కంచ గచ్చబౌలి భూములపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

  • By: sr    news    Apr 14, 2025 5:07 PM IST
కంచ గచ్చబౌలి భూములపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

విధాత : హైదరాబాద్‌లోని కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ప్రకృతిని నాశనం చేస్తూ, వన్యప్రాణులకు హానీ చేయడం కాంగ్రెస్‌ పాలనగా మారిందని మండిపడ్డారు. హర్యానాలోని యమునా నగర్‌లో 800 మెగావాట్ల అధునాతన థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మాణానికి మోదీ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.

2014 కంటే ముందు కాంగ్రెస్‌ పాలనను మనం అస్సలు మరిచిపోకూడదని మోదీ అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దేశం మొత్తాన్ని అంధకారంలోకి నెట్టేశారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇప్పటికీ అవే పరిస్థితులు ఉన్నాయని మండిపడ్డారు. రాజకీయాలు అనేవి తమకు అధికారం కోసం కాదని.. ప్రజలకు సేవ చేయడానికి ఒక మాధ్యమం మాత్రమేనని పేర్కొన్నారు. అదే కాంగ్రెస్‌ ప్రభుత్వానికి అలా కాదని అన్నారు. ఒకసారి కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను గమనిస్తే ఆ విషయం స్పష్టమవుతుందని చెప్పారు.

కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న హిమాచల్‌ ప్రదేశ్‌లో ఇప్పటికే అన్ని పనులు నిలిచిపోయాయని తెలిపారు. కర్ణాటకలో అయితే ప్రతిదీ ఖరీదైనదిగా మారిపోయిందని అన్నారు. అవినీతిలో కర్ణాటకను దేశంలోనే నంబర్‌వన్‌గా మార్చారని ఆరోపించారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి సన్నిహితులే స్వయంగా చెబుతున్నారని తెలిపారు.

ఇక గ్యారంటీలో పేరుతో తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని ప్రధాని మోదీ విమర్శించారు. హామీల అమలును వదిలేసి, అడవులపై బుల్డోజర్లను నడిపించడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం బిజీగా ఉందని మండిపడ్డారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మేం పర్యావరణాన్ని కాపాడుతుంటే, వాళ్లు అటవీ సంపదను సర్వనాశనం చేస్తున్నారని..ఇది కాంగ్రెస్ మోడల్ అని నరేంద్ర మోదీఆగ్రహం వ్యక్తం చేశారు.

స్వార్థానికి రాజ్యాంగాన్ని వాడుకున్న కాంగ్రెస్

సుదీర్ఘకాలం దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అధికార సంక్షోభం ఎదురైనప్పుడల్లా రాజ్యాంగాన్ని ప‌నిముట్టు త‌ర‌హాలో వాడుకుందని ప్రధాని మోదీ విమర్శించారు. హ‌ర్యానాలోని హిసార్‌లో ఉన్న మ‌హారాజ అగ్ర‌సేన్ విమానాశ్ర‌యంలో రూ.410కోట్లతో నిర్మించే కొత్త ట‌ర్మిన‌ల్ బిల్డింగ్‌కు ఇవాళ ప్ర‌ధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మోదీ ఎమ‌ర్జెన్సీతో అధికారాన్ని మ‌ళ్లీ రాబ‌ట్టుకునే ప్రయత్నంతో రాజ్యాంగ స్పూర్తిని కాంగ్రెస్ పార్టీ దెబ్బ‌తీసింద‌న్నారు. ప్ర‌తి ఒక్క పౌరుడికి అన్నీ ద‌క్కేలా చూడ‌డం రాజ్యాంగం ఉద్దేశం అని, కానీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మ‌డి పౌర స్మృతిని అమలు చేయ‌లేక‌పోయింద‌న్నారు. ఉత్త‌రాఖండ్‌లో యూసీసీ అమ‌లుకు ప్ర‌తిప‌క్షం స‌హ‌క‌రించాల‌న్నారు

బుజ్జగింపు రాజకీయాలకు రాజ్యాంగ దుర్వినియోగం

ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల‌కు రాజ్యాంగం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తే, కాంగ్రెస్ పార్టీ దాన్ని బుజ్జ‌గింపు రాజ‌కీయాల‌కు వాడుకుంద‌ని మోదీ విమర్శించారు. ఇటీవ‌ల కర్నాట‌క‌లోని కాంగ్రెస్ స‌ర్కారు ప్ర‌భుత్వ టెండ‌ర్ల కోసం మ‌తం ఆధారంగా రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించింద‌ని విమ‌ర్శించారు. రాజ్యాంగంలో అలాంటి వెస‌లుబాట్లు లేకున్నా అక్క‌డి ప్ర‌భుత్వం అలా చేసింద‌ని విమ‌ర్శించారు. బుజ్జ‌గింపు విధానాల వ‌ల్ల ముస్లిం వ‌ర్గానికి అన్యాయం జ‌రిగింద‌న్నారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం గ‌తంలో వ‌క్ఫ్ చ‌ట్టాల‌ను అమ‌లు చేయ‌లేద‌న్నారు. 2013లో, ఎన్నిక‌ల‌కు కొన్ని నెల‌ల ముందు ముస్లిం వ‌ర్గాన్ని ఆక‌ట్టుకునేందుకు వ‌క్ప్ చ‌ట్టాన్ని కాంగ్రెస్‌పార్టీ స‌వ‌ర‌ణ చేసింద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ ముస్లింల‌ను ప‌ట్టించుకోలేద‌ని, ఒక‌వేళ ఆ పార్టీ ఆ వ‌ర్గం గురించి ఆలోచించి ఉంటే, పార్టీ ప్రెసిడెంట్‌గా ముస్లింను నియ‌మించేద‌ని లేదంటే ముస్లిం అభ్య‌ర్థుల‌కే 50 శాతం టికెట్లు ఇచ్చేద‌న్నారు. ముస్లింల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఏనాడు ప‌నిచేయ‌లేద‌న్నారు.

ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న వ‌క్ఫ్ భూముల్ని కాంగ్రెస్ పార్టీ పేద‌ల‌కు ఇవ్వ‌లేద‌ని, కానీ ఆ భూముల్ని ల్యాండ్ మాఫియా వాడుకుంటోంద‌న్నారు. ద‌ళితులు, వెనుక‌బ‌డిన వ‌ర్గాలు, గిరిజ‌న‌లు భూముల్ని మాఫియాలు ఆక్ర‌మిస్తున్నాయ‌ని, కానీ పాస్మాండ ముస్లిం వ‌ర్గాల‌కు ఎటువంటి లాభం చేయ‌కుండా వ‌దిలేసిన‌ట్లు మోదీ విమర్శించారు. గిరిజ‌న భూముల్ని వ‌క్ఫ్ బోర్డు తాక‌లేద‌ని ప్ర‌ధాని పేర్కొన్నారు.వ‌క్ఫ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ ద్వారా అలాంటి అక్ర‌మాల‌కు చెక్ పెట్ట‌నున్న‌ట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.