నాలుగున్నర లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారుల సర్వీస్‌ రిజిస్టర్ల డిజిటలైజేషన్‌లో షాకింగ్‌ నిజాలు..

తెలంగాణలో నాలుగున్నర లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, అధికారుల సర్వీస్ రిజిస్టర్ల డిజిటలైజేషన్ ప్రక్రియ జరుగుతోంది. దీనికి ప్రభుత్వం ఈ నెలఖారు గడువు విధించింది. ఈ నేపథ్యంలో ఎన్నో షాకింగ్ నిజాలు బయటపడుతు న్నాయి. అనేక మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల ఎస్ఆర్ లో కీలకమైన ఎంట్రీలు అసలు లేకపోవడం, కొన్ని చోట్ల పాక్షికంగా మాత్రమే నమోదు చేయడం, మరికొన్ని చోట్ల తప్పుల తడకగా ఎంట్రీలు చేయడం వంటి తీవ్రమైన లోపాలు వెలుగు చూస్తున్నాయి. మరి ఈ ఘోర తప్పిదాలకు బాధ్యులెవరు? దీనిపై ప్రభుత్వ నిబంధనలు ఏం చెప్తున్నాయి? క్షేత్రస్థాయిలో జరుగు తున్నదేంటి?

telangana employees service register digitalisation irregularities

ఉద్యోగులకు, సర్వీస్ రిజిస్టర్ అనేది వారి జీవన రేఖ లాంటిది. ఇందులో ఎంట్రీలు లేకపోయినా లేదా తప్పుగా నమోదైనా, దానికి పూర్తి బాధ్యత సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణాధికారులదే (డీడీవో), దీనిపై స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు, నిబంధనలు ఉన్నాయి. ఫండ మెంటల్ రూల్స్ – అనెక్టర్-2, పార్ట్- 3 పేరా(7) ప్రకారం.. ఒక ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు బదిలీపై కొత్త స్థానానికి వచ్చిన వెంటనే, సదరు కార్యాలయ / పాఠశాల ప్రస్తుత డీడీవో ఆ ఉద్యోగి ఎస్ఆర్ ను పూర్తిగా వెరిఫై చేయాలి. ఒకవేళ గతంలో జరగాల్సిన ఎంట్రీలు ఏవైనా లేకపోయినా, లేదా తప్పులు ఉన్నా.. వెంటనే వాటిపై రిమార్క్స్ రాసి, సరిచేయడం కోసం పూర్వ డీడీవోకు ఆ సర్వీస్ రిజిస్టర్ ను వెనక్కి పంపించాలి. నిబంధనలు ఇంత పకడ్బం దీగా ఉన్నా, క్షేత్రస్థాయిలో అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరి స్తున్నారో ఈ ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు..

ఈ అన్యాయాన్ని ఎవరు సరిదిద్దాలి?

ఒక ఉపాధ్యాయునికి 2023లో ఆటోమాటిక్ అడ్వాన్స్ మెంట్ స్కేల్ మంజూరైంది. కానీ, అప్పటి డీడీవో దానిని ఎస్ఆర్ లో నమోదు చేయలేదు. ఆ టీచర్ కూడా గమనించలేదు. 2024లో ఆ ఉపాధ్యాయుడు బదిలీపై వేరే పాఠశాలకు వెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఆర్ డిజిటలైజేషన్ ప్రక్రియలో ఈ ఎంట్రీ లేని విషయం బయటపడింది. ఇక్కడ తప్పు ఎవరిది? పైపైన చూస్తే.. ఎంట్రీ చేయని పూర్వ డీడీవోదే తప్పు అని ఎవరైనా చెబుతారు. కానీ, నిబంధనల ప్రకారం కొత్త డీడీవో కూడా సమాన బాధ్యుడే అవుతాడు! ఎందుకంటే, ఉద్యోగి బదిలీపై రాగానే ఎస్ఆర్ వెరిఫై చేయాల్సిన బాధ్యతను కొత్త డీడీవో పూర్తిగా విస్మరించారు. అటు పూర్వ డీడీవోలు తమ బాధ్యతలను ఇష్టారాజ్యంగా వదిలే యడం … అటు కొత్త డీడీవోలు కూడా తమకేమీ పట్టనట్లు, కనీస వెరిఫి కేషన్ చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెరసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు తీరని వేదన కలిగిస్తోంది. బాధిత ఉద్యోగి లేదా ఉపాధ్యాయుడు గనుక ఉన్నతాధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే.. చట్టాన్ని, నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేసే అధికారి ఉంటే మాత్రం ఇద్దరు డీడీవో లపై క్రమ శిక్షణ చర్యలు తప్పవు.

అటెండెన్స్ రిజిస్టర్ కాదు..

సర్వీస్ రిజిస్టర్ల నిర్వహణ అనేది కేవలం ఒక అటెండెన్స్ రిజిస్టర్స్ లాంటిది కాదు. అది ఒక ఉద్యోగి భవిష్యత్తు, పెన్షన్ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న పత్రం. డిజిటలైజేషన్ పూర్తయ్యే లోపు డీడీవోలు తమ పరిధిలోని ఉద్యోగుల ఎస్ఆర్ లను పునఃపరిశీలించాలి. తన పరిధిలో అవసరమైన ఎంట్రీలు చేయాలి. పూర్వ స్కూలు/ఆఫీసులో మిస్సెన ఎంట్రీలు చేయించాల్సిన బాధిత కూడా పూర్తిగా తనదే. ఈ చట్టపరమైన విధులను విస్మరించిన పక్షంలో చర్యలకు గురికాక తప్పదు. అధికారులూ… తస్మాత్ జాగ్రత్త!

– మానేటి ప్రతాప్ రెడ్డి, రాష్ట్ర గౌరవాధ్యక్షులు TRTF, మొబైల్: 9848481028

Latest News