HCU కంచ గచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టు కూడా నరకొద్దు.. సుప్రీం కీల‌క ఆదేశాలు

  • By: sr    news    Apr 03, 2025 3:34 PM IST
HCU కంచ గచ్చిబౌలి భూముల్లో ఒక్క చెట్టు కూడా నరకొద్దు.. సుప్రీం కీల‌క ఆదేశాలు

విధాత: HCU యూనివర్సిటీ కంచ గచ్చి భూముల వివాదంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. హైకోర్టు రిజిస్ట్రార్ వెంటనే కంచ గచ్చిబౌలి వెళ్లి అక్కడ చెట్ల నరికివేత మీద ఈ రోజు మధ్యాహ్నం వరకు రిపోర్ట్ ఇవ్వాలి అని సుప్రీం కోర్ట్ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను స్వయంగా సందర్శించి నివేదిక ఇవ్వాలని హైకోర్టు రిజిస్ట్రార్ ను ఆదేశించింది. తుది ఆదేశాలు జారీ చేసే వరకు భూముల్లో ఎలాంటి పనులు చేపట్టకూడదని స్పష్టం చేసింది. అక్కడ ఇంకొక్క చెట్టు కూడా నరకకుండా చూడాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని సైతం ఆదేశించింది. ఈ సందర్భంగా హైకోర్టులో విచారణపై తాము ఎలాంటి స్టే ఇవ్వడం లేదని పేర్కొంది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఓ రకంగా సీఎ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

సెంట్రల్‌ యూనివర్సిటీ వద్ద ఉన్న కంచ గచ్చిబౌలి భూములు 400 ఎకరాల్లోని చెట్లను నరికి వేస్తున్నారని.. అడ్డుకోవాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు. వన్యప్రాణులు ఉన్న చోట భూములను చదును చేయాలంటే.. ముందుగా నిపుణుల కమిటీతో అధ్యయనం చేయాల్సి ఉంటుందని.. అలాంటివేమీ చేయకుండా ప్రభుత్వం భూమిని చదును చేసే పనులు చేపడుతోందని పిటిషర్‌ తరపు న్యాయవాది ఆరోపించారు.

పర్యావరణానికి హానీ కలిగించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. గతంలో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పర్యావరణానికి హానీ కలిగించేలా ప్రభుత్వం చేస్తున్న పనులపై వెంటనే విచారణ జరపాలని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ ధర్మాసనం ఎదుట ప్రస్తావించారు. భూములను పరిశీలించి నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. అయితే 30ఏళ్లుగా ఆ భూమి వివాదంలో ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకవచ్చారు. అటవీ భూములని ఆధారాలు లేవని తెలిపారు. అయితే తాము హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వడం లేదని..తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్ధని సుప్రీంకోర్టు పేర్కొంది.

హైకోర్టు కేసు విచారణ 7వ తేదీకి వాయిదా

కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై హైకోర్టులో గురువారం మరోసారి విచారణ జరిగింది. 400 ఎకరాల్లో చెట్ల నరికివేత పనులు ఆపాలని దాఖలైన పిటిషన్లపై హైకోర్టు స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు విచారణను ఈ నెల 7వ తేదీకి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఆదేశించిన కోర్టు.. అప్పటిలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని సూచించింది. హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై కౌంటర్‌ దాఖలు చేసేందుకు ఏజీ హైకోర్టును గడువు కోరారు. ఈ మేరకు కోర్టు కేసును వాయిదా వేసింది. ఇదిలా ఉండగా.. ఈ భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టులోనూ విచారణ జరిగిన విషయం తెలిసిందే.