీ వర్గీకరణ అంశం మీద మాట్లాడకపోవడం బాగాలేదని కవిత తన లేఖలో అభిప్రాయపడ్డారు. ఇంత పెద్ద మీటింగులో మళ్లీ పాత స్లొగన్స్ ఇవ్వడంతో.. వాళ్లు పాత పద్ధతిలో తెలంగాణ ఉద్యమకారులకు సదుపాయాలు కల్పించలేదన్న అభిప్రాయాలు కొన్ని నియోజకవర్గాల నుంచి వచ్చాయని కవిత పేర్కొన్నారు. పాత ఇన్‌చార్జీలకే లోకల్ బాడీస్ ఎలక్షన్స్ బీఫామ్స్ పంపిణీ బాధత్యలను పార్టీ అధిష్ఠానం ఇచ్చిందని ఇన్‌చార్జ్‌లు చెప్పుకొంటున్నట్లు కొన్ని నియోజకవర్గాల నుంచి తెలిసిందని కవిత తన తండ్రి దృష్టికి తీసుకొచ్చారు. లోకల్ బాడీ సర్పంచ్‌గా పోటీ చేయాలనుకునే వాళ్ళు రిలాక్స్డ్ గా ఉన్నారన్నారు. కానీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీగా పోటీ ఉండాలనుకునే వాళ్ళు ఇన్‌చార్జ్‌ల నుంచి కాకుండా రాష్ట్ర పార్టీ నుండి డైరెక్ట్ గా బీ ఫామ్ ఇవ్వాలని కోరుతున్నారని కవిత తన లేఖలో వెల్లడించారు.

బీజేపీపై మరింతగా దాడి చేయాల్సి ఉండే..
బీజేపీపై కేవలం రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడంతో చాలామంది ఫ్యూచర్‌లో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా? అనే అంచనాలు మొదలుపెట్టారని కవిత తన లేఖలో పేర్కొన్నారు. పర్సనల్ గా తనకు కూడా ఇంకా బలంగా మీరు బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడాల్సిందని అనిపించిందన్నారు. బహుశా తాను సఫర్ అయినందుకు తనకు అలా అనిపించి ఉండొచ్చని పేర్కొన్నారు. ఏదీ ఏమైనా ఇంకొంచెం గట్టిగా బీజేపీని టార్గెట్ చేయాల్సిందేమోనని కవిత లేఖలో అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పై క్రమంగా ప్రజల్లో క్షేత్ర స్థాయిలో నమ్మకం పోతున్నదని, వారు బీజేపీ వైపు వెళతారనే ఆలోచనలో బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి హెల్ప్ చేశామనే మెసేజ్ ను కాంగ్రెస్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లిందన్నారు. ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి మీరు మీ ప్రసంగంలో లేక తర్వాతైనా స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ మీరు ఇస్తారని అంతా భావించారని కవిత లేఖలో అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా 1-2 ప్లీనరీ పెట్టాలని..దీనిపై సీరియస్ గా ఆలోచన చేయాలని కవిత సూచించారు.

అందరికీ అందుబాటులో ఉండాలి
చాలామంది కేడర్, లీడర్స్ మీతో ఫోటో దిగాలని ప్రయత్నిస్తుంటే తనకు గర్వంగా ఉందని.. జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్, ఎమ్మెల్యే స్థాయి లీడర్స్ కూడా మీతో కలిసేందుకు అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారని కవిత లేఖలో స్పష్టం చేశారు. కొంతమంది ఎంపిక చేసుకున్న వారికే మీతో కలిసే అవకాశముంటుందన్న భావన బలంగా ఏర్పడిందని.. దయచేసి అందరినీ కలిసేందుకు ప్రయత్నించండని, అందరికీ అందుబాటులో ఉండండని కవిత తన లేఖలో తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ కు సూచించారు.

కవిత తన తండ్రి కేసీఆర్‌కు రాసినట్టు చెబుతున్న లేఖ ఇదే..

ఇవి కూడా చదవండి..

KCR: మారని కేసీఆర్ ఆలోచనా దృక్పథం! కొరవడిన ఆత్మ విమర్శ
MLC KAVITHA | నేను అంత మంచి కాదు.. రౌడీ టైపు: ఎమ్మెల్సీ కవిత