Southwest Monsoon | రుతుపవనాల నిర్దిష్ట అంచనా వ్యవస్థకు ఎన్నేళ్లు పట్టిందో తెలుసా?
రుతుపవనాల రాకను అంచనా వేసేందుకు ఐఎండీ 1987 వరకూ వాకర్ నమూనానే అనుసరిస్తూ వచ్చింది. ఈ అంచనాలు మరీ అంత నిర్దిష్టంగా ఉండేవి కావు. దానికి తోడు వాకర్ గుర్తించిన అనేక పారామీటర్లు కాలక్రమేణా ఔచిత్యాన్ని కోల్పోయాయి. ఆ నమూనాకు మార్పులు చేసేందుకు ఐఎండీ శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేశారు.

- 1887లో మొదలైన భారత వాతావరణ విభాగం
- అప్పటి నుంచి అనేక నమూనాలతో అంచనా
- అనేక మంది శాస్త్రవేత్తల కృషితో ఈ స్థాయికి
- మరింత అభివృద్ధి చెందాలన్న నిపుణులు
Southwest Monsoon | జూన్ 1న కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకుతాయని తొలుత అంచనా వేసిన భారత వాతవరణ విభాగం.. కొద్ది రోజుల క్రితం మరింత కచ్చితత్వంతో అంచనా వేసి.. ఐదు రోజుల ముందే అంటే.. జూన్ 27 నాటికే రుతుపవనాలు (Southwest Monsoon) భారతదేశంలోకి ప్రవేశిస్తాయని ప్రకటించింది. అయితే.. రుతుపవనాల రాకను ఎలా అంచనా వేస్తారు? దానికి ఉన్న పద్ధతులు ఏంటి? అనేది ఆసక్తికర అంశం. భారతదేశానికి నైరుతి రుతుపవనాలు అత్యంత కీలకమైనవి. ప్రధానంగా వర్షాధారితమైన మన వ్యవసాయ రంగానికి నైరుతి రుతుపవనాలే ప్రధానం. ఎందుకంటే.. ఏడాది మొత్తంలో కురిసే వర్షంలో ఒక్క నైరుతి సీజన్‌లోనే మూడు నెలల్లో 70 శాతం వర్షం కురుస్తుంది. ఇంతటి ముఖ్యమైన ఈ రుతుపవనాల రాక ఎలా ఉండబోతున్నది? వాటి ప్రభావంతో కురిసే వర్షాలు ఏ స్థాయిలో ఉండబోతున్నాయనేది ఒక వ్యవస్థీకృత కృషి ద్వారా అంచనా వేస్తారు.
బ్రిటిష్ కాలంలో ఏర్పడిన ఐఎండీ
నిజానికి ఈ వ్యవస్థను 1877లో బ్రిటిష్ పాలన సమయంలో ఏర్పాటు చేశారు. అంతకు రెండు సంవత్సరాల ముందు భారత వాతావరణ విభాగం (IMD) ఏర్పాటైంది. హెన్రీ ఫ్రాన్సిస్ బ్లాన్‌ఫోర్డ్ అనే బ్రిటిష్ వాతావరణ శాస్త్రవేత్త, పాలియోంటాలజిస్ట్ అప్పటి భారత ప్రభుత్వానికి తొలి వాతావరణ రిపోర్టర్‌గా పనిచేశారు. ఐఎండీ ఏర్పాటుకు రెండేళ్లకు ముందు దక్కన్ పీఠభూమిలో 1876లో పంటలు గణనీయంగా దెబ్బతినడం ప్రారంభమైంది. దాని ఫలితంగా 1876, 1878 సంవత్సరాల మధ్య భయానక కరువు (Great Famine of 1876-78) వచ్చింది. దాని ప్రభావం 1877 నాటికి మొత్తం దేశం మీద పడింది. దీంతో రుతుపవనాల రాకను, దేశంలో వర్షపాతాన్ని అంచనా వేయాల్సిన తక్షణ ఆవశ్యకత ఉందని నాటి వలసపాలక ప్రభుత్వం గుర్తించింది. వాస్తవానికి ఇందులో వలస పాలకుల ప్రయోజనం కూడా ఉందని అమెరికాలోని క్విన్నిపియాక్ యూనివర్సిటీకి సమర్పించిన ‘రుతుపవనాలు, కంప్యూటర్లు, శాటిలైట్స్: భారతదేశంలో వాతావరణ పర్యవేక్షణ చరిత్ర, రాజకీయాలు అనే తన పత్రంలో రమేశ్ సుబ్రమణియన్ పేర్కొన్నారు. రుతుపవనాల విజయం వ్యవసాయ ఉత్పత్తిని, నదులు, తీరాలు, నౌకాయాన మార్గాల ఆరోగ్యాన్ని నిర్దేశించిందని, అంటే.. అది బ్రిటిష్ ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగిందని ఆయన 2021లో సమర్పించిన పత్రంలో రాశారు.
తొలిసారి రుతుపవనాలను అంచనా వేసింది ఈయనే
మొట్టమొదటిసారి రుతుపవనాల రాకను బ్లాన్‌ఫోర్డ్ 1882, 1885లో అందాజుగా అంచనా వేశారు. ఆయన హిమాలయాల మంచు కరగడం, భారత ఉపఖండంలో ఎంత వర్షపాతం పడిందనే అంశాలను ఆయన విశ్లేషించారు. 1886లో దీర్ఘకాల ముందస్తు అంచనాలను తొలిసారిగా ఆయన వెలువరించారు. తర్వాత ఆయన స్థానంలోకి వచ్చిన సర్ జాన్ ఎలియట్.. బ్లాన్‌ఫోర్డ్ కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లారు. హిమాలయాల్లో మంచు డాటాతోపాటు.. ఏప్రిల్, మే నెలల్లో స్థానిక వాతావరణ పరిస్థితులను, హిందూ మహాసముద్రం, ఆస్ట్రేలియాపై ఉన్న పరిస్థితులను కూడా జోడించారు. అయితే.. బ్లాన్‌ఫోర్డ్ తరహాలో కరువులను మాత్రం ఆయన పసిగట్టలేకపోయారు. 1899-1900లో సాధారణం కంటే మెరుగైన వర్షపాతం ఉంటుందని ఆయన అంచనా వేస్తే.. అది రివర్స్ అయి.. కరువు కాటకాలు నెలకొని.. ఆకలిచావులు పెద్ద ఎత్తున సంభవించాయి. సుమారు 45 లక్షల మంది నాటి క్షామంలో చనిపోయి ఉంటారని అంచనా. అయితే.. స్థానిక పరిస్థితులతోపాటు.. అంతర్జాతీయ పరిస్థితుల ప్రభావాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని భావించిన తొలి వలస పాలన అధికారి సర్ గిల్బర్ట్ వాకర్. ఆయన 1904లో ఎలియాట్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన భౌతిక శాస్త్రవేత్తతోపాటు.. గణాంకాల శాస్త్రవేత్త కూడా. ఆయన రుతు పవన వర్షాలకు, మనుపటి భూగోళ వాతావరణ, భూమి, మహా సముద్రాల పారామీటర్ల పరస్పర సంబంధాలతో వస్తుగత నమూనాలను (ఆబ్జెక్టివ్ మోడల్స్) అభివృద్ధి చేశారు. తన అంచనాలను తయారు చేసుకునేందుకు ఆయన హిందూ మహాసముద్రంతో భారత రుతుపవనాలకు ఉన్న చారిత్రక సంబంధాలపై 28 రకాల పారామీటర్లను లేదా జోస్యాలను గుర్తించారు. ప్రపంచ పీడన నమూనాలలో తరచూ మార్పులకు లోనయ్యే మూడు కీలకమైనే వైవిధ్యాలను వాకర్ వివరించారు. అవి.. సదరన్ ఆసిలేషన్ (SO), నార్త్ అట్లాంటిక్ ఆసిలేషన్ (NAO), నార్త్ పసిఫిక్ ఆసిలేషన్ (NPO). వీటిలో సదరన్ ఆసిలేషన్ అనేది పసిఫిక్ మహాసముద్రం ఉపరితల జలాలు వేడెక్కే ప్రక్రియ లేదా ఎల్ నినోతో జాకబ్ బిజెర్క్‌నెస్ అనే శాస్త్రవేత్త లింక్ చేశారు. భారత భూభాగాన్ని వాకర్.. మూడు ఉప ప్రాంతాలుగా వర్గీకరించారు. అందులో ఒకటి పెనిన్సులా, ఈశాన్యం, నైరుతి.
2007లో కీలక పరిణామం
రుతుపవనాల రాకను అంచనా వేసేందుకు ఐఎండీ 1987 వరకూ వాకర్ నమూనానే అనుసరిస్తూ వచ్చింది. ఈ అంచనాలు మరీ అంత నిర్దిష్టంగా ఉండేవి కావు. దానికి తోడు వాకర్ గుర్తించిన అనేక పారామీటర్లు కాలక్రమేణా ఔచిత్యాన్ని కోల్పోయాయి. ఆ నమూనాకు మార్పులు చేసేందుకు ఐఎండీ శాస్త్రవేత్తలు పలు ప్రయోగాలు చేశారు. అయినా నిర్దిష్టంగా అంచనా వేయలేకపోయారు. ఆ తర్వాత వసంత్ ఆర్ గౌరీకర్ నమూనా 1988లో వచ్చింది. 1994, 1997, 1999లలో అంచనాలు సరిపోలలేదు. 2002లో కరువు పరిస్థితుల నేపథ్యంలో పవర్ రిగ్రెషన్ మోడల్‌ను పూర్తిస్థాయిలో మూల్యాంకనం చేశారు. 2003లో ఐఎండీ రెండు కొత్త నమూనాలను ప్రతిపాదించింది. అందులో ఒకదాంట్లో ఎనిమిది, మరోదాంట్లో పది పారామీటర్లు ఉన్నాయి. వీటి ప్రకారం ప్రతిఏటా ఏప్రిల్ మధ్యలో ఒక అంచనాను, జూన్ చివరిలో రెండో అంచనాను వేసేవారు. కొత్త నమూనాలు 2003లో రుతుపవనాల ఆగమనాన్ని నిర్దిష్టంగా అంచనా వేశాయి. కానీ.. 2004 కరువును పసిగట్టలేదు. దీంతో మళ్లీ శాస్త్రవేత్తలు కొత్త ప్రయోగాలకు సిద్ధమయ్యారు. రెండంచల వ్యవస్థకు దన్నుగా 2007లో ఐఎండీ స్టాటిస్టికల్ ఎన్‌సీమబుల్ ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్ (SEFS)ను తీసుకొచ్చింది. దీనిలో మరిన్ని పారామీటర్లను తగ్గించారు. ఏప్రిల్ మధ్యలో అంచనాకు సంబంధించిన ఎనిమిది పారామీటర్ల వ్యవస్థను ఐదుకు కుదించారు. పది పారామీటర్ల రెండో వ్యవస్థను ఆరుకు తగ్గించారు. ఐఎండీ.. సమిష్టి అంచనాల కాన్సెప్ట్‌ను కూడా తీసుకొచ్చింది. దీనిలో అన్ని అంచనాల కలయికల ఆధారంగా సాధ్యపడే అన్ని అంచనా నమూనాలు ఒకే బలమైన అంచనాను రూపొందించేందుకు ఉద్దేశించారు. ఈ కొత్త వ్యవస్థ రుతుపవనాల రాకను నిర్దిష్టంగా అంచనా వేయడంలో ఐఎండీకి ఎంతగానో సహకరించింది. అంచనాకు, వాస్తవ స్థితికి మధ్య తేడాను గమనించినట్టయితే.. 2007 నుంచి 2018 మధ్యలో దీర్ఘకాలిక సగటులో 5.95 శాతం మాత్రమే. ఇది అంతకు ముందు 1995, 2006 మధ్య 78.94 శాతంగా ఉండేది. అయితే.. దీనని మరింతగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉన్నది. మరింత నిర్దిష్టంగా అంచనాలు రూపొందించడం వల్ల దేశానికి అత్యంత కీలకమైన రుతుపవనాల రాక, జాప్యాలపై తగిన అవగాహనతో ఉండేందుకు వీలువుతుంది. తద్వారా అవసరమైన చర్యలు తీసుకునే అవకాశం కలుగుతుంది.