MLA Yennam Srinivas Reddy | అవకాశాలు అందిపుచ్చుకోవాలి : ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి

MLA Yennam Srinivas Reddy | విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: అవకాశాలను విద్యార్థులు అందిపుచ్చుకుని భవిష్యత్ లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో విద్యార్థుల కు స్టడీ మెటీరియల్ అందజేశారు. ఎమ్మెల్యే తన సొంత నిధులతో మహబూబ్ నగర్ ఫస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు 75 రోజుల పాటు స్థానిక అంబేద్కర్ కళాభవన్ లో ఉచిత కోచింగ్ పొందిన వారికి స్టడీ మెటీరియల్స్ ను అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్ ను ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చేయాలనే సంకల్పం తీసుకున్నానన్నారు.
ఈ ప్రాంతానికి చెందిన ఎందరో ప్రభుత్వ, ప్రైవేటు సెక్టార్ లలో ఉన్నత స్థానంలో నిలిచారని, విద్యార్థులు వారి అడుగుజాడల్లో పయనించాలని కోరారు. ఇప్పటికే టెట్,డీఎస్సీ పరీక్ష కోసం ఉచిత కోచింగ్ ఇచ్చామని, వారందరూ మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందన్నారు. గత పదేళ్లు గా బీఆర్‌ఎస్ హయాంలో ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లు రాలేదని, ఇప్పుడు మనం ఉద్యోగాలు ఇస్తుంటే కోర్టులో కేసులు వేస్తున్నారని, గ్రూప్ వన్ కూడా వారు చేసిన నిర్వాకం కారణంగా కోర్టులో పెండింగ్ లో ఉందన్నారు. నీళ్ళు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని, కానీ గత ప్రభుత్వం అలసత్వం వల్ల ఏ ఒక్క ఆశయం నెరవేరలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మహబూబ్ నగర్ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, నాని యాదవ్, సీజే బెనహార్, మాజీ కౌన్సిలర్ అంజద్ తదితరులు పాల్గొన్నారు.