kishan reddy: రేపు హైదరాబాద్ లో తిరంగా యాత్ర.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
త్రివిద దళాల వీరోచిత పోరాటానికి మద్దతుగా శనివారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద తిరంగాయాత్ర నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా అందరూ హాజరై సైనికులకు మద్దతు పలకాలని కోరారు.

kishan reddy: విధాత, హైదరాబాద్ : త్రివిద దళాలకు మద్దతుగా శనివారం హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ వద్ద తిరంగా యాత్ర నిర్వహిస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీలకతీతంగా అందరూ తరలివచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. ఈ మేరకు ఆయన శుక్రవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పెహల్గామ్ ఉగ్రదాడికి వ్యతిరేకంగా భారత త్రివిద దళాలు వీరోచితంగా పోరాడాయని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
పిల్లల ముందు తండ్రిని, భార్యల ముందు భర్తలను, అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన ప్రపంచంలో ఇదే తొలిసారని పేర్కొన్నారు. ఈ ఘటనను అంతర్జాతీయ సమాజం తీవ్రంగా ఖండించిందని పేర్కొన్నారు. మానవ సమాజానికి సవాలుగా నిలిచిన టెర్రరిస్టులను కఠినంగా శిక్షించాలనే ఉద్దేశ్యంతోనే భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించిందని గుర్తు చేశారు. భారత సైన్యం ఉగ్రవాదుల ఇళ్ళు, శిబిరాలు, స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసిందని గుర్తు చేశారు.
జనసాంద్రత ఉన్న ప్రాంతాల్లో ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని, భారత సైన్యం, ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్లో భారత విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు కూడా హతమయ్యారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో హైదరాబాద్ నగరంలోనూ అనేక ఉగ్రఘటనలు జరిగాయని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.