Operation Sindoor: పాఠ్యాంశంగా ఆపరేషన్ సిందూర్.. ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు నిర్ణయం

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ సిందూర్ పై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత రక్షణ బలగాలు మొత్తం 9 ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాయి. ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో దేశ ప్రజలంతా మన సైనికశక్తి ప్రతిభను కొనియాడారు.
కాగా తాజాగా ఆపరేషన్ సిందూర్ ఘటనను మదర్సాలో ముఖ్య పాఠ్యాంశంగా చేరుస్తామంటూ తాజాగా ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు గురువారం ఉత్తరాఖండ్ మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు అధ్యక్షుడు ముఫ్తీ షామూన్ ఖాస్మీ ఓ ప్రకటనలో తెలిపారు. రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేయడం గమనార్హం.
పిల్లలకు దేశభక్తి, జాతీయ సమైక్యత భావన అలవర్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన ప్రకటించారు. ముస్లింలు మొత్తం ప్రస్తుతం భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారని.. మోదీ వెంటే ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదం భారత పౌరులను అమానుషంగా చంపిందని.. దీంతో దేశంలోని పౌరులందరూ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు.