Salmankhan:
విధాత: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు మరోసారి ఆగంతకుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. సల్మాన్ ఖాన్ ను అతని నివాసంలోనే చంపేస్తామని..అతని కారును బాంబుతో పేల్చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. ముంబై లోని వర్లీ రవాణా శాఖ కార్యాలయం అధికారిక వాట్సాప్ కు ఆగంతకుడు బెదిరింపు మెసేజ్ పంపాడు. ఈ ఘటనపై వర్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తనకు వస్తున్న వరుస బెదిరింపులపై ఇటీవల సల్లూ భాయ్ ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. తాను దేవుడిని నమ్ముతానని.. ఆ అల్లానే అన్నీ చూసుకుంటాడంటూ వ్యాఖ్యానించారు. ‘నేను దేవుడిని ఎక్కువగా నమ్ముతాను. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయుష్షు ఉన్నంత కాలం జీవిస్తాను. ఈ బెదిరింపులతో ఇంటి వద్ద, షూటింగ్ లొకేషన్స్ ఇలా అన్ని చోట్లా నా చుట్టూ భద్రత పెరిగింది. కొన్ని సార్లు ఈ భద్రత కూడా సవాలుగా అనిపిస్తుందని నిర్వేదం వెల్లడించారు.
వరుస బెదిరింపులతో డేంజర్ లో సల్మాన్
1998 కృష్ణ జింక కేసు నుంచి సల్మాన్ ఖాన్ గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హిట్ లిస్టులో కొనసాగుతున్నాడు. ఈ గ్యాంగ్ నుంచి సల్మాన్ అనేక సార్లు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు. గతేడాది ఏప్రిల్‌లో గెలాక్సీ అపార్ట్‌మెంట్ వద్ద కాల్పుల ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మోటారు బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సల్మాన్ ఇంటి ముందు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే జూన్‌లో మరోసారి సల్మాన్ హత్యకు కుట్ర జరిగింది. పన్వేల్ ఫామ్‌హౌస్ నుంచి ఇంటికి వెళ్తున్న మార్గంలో సల్మాన్‌పై దాడి చేయాలని ఈ గ్యాంగ్ ప్లాన్ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు వరుస హత్య బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్ భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ముంబయి పోలీసులు సల్మాన్‌కు వైప్లస్ భద్రతను సమకూర్చారు. మరిన్ని రక్షణ చర్యల్లో భాగంగా సల్మాన్‌ఖాన్ ముంబైలో నివాసంఉండే గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌కు బుల్లెట్‌ఫ్రూఫ్ గ్లాస్ ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేసుకున్నారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో సల్మాన్‌ఖాన్ షూటింగ్స్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అవుట్‌డోర్ షూటింగ్స్‌కు దూరంగా ఉంటున్నారు.