ఒకే పర్యటనలో ములుగు కలెక్టర్ రెండు విధులు

ఎన్నికలు ఎదైనా తమ పరిధిలో వాటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టడం ఒక జిల్లా కలెక్టర్ కు ఎంతో ముఖ్యమైన విధి. అదే విధంగా మేడారంలాంటి మహాజాతర పనులను సకాలంలోపూర్తి చేయడం కూడా అంతే చాలెంజింగ్ అంశం. ఈ రెండు విధులను ఏకకాలంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ నిర్వహించారు.

  • By: Subbu |    news |    Published on : Dec 11, 2025 9:26 PM IST
ఒకే పర్యటనలో ములుగు కలెక్టర్ రెండు విధులు

విధాత, ప్రత్యేక ప్రతినిధి: ఎన్నికలు ఎదైనా తమ పరిధిలో వాటిని ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టడం ఒక జిల్లా కలెక్టర్ కు ఎంతో ముఖ్యమైన విధి. అదే విధంగా మేడారంలాంటి మహాజాతర పనులను సకాలంలోపూర్తి చేయడం కూడా అంతే చాలెంజింగ్ అంశం. ఈ రెండు విధులను ఏకకాలంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ నిర్వహించారు.

గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలు ములుగు జిల్లాలో కూడా సాగుతున్నాయి. ములుగు జిల్లాలో మొదటి విడత ఎన్నికలు నిర్వహిస్తున్న మండలాలలో ఏటూరు నాగారం, తాడ్వాయి మండలాలున్నాయి. గిరిజన మహాజాతర నిర్వహించే మేడారం కూడా తాడ్వాయి మండల పరిధిలోనే ఉన్నది. గురువారం ఎన్నికల తీరు తెన్నులను పరిశీలిస్తూ తాడ్వాయి మండలంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ దివాకర మేడారం గ్రామానికి వెళ్ళారు.

పనిలో పనిగా తన విధుల్లో భాగంగా మేడారంలో సాగుతున్న అభివృద్ధి పనులను సైతం పర్యవేక్షించి సంబంధిత అధికారులకు తగు సూచనలు చేశారు. ఎన్నికల విధి ఎంత ముఖ్యమో, సకాలంలో మేడారం జాతర పనులు పూర్తి చేయడం అంతే లక్ష్యంగా నిరంతర పర్యవేక్షణ, సమీక్ష చేస్తున్న కలెక్టర్ మరోసాని తన విధి నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. తాడ్వాయి మండలం మేడారం లోని ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. పరిశీలించారు. సిబ్బంది బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు.

అనంతరం ఆయన మేడారంలో సాగుతున్న పనులు పరిశీలించారు. మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయం అభివృద్ధి పనులను, నిర్ణీత గడువులోగా త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. సూచించారు. శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయ గద్దెల పునరుద్ధరణ అభివృద్ధి పనులను, దేవాలయ ప్రాంగణంలోని పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల రాతి నిర్మాణాలను, ఆలయ ప్రాంగణ ఫ్లోరింగ్ పనులను, రాతి స్తంభాల స్థాపన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

అదనపు లేబర్ ను ఉపయోగించుకొని 24 గంటలు షిఫ్ట్ ల వారిగా పనులు చేయాలని, నిర్మాణ పనులలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ పనులల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి, ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లు , సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.