పాక్ జాతీయులను వెనక్కి పంపండి: హోం మంత్రి అమిత్ షా

విధాత: రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్ని రాష్ట్రాలను కోరారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన శుక్రవారం మాట్లాడారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్థానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. హైదరాబాద్ లో 200 మందికిపైగా పాకిస్థానీయులు ఉన్నట్లుగా సమాచారం. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు వారందరిని వెనక్కి పంపించేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది.
పహల్గాంలో ఉగ్రవాదులు 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీయడంతో భారత్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కేబినెట్ కమిటీ ఆన్ సెక్యురిటీ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్ తో దౌత్యపర సంబంధాలను తెంచుకుంటు సింధూ జలాల ఒప్పందం నిలిపివేతతో పాటు.. పాక్ జాతీయులు భారత్‌ను వీడాలని నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరుల వీసాలను రద్దు చేసింది. గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలా మంది పాక్ జాతీయులకు భారత్‌లో పర్యటించే అవకాశాలను కల్పించింది. తాజా నిర్ణయం మేరకు సార్క్ వీసాలు ఉన్న పాక్ జాతీయులంతా 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29వ తేదీ వరకు అవకాశం ఉంది. ఇక పాక్ నుంచి కొత్త దరఖాస్తుదారులకు వీసా సర్వీసులను తక్షణమే నిలిపివేశామని విదేశాంగ శాఖ పేర్కొంది. దీంతోపాటు పాక్‌లో ఉన్న భారత జాతీయులు తిరిగి వచ్చేయాలని అడ్వైజరీ జారీ చేసింది.