Konda Surekha: భద్రకాళి చెరువు పూడికతీతలో వేగం పెంచాలి

Konda Surekha | Bhadrakali
విధాత, వరంగల్ ప్రతినిధి: వచ్చే వానకాలం సీజన్ రాకకు ముందుగానే భద్రకాళి చెరువు పూడికతీత పనులు పూర్తి కావాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. భద్రకాళి చెరువు పూడికతీత పనులను వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కె అర్.నాగరాజు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి, వరంగల్ , హనుమకొండ, జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, ప్రావీణ్య, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా చెరువు పూడికతీత పనుల వివరాలను కలెక్టర్, అధికారులు మంత్రికి వివరించారు. ప్రతిరోజు చెరువు పూడికతీత పనులు కొనసాగుతున్నాయని, సోమవారం నుండి విద్యుత్ లైట్లను, తగినంత సిబ్బందిని ఏర్పాటు చేసి రాత్రి వేళలోనూ పూడికతీత మట్టి తరలింపు ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని హనుమకొండ కలెక్టర్ ప్రావీణ్య మంత్రి కి వివరించారు. అదేవిధంగా పూడిక మట్టిని తీసుకుని వెళ్లి వచ్చే వాహనాలకు రెండు వైపులా అంతర్గత రోడ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఉన్న మార్గం ద్వారా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న దృష్ట్యా మరో మార్గాన్ని సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. చెరువు పూడికతీత పనులు, అందుకు సంబంధించిన ఏర్పాట్లను సాగునీటి పారుదల శాఖ ఈఈ శంకర్ మంత్రికి వివరించారు.
అదేవిధంగా జూ పార్క్ వైపు నుండి వచ్చే మురుగునీరును భద్రకాళి చెరువులో చేరకుండా ప్రణాళికను రూపొందిస్తే బాగుంటుందని కుడా ఛైర్మన్ వెంకట్రాంరెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై మంత్రి స్పందిస్తూ చెరువులోకి మురుగు నీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా బయటికి వెళ్లేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం నాటికి చెరువు పూడికతీత పనులు పూర్తయ్యే విధంగా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టాలన్నారు. చెరువు పూడికతీయడం ద్వారా నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, కుడా పీవో అజిత్ రెడ్డి, జిల్లా ఇరిగేషన్ అధికారి శంకర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.